– టీడీపీ అధినేత చంద్రబాబు
– పార్టీలో చేరిన పలువురు నేతలు
అమరావతి : ఏపీరాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభమయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ను ఇంటికి పంపాలని జనం చూస్తున్నారని చెప్పారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతినగరం నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో ఆదివారం టీడీపీలో చేరారు. టీడీపీ కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. తాను అందరివాడినని, ఏ ఒక్కడి వాడిని కాదని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నారని, హార్టికల్చర్ రైతులు నాశనమయ్యారని తెలిపారు. ఒక వ్యక్తి విధానాల వల్ల వ్యవస్థలు నాశనమైతే జీవితాలు నాశనం అవుతాయని, ఐదేళ్లలో ఇదే జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డే లేదని, కృష్ణానదికి అడ్డుగా కట్టవేసి ఇసుకను దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే రెండు జిల్లాల్లో ఇసుక మాఫియాకు నేతృత్వం వహిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న వారిపై అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను వంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ సాయంతో కష్టం తగ్గించవచ్చునని తెలిపారు. కానీ మిచౌంగ్ సమయంలో ప్రభుత్వం కనీసం స్పందించలేదని విమర్శించారు. ప్రతియేటా జాబ్ కేలండరు ఇస్తానని హామీ ఇచ్చి ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్‌పై జగన్ కన్ను పడటంతో దాని యాజమానిపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. విషయం మీడియాలో రావడంతో యాజమానిని బెదిరించి ఎవరూ ఇబ్బంది పెట్టలేదని చెప్పించారని పేర్కొన్నారు. జగన్‌కు తన సినిమా అయిపోయిందని తెలిసిపోయిందని, అందుకే 92 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని తెలిపారు. మార్చాల్సింది జగన్‌ను అని ఎమ్మెల్యేలను కాదని అన్నారు. తాను అద్దె ఇంట్లో ఉంటే అనేక దాడులు చేసిన వ్యక్తి తన పుట్టినరోజు కోసం రూ.100 కోట్లతో సొంత పత్రికకు ప్రకటనలు ఇప్పించుకున్నారని తెలిపారు. తాను సూపర్ సిక్స్ ఇస్తానని ప్రకటించడంతో ఉచిత ప్రయాణం పెడతానని ఏపీ సీఎం అంటున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో రూ.లక్షల కోట్ల ఆస్తిని జగన్ నాశనం చేశారని విమర్శించారు. రుషికొండను విధ్వంసం చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అనగాని సత్యప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, రెడ్డి సుబ్రమణ్యం, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు
టీడీపీ కార్యాలయంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కా ఆనంద్‌బాబు, మద్దిరాల ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన యాగం
చంద్రబాబు తన నివాసంలో మూడు రోజులుగా నిర్వహించిన చండీయాగం, సుదర్శన నారసింహ హోమం ఆదివారంతో ముగిశాయి. ఉండవల్లిలోని తన నివాసంలో తన సతీమణి భువనేశ్వరితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.