పొలిటికల్‌ గ్యాప్‌!

Political gap!– కమలం, గులాబీ ఒక్కటి కాదని చెప్పే యత్నం
– ‘నామినేటెడ్‌’ ఎమ్మెల్సీల పేర్ల సిఫారసును తిరస్కరించిన గవర్నర్‌ తమిళి సై
– భగ్గుమన్న మంత్రులు
– దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణకు నిరాశ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘నువ్వు కొట్టినట్టు చెరు.. నేను ఏడ్చినట్టు నటిస్తా…’ అనే సూత్రాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పక్కాగా పాటిస్తున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొద్ది రోజుల కిందటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న దోస్తీ, తాజాగా గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ తీసుకున్న నిర్ణయం… బీజేపీ, బీఆర్‌ఎస్‌ సంయుక్త రాజకీయ వ్యూహాలకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేటెడ్‌ కోటాలో రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన దాసోజు శ్రావణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరిస్తున్నట్టు గవర్నర్‌ సోమవారం ప్రకటించారు. వారిద్దరికీ తగిన అర్హతల్లేవని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వారి అర్హతలు సరిపోవని ఆమె స్పష్టం చేశారు.
గవర్నర్‌ నిర్ణయం దరిమిలా ఇటు తమిళిసై, అటు సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ కొనసాగుతూ వచ్చింది. గతేడాది సంభవించిన వరదల సందర్భంగా గవర్నర్‌… వివిధ జిల్లాల్లో పర్యటించటం, ఆమెకు హెలికాఫ్టర్‌ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించటం, ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఆమె మహిళా దర్బార్‌, ప్రజా దర్బార్‌ అంటూ హడావుడి చేయటం, గిరిజనుల సాధికారిత కోసం ఆదివాసీ ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించటమనేది ప్రభుత్వానికి నచ్చలేదు. గత బడ్జెట్‌ సమావేశాలకు సీఎం కేసీఆర్‌… తమిళిసైని ఆహ్వానించలేదు. దీంతో తెలంగాణ చరిత్రలో తొలిసారిగా గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వాతావరణం కనబడింది. అయితే కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో సీఎం కేసీఆర్‌… తన మంత్రివర్గ సహచరలందరితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నూతన సచివాలయంలోని గుడి, మసీదు, చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. సకల మర్యాదలు, సన్మానాలు చేసి గౌరవించి పంపింది.
ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయనీ, అందులో భాగంగా రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ తగ్గిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఊపు పెరగటం, విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనంటూ ఘాటుగా విమర్శించటం కమలం, గులాబీ పార్టీలను ఇరకాటంలో పెట్టాయి. ఇది మైనారిటీల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో ప్రత్యేకించి, రాజధానిలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటింగ్‌ అంతా కాంగ్రెస్‌ వైపు మరలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ‘రహస్య మైత్రీ’ ఏమీ లేదని నిరూపించుకోవటం అధికార పార్టీకి ఓ సమస్యగా మారింది. దీంతో తామిద్దరం ఒక్కటి కానేకాదని చెప్పుకునేందుకు ఆ రెండు పార్టీలూ తీవ్రంగా ప్రయత్నించాయని తెలుస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసిందనే వార్తలు కూడా చక్కర్లుకొట్టాయి. అదే పరంపరలో ఇప్పుడు నామినెటెడ్‌ కోటాలో క్యాబినెట్‌ సిఫారసు చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్‌ తిరస్కరించారనే చర్చ కొనసాగుతోంది. ‘రాజకీయ వ్యూహం’లో భాగంగా ఇప్పుడు తిప్పి పంపిన ఈ పేర్లను గవర్నర్‌ మున్ముందు ఆమోదిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమే : గవర్నర్‌ తమిళి సై
దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు తిరస్కరిస్తూ గవర్నర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తగిన అర్హతలు లేకుండా వారిని నామినేట్‌ చేయడం తగదు. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. అర్హులను పరిగణనలోకి తీసు కోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైంది కాదు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయ కూడదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలను జత చేయలేదు…’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని ఈ సందర్భం గా సీఎంకు సూచించినట్టు తెలిపారు.
ఇదేం పద్ధతి..?
మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌, ప్రశాంత్‌రెడ్డి
దాసోజు శ్రావణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ తిరస్కరించటంపై పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గవర్నర్‌ గారూ.. ఇదేం పద్ధతి…’ అంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శ్రావణ్‌, సత్యనారాయణ… ఇద్దరూ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారనీ, దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారు తమ తమ రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. గవర్నర్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే నైతిక అర్హత లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ నేపథ్యముందంటూ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన గవర్నర్‌… తాను మాత్రం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ నేరుగా తెలంగాణ గవర్నర్‌గా రావొచ్చా…? అని ప్రశ్నించారు. తమిళి సై రాష్ట్రానికి గవర్నరా..? లేక ప్రతిపక్ష నాయకురాలా..? అని రాష్ట్ర షీప్స్‌ అండ్‌ గోట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ విమర్శించారు.

Spread the love