ఫోన్ల ట్యాపింగ్‌ 1200 మందికిపైనే..

Tapping of phones More than 1200 people..– జడ్జీలు, న్యాయవాదులనూ వదలని వైనం
– ప్రస్తుత సీఎం, మంత్రులు, వారి అనుచరుల నగదు పెద్దఎత్తున స్వాధీనం
– 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లూ ట్యాపింగ్‌
– ప్రశ్నించేవారిపైనా నిఘా
– ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే : వాంగ్మూలనా పత్రంలో పేర్కొన్న ప్రణీత్‌రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఉదంతంలో భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడైన డీఎస్పీ ప్రణీత్‌రావు దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి తాము జడ్జీలను కూడా వదిలిపెట్టలేదని ఇచ్చిన స్టేట్‌మెంట్‌ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో కలంకానికి దారితీసింది. అంతేగాక, 1200 మందికిపైగా విపక్ష నాయకులు, బ్యూరోక్రాట్లు, జడ్జీలు, విద్యార్థి, కార్మిక సంఘాల నేతలు, జర్నలిస్టులతో పాటు పారిశ్రామిక వేత్తలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లనూ ట్యాపింగ్‌ చేసినట్టు ప్రణీత్‌రావు అంగీకరించారు. ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా రెండు లాగిన్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి 17 కంప్యూటర్లతో ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ వ్యవహారానికి పాల్పడినట్టు ఒప్పుకున్నారు. ప్రణీత్‌రావు వాంగ్మూలం ప్రకారం.. రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికలు మొదలుకొని ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతిపక్షాలను తొక్కిపెట్టి వారి వ్యూహాలను పసిగట్టి తిరిగి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్‌ కీలక నేతల లక్ష్యంతో ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నిర్వహించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారు. వాటి ద్వారా వచ్చిన సమాచారం మేరకు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన ప్రముఖ నాయకులకు చెందిన కొన్ని వ్యాపార సంస్థలతో పాటు వారి సన్నిహితుల నుంచి ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో డబ్బులను ప్రణీత్‌రావు టీమ్‌ సీజ్‌ చేసింది. ఈ డబ్బులను హవాలకు చెందినవిగా చూపెట్టారు. వాటిలో ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామితో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నలుగురు అనుచరులకు చెందిన డబ్బులను భారీ మొత్తంలో సీజ్‌ చేశారు. ప్రతిపక్షమే కాకుండా స్వపక్షంలో ఉంటూ కాస్త నాయకత్వంతో విభేదిస్తున్న బీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లనూ ట్యాపింగ్‌ చేశారు. వచ్చిన సమాచారాన్ని ప్రభాకర్‌రావుకు ఎప్పటికప్పుడు పంపారు. ఆ సమాచారాన్ని ఆయన బీఆర్‌ఎస్‌ కీలక నేతలకు తిరిగి పంపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన విద్యార్థి, కార్మిక సంఘాల నేతలతో పాటు సోషల్‌మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాక్టివ్‌గా ఉండేవాళ్ల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారు. వచ్చిన సమాచారంతో బెదిరించడం, చిత్రహింసలకు గురిచేయడం కూడా జరిగింది. ఏకంగా జ్యుడీషియల్‌ వ్యవస్థలో సైతం తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి జడ్జీల(ఇందులో ఒక జడ్జి పేరు ప్రస్తావించడం జరిగింది) ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారు. అలాగే, పలువురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసి వారు ప్రభుత్వం తరఫున సక్రమంగా వాదిస్తున్నారా? లేదా? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విధంగా తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవరివైనా సరే ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం, బెదిరించడం వంటి చర్యలకు ప్రభాకర్‌రావు ఏర్పాటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ బృందం పాల్పడింది. చివరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియగానే కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులను, సాఫ్ట్‌వేర్లను ధ్వంసం చేయాలని ప్రభాకర్‌రావు ప్రణీత్‌రావును ఆదేశించారు. ఆ మేరకు కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు ఆ ముక్కలను తీసుకెళ్లి నాగోల్‌ సమీపంలోని మూసీ నదిలో పడేశారు. మరోవైపు పెన్‌డ్రైవ్‌లు, ఐఫోన్లలో ఉన్న సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి వాటిని తీసుకెళ్లి బేగంపేటలోని నాలాలో వేశారు. ధ్వంసం చేసిన హార్డు డిస్కుల స్థానంలో 50 కొత్త హార్డ్‌ డిస్కులను తీసుకొచ్చి పెట్టారు. మొత్తం మీద ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్‌రావు తూచా తప్పకుండా పాటించారు. ఇదివరకే, అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మరో అదనపు ఎస్పీ తిరుపతన్నలు తాము బీఆర్‌ఎస్‌ కీలక నేతల ఆదేశాల మేరకే నడుచుకున్నామని ప్రకటించడం, ఇందులో ఐ న్యూస్‌ సీఈఓ శ్రవణ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారని తెలపడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక మలుపులు తీసుకున్నది. ఇక, ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావును విచారించడమే మిగిలి ఉందనీ, అతన్ని విచారించాక ఈ కేసులో తేలే రాజకీయ ప్రముఖుల వైపు తమ దృష్టి మరలుతుందని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

Spread the love