హక్కు పత్రాలివ్వొద్దని హైకోర్టులో పిల్‌

– గిరిజన సంక్షేమ శాఖ కౌంటర్‌ పిటిషన్‌ వేయాలి : తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోడు భూములకు హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ కు చెందిన పద్మనాభరెడ్డి హైకోర్టులో పబ్లిక్‌ లిటిగేషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ తక్షణమే కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ గురువారం శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు. శతాబ్దాలుగా అడవుల్లో అంతర్భాగంగా ఉన్న గిరిజనులకు భూమిపై హక్కులు కల్పించడంలో స్వాతంత్రం ముందు, తర్వాత కూడా పాలక ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయని గుర్తుచేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ను వామపక్షాల ఒత్తిడితో నాటి యూపీఏ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. అడవుల్లో అంతర్భాగంగా ఉన్న గిరిజనులు, పేదలకు అటవీ భూములపై హక్కులు కల్పించటం వలన అడువులు నాశనమవుతాయనీ, పర్యావరణం దెబ్బతింటుందని ఆనాడే కొందరు పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టులో కేసులు వేశారని గుర్తు చేశారు. వాటన్నిటిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే..ఉన్నత న్యాయస్థానం చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు సైతం అంగీకారం తెలిపిన చట్టాన్ని నిలుపుదల చేయాలని ఇప్పుడు పద్మనాభరెడ్డి వంటివారు హైకోర్టులో ‘పిల్‌’ వేయడం హాస్యా స్పదంగా ఉన్నదని విమర్శించారు. పర్యావరణం పట్ల పద్మనాభ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడవులు, అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తూ పర్యావరణాన్ని ధ్వంసం చేసేవిధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెస్తున్న అటవీ సంరక్షణ నియమాలు 2022 బిల్లును ఎందుకు వ్యతిరేకించటం లేదని ప్రశ్నించారు. అడవుల్లో జీవిస్తున్న గిరిజనులు అడవులను కాపాడుతున్నారని గుర్తుచేశారు. నామమాత్రంగా చట్టాన్ని అమలు చేయటం వలన నాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం తెలంగాణ పరిధిలో 15 లక్షల ఎకరాలకు గాను కేవలం 3 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలిచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టాన్ని తిరిగి అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఫలితంగా 2021లో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తానని అంగీకరించారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం న్యాయపరమైన ఆటంకాలను అధిగమించి అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ నోడల్‌ ఏజెన్సీ అయి నందున ఆ శాఖ ఆధ్వర్యంలో కౌంటర్‌ పిటిషన్‌ వేయాలని తెలంగాణ గిరిజన సంఘం, ఇతర గిరిజన సంఘాలను కూడా ఈ పిటిషన్‌ లో ఇంప్లీడ్‌ అయ్యే విధంగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు .

Spread the love