ముందు నుయ్యి..వెనుక గొయ్యి

– వర్షాకాలం రానే వచ్చింది
– మేడిగడ్డ మరమ్మతులు సాధ్యమేనా?
– నిధుల ఖర్చుపై చేతులెత్తేసిన ఎల్‌అండ్‌టీ !!
– నేడు క్యాబినెట్‌లో చర్చ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ సర్కారుకు సవాల్‌గా నిలిచాయి. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరో సమస్య సర్కారును వేటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పథకాలకే నిధుల లేమీ వేధిస్తుండగా, మరోవైపు కాళేశ్వరం ప్రభుత్వానికి గుదిబండ కానుందని రాజకీయ విశ్లేషకులు, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిస్థితి. కాళేశ్వరాన్ని వదిలేస్తే భారీ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. లేదా పాత కాంగ్రెస్‌ విధానం ప్రకారం మేడిగడ్డ నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి చేపడితే పరిస్థితి ఏంటనే విషయాలపై కూడా చర్చ నడుస్తున్నది. ఈనేపథ్యంలో శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి క్యాబినెట్‌ భేటి ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్‌ జూన్‌ ఆరవ తేదీ వరకు ఉన్నప్పటికీ, ఈ క్యాబినెట్‌లో తీసుకునే నిర్ణయాలు ఆ తర్వాతే అమలుచేసే అవకాశముంది. ఇదిలావుండగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఉనికిపై అటు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ), ఇటు జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ న్యాయ విచారణ కమిషన్‌ అనుమానం వ్యక్తం చేశాయి. ప్రణాళిక నుంచి నిర్మాణం దాకా అన్ని చోట్లా అవకతవకలే జరిగా యని ఇప్పటికే వ్యాఖ్యానించాయి. సర్కారు నిఘా(విజిలెన్స్‌) విభాగం సైతం అవినీతి, అక్రమాలు జరిగాయంటూ మధ్యంతర నివేదిక అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ సైతం వర్షాలు వచ్చేలోపు తాత్కాలిక మరమ్మతులు చేయాలని సూచించింది. ఏడో బ్లాక్‌లోని రెండు క్రస్ట్‌ గేట్లు పూర్తిగా తొలగిం చాలనీ, అలాగే బ్యారేజీకి చెందిన అన్ని గేట్లు తెరిచే ఉంచాలని అభిప్రాయపడింది. లేకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఒకవేళ మరమ్మతు చేసినా మేడిగడ్డ బ్యారేజీ నిలబడుతుందనే గ్యారంటీ లేదంటూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్‌, ముఖ్యకార్యదర్శికి నివేదిక పంపింది. ఈనేపథ్యంలో గత రెండు, మూడు రోజులుగా ప్రభుత్వంలో తర్జనభర్జన చోటుచేసుకుంటున్నది. ఎన్‌డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతులు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ సైతం సర్కారుకు సూచించారు. ఈ నేపథ్యంలో మొత్తం పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అధికారులు నివేదిక సమర్పించారు. సాంకేతిక అంశాలు, ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌ నివేదికలు, జస్టీస్‌ ఘోష్‌ విచారణ కమిషన్‌ అంశాలపై సదరు మంత్రితో చర్చించారు. తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు అవసరమని వారు కోరారు. దీనిపై సీఎంతో మాట్లాడతానని ఇటీవల అధికారులతో మంత్రి ఉత్తమ్‌ చెప్పినట్టు తెలిసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ ఒప్పందం ప్రకారం వర్కింగ్‌ ఏజెన్సీ అయిన ఎల్‌అండ్‌టీనే బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని సాగునీట ిపారుదల సీఈ స్థాయి అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు చట్టం ప్రకారం ప్రభుత్వ వ్యవహరిస్తే సరిపోతుందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ ఖర్చును భరించడానికి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిరాకరించినట్టు సమా చారం. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవడానికి రేవంత్‌ సర్కారు ఏం చేయనుందనే విషయమై ఆసక్తి నెలకొంది. క్యాబినెట్‌లో చర్చించి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తుందా ? లేదా నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నే చేయాలని ఆదేశిస్తుందా ? అనేది తేలాల్సి ఉంది.

Spread the love