రాష్ట్రంలో ఎన్నికలకు పోలీస్‌ వ్యూహం

– సిద్ధొం రంగంలోకి కేంద్ర, రాష్ట్ర బలగాలతో కూడిన స్పెషల్‌ టీమ్‌లు
– సున్నితమైన ప్రాంతాల్లో మెరుపు దళాల మోహరింపు : తాజా పరిస్థితిని సమీక్షించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఇక వారంలో రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు బందోబస్తు వ్యూహం సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 32వేల పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఇందులో సాధారణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు.. వాటికి తగ్గ విధంగా భద్రతా ఏర్పాట్ల స్కీమ్‌ను రూపొందించారు. ఇందులో మతపరంగా సమస్యాత్మకమైనవి, రాజకీయ పాత వైరంతో కూడిన సమస్యాత్మక కేంద్రాలు, రాజకీయ పక్షాలుప్రతిష్టాత్మకంగా తీసుకునే నియోజకవర్గాలను ఈ మారు ప్రత్యేకంగా గుర్తించి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌ యాక్షన్‌ టీమ్‌, స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, క్విక్‌ రష్‌ టీమ్‌, క్విక్‌ యాక్షన్‌ టీమ్‌లను ప్రత్యేకంగా రూపొందించి రంగంలోకి దించుతున్నారు.
ఈ టీమ్‌లలో కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలతో పాటు రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌, నగర ప్రత్యేక సాయుధ బలగాలతో పాటు సివిల్‌ పోలీసులను కలిపి ఈ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌కు ఒక ఎస్సైని ఇన్‌చార్జీగా నియమిం చారు.శాంతి భద్రతల పరంగా ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇద్దరేసి ఎస్సైలను ఈ టీమ్‌లకు ఇన్‌చార్జీలుగా నియమించి రంగంలోకి దించు తున్నారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 60 వేల మంది పోలీసులు,17 వేల మంది హౌం గార్డులతో పాటు ప్రస్తుతం పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ(పీటీసీ)లలో శిక్షణ పొందుతున్న దాదాపు 15 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు, ఎస్సైలను కూడా బందోబస్తుకు వినియోగిస్తున్నారు. వీరే గాక కేంద్రం నుంచి కేటాయించబడ్డ రెండు వందల కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను(సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌) కూడా ఈ బందోబస్తులో వినియోగిస్తున్నారు.
మతపరంగా అత్యంత సమస్యాత్మక నియోజక వర్గంగా గుర్తించిన హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు మతపరంగా సమస్యలు తలెత్తుతాయని భావించే మహబూబ్‌నగర్‌, భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపు దళాలను ఇప్పటి నుంచే మోహరింపజేసి వాటితో గస్తీని నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద, రాష్ట్రంలోని ఏ పోలింగ్‌ బూత్‌లో కూడా అవాంఛనీయ సంఘటనలతో పాటు రిగ్గింగ్‌ జరపటం, ఓటు వేయటానికి వస్తున్న పౌరులకు అంతరాయం కలిగించటం, వారిపై బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. లపోలింగ్‌ జరిగాక పోలింగ్‌ బూత్‌ల నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేందుకు ప్రత్యేక మార్గాలను కూడా వెంటనే రూపొందించాలని కూడా డీజీపీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లో ఒక ఎస్సై స్థాయి అధికారి, సాధారణ పోలింగ్‌ బూత్‌లలో ఒక కానిస్టేబుల్‌ ఉండేలా పోలింగ్‌ రోజు చర్యలు తీసుకుంటున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలతో పాటు సివిల్‌ పోలీసులతో మూడంచెల బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Spread the love