– ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే ఘోరం
– విలువలు, సిద్ధాంతాలు, ప్రజా ఉద్యమాలకు పట్టంగట్టండి
– దేశ భవిష్యత్ కోసం చట్టసభల్లో వామపక్షాలుండాలి
– ‘ప్రజాస్వామ్యం-ఎన్నికలు-సీపీఐ(ఎం) వైఖరి’ సెమినార్‌లో సీతారాం ఏచూరి
ఖమ్మం నుంచి అచ్చిన ప్రశాంత్
దేశంలో రాజకీయాలన్నీ వ్యాపారమయంగా మారాయని సీపీఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలపై కొనసాగుతున్న దాడులు ఎమర్జెన్సీ కంటే తీవ్రంగా, ఘోరంగా ఉన్నాయని చెప్పారు. డబ్బు, మతం, కులం చుట్టూ రాజకీయాలను తిప్పుతూ బీజేపీ ముందుకుపోతున్నదని విమర్శించారు. ఎలక్ట్రోరల్ బాండ్లను లీగల్ చేయడమనేది రాజకీయ అవినీతేనని అన్నారు. రూ.వేల కోట్లు బీజేపీకి ఎక్కడ నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదన్నారు. తద్వారా బ్లాక్‌మనీ కాస్తా వైట్ మనీ అవుతుందని చెప్పారు. విలువలు, సిద్ధాంతాలు, ప్రజలకు చేసిన సేవలేంటనే అంశాలు నేటి ఎన్నికల్లో చర్చనీయాంశం కావడం లేదని వాపోయారు.
ప్రస్తుత ఎన్నికల్లో సీపీఐ (ఎం) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన ఏచూరి… ‘ప్రజాస్వామ్యం-ఎన్నికలు-సీపీఐ(ఎం) వైఖరి’ అనే అంశంపై ఆ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సెమినార్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన లౌకికత్వం, ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, ఫెడరలిజంపై దాడి పెద్ద ఎత్తున జరుగుతున్నదని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో బుల్డోజర్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల ఇండ్లు, వ్యాపార సముదాయాలపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. వారికి ఇచ్చే సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని తెలిపారు. మోడీ విధానాలను ప్రశ్నించే వారిపై ఎన్‌ఐఏ కేసులు పెట్టి బెయిల్ కూడా రాకుండా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం చార్జిషీట్‌లు కూడా లేకుండా జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని వివరించారు. జర్నలిస్టులను కూడా జైళ్లకు పంపుతున్నారని గుర్తు చేశారు.
మోడీ ప్రభుత్వ విధానాల వల్ల దేశ సంపద సంపన్నుల పాలవుతోందని ఏచూరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రూ.400గా ఉన్న గ్యాస్ ధరను రూ.1,100కి పెంచి ఇప్పుడు రూ.200 తగ్గించి గొప్పలకు పోతున్న బీజేపీ తీరును ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. దేశంలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు తీవ్రమవుతున్న వైనాన్ని వివరించారు. పార్లమెంట్‌లో చర్చలకు అసలు అవకాశమే ఉండటం లేదన్నారు. 11 నిమిషాల్లో 22 బిల్లులను పాస్ చేయడమేంటని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఐదుగురు జడ్జీలు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం ఏకంగా ఒక చట్టమే తెచ్చిందని చెప్పారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని సైతం దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉండే సీపీఐ (ఎం) అభ్యర్థులను ఎన్నికల్లో ఆదరించాలని పిలుపునిచ్చారు. తద్వారానే దేశాన్ని రక్షించుకోగలుగుతామని విజ్ఞప్తి చేశారు. చట్టసభల్లో వామపక్ష ప్రజా ప్రతినిధులుంటేనే ప్రజల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఏచూరి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ… ఎన్నికల్లో సీపీఐ (ఎం) కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్, బూర్జువా, ధనస్వామ్యం నుంచి ప్రజలను రక్షించేందుకు వీలుగా, వారిని మరింతగా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. నలువైపుల నుంచి ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ (ఎం) నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ మాట్లాడుతూ… నేటి డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు. పాలమూరులో స్వతంత్య్ర అభ్యర్థి బర్రెలక్కకి పెరుగుతున్న మద్దతు చూస్తే ఇంకా ప్రజాస్వామ్యం బతికే ఉందనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి శక్తులన్నింటినీ సీపీఐ (ఎం) ఏకం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి ఎర్రా శ్రీకాంత్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్‌రావు, నాయకులు ఎం.సుబ్బారావు, రమేశ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.