– ఇద్దరు నిందితుల అరెస్టు..
రూ.1.45 లక్షల విలువైన సరుకు స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లను నిల్వ నిల్వ మించిన స్థావరంపై సత్తుపల్లి పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. అధిక ధరలకు మద్యం, గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,45,413 విలువైన 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సత్తుపల్లి పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి ఆదేశాల మేరకు ఎస్సై అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి కాకర్లపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుగ్గపాడు గ్రామానికి చెందిన దూబకుంట్ల వీర రాఘవులు ఇంట్లో అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు కల్లూరు ఏసీపీ వసుందర యాదవ్‌కు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆమె ఆదేశాలు మేరకు పోలీసులు బుగ్గపాడు గ్రామంలోని వీర రాఘవులు ఇంటిపై దాడి నిర్వహించారు. తనిఖీల్లో పెద్ద మొత్తంలో గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఇద్దరు పంచుల సమక్షంలో ఇంటి యజమానిని విచారించగా, తన చెల్లెలు సాదు రాధికతో కలిసి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సత్తుపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలు, వివిధ వైన్ షాపుల నుంచి గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 20 గ్యాస్ సిలిండర్లు, 730 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పైన తెలిపిన వివరాలను పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి వెల్లడించారు.



