“నాన్న చినిగిన బట్టలపై కుట్లేస్తే/ కొడుకు అనారోగ్యంతో శిథిలమైన శరీరాలకు కుట్లేస్తున్నాడు” లక్ష్యం పెట్టుకుని చదివితే లక్షలు లేకపోయినా డాక్టర్ కావచ్చని మధ్య తరగతి పిల్లల కలలకు స్ఫూర్తినిస్తున్నాడు. కార్పోరేట్ ఆసుపత్రుల అవకాశాలను వదులుకొని, తనలా పేదరికంలో మగ్గుతున్న వేలాది మంది కోసం ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్లనే ఎంచుకున్నాడు. డబ్బు లేక చావు అంచుల దాకా వెళ్తున్న ఎందరికో ఆపరేషన్లు చేస్తూ ఊపిరి పోస్తున్నాడు. ఆసుపత్రి గదులను మానవీయ కేంద్రాలుగా చేస్తున్నాడు. నాగార్జున సాగర్ గురుకుల హాస్టళ్లలో చదువుకొని, అక్కడ నేర్చుకున్న విలువలనే వైద్యానికి పునాదిగా చేసుకున్న మానవీయుడు. తనలాంటి పేద ప్రజల బాగు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎం.ఎస్.(జనరల్ సర్జరీ) గా నెలకు 30 నుండి 50 సర్జరీలు చేస్తూ సేవలందిస్తున్న నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, హిల్ కాలనీ నాగార్జున సాగర్ కు చెందిన డా.గారపాటి కిషోర్ కుమార్ తో నవతెలంగాణ జోష్ ప్రత్యేక సంభాషణ.
మీ విద్యాభ్యాసం, కుటుంబం గురించి క్లుప్తంగా చెప్పండి?
ప్రాథమిక విద్య నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీ ఎస్.టి జోసేఫ్స్ లో, హైస్కూల్ ఎ.పి.ఆర్.ఎస్ నాగార్జునసాగర్ లో చదివాను. ఎం.బి.బి.యస్ భాస్కర మెడికల్ కాలజీ, ఎం.ఎస్. (జనరల్ సర్జరీ) కె.ఎం.సీ వరంగల్ లోనూ పూర్తి చేశాను. నిజానికి ఎ.పి.ఆర్.ఎస్ నాగార్జునసాగర్ లో చదవడమే నా కెరీర్ లో అతిపెద్ద మైలురాయి. అక్కడే చదువుతో పాటు జీవితాన్ని నేర్చుకున్నాను. నాన్న గారపాటి జోజి, అమ్మ గారపాటి ఆలిసమ్మ. భార్య డా. ప్రత్యూష జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎయిమ్స్, పెద్దన్న సంతోష్ కుమార్ బి.పి.ఎల్ సెంట్రల్ గవర్నమెంట్, వదిన డా.శిరీష పిల్లల వైద్య విభాగం (పీడియాట్రిక్స్) గద్వాల్, చిన్నన్న సందీప్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ల నిరంతర ప్రోత్సాహం మరువలేనిది.
మీరు డాక్టర్ కావడానికి ప్రధానమైన కారణం ?
నాగార్జునసాగర్ గురుకులంలో సైన్స్ టీచర్స్ అయిన సరళ మేడమ్, రజనీకాంత్ సార్, సుబ్రమణ్యం సార్ వాళ్ళు ప్రతీ పాఠాన్నీ ప్రయోగాత్మకంగా చెప్పడం వలన సైన్స్ మీద ఇష్టం పెరిగింది. అప్పటి వరకు సైన్స్ అంటే భయపడే నేను. సైన్స్ సబ్జెక్ట్ ను ప్రేమించడానికి ఈ రోజు డాక్టర్ గా నిలబడడానికి పునాదిగా మారింది.
చిన్నప్పుడు ఆరోగ్యం బాలేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారీ, జనాలు డాక్టర్ గారిని దేవుడిలా చూడటం చూసి నేను కూడా డాక్టర్ కావాలనుకున్నాను. ఎం.బి.బి.ఎస్ అయ్యాక పని చేస్తున్నప్పుడు పేగుకు రంధ్రం పడిన 33 ఏళ్ల ఒక పేషెంట్ ఆలస్యంగా వచ్చాడు. సర్జరీ కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసినా, దారిలోనే చనిపోయాడు. ముగ్గురు పిల్లలు, భార్యను వదిలి చనిపోయిన ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. సర్జరీ చేయగలిగే డాక్టర్ అయితేనే చాలామంది ప్రాణాలు కాపాడవచ్చని అర్థమై ఎం.ఎస్. (జనరల్ సర్జరీ) పూర్తి చేశాను.
కార్పోరేట్/ ప్రైవేటు హాస్పిటల్ ఆఫర్లు వదులుకుని ప్రభుత్వ హాస్పిటల్లోనే పని చేయడానికి కారణాలు?
ప్రభుత్వ బడిలో చదువుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొంది, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదివి సర్జన్ అయ్యాను. ప్రభుత్వం నుంచి ఇంతలా తీసుకుని ఎదిగాక, ఆ రుణం తీర్చుకోవాలంటే నిజాయితీగా ప్రభుత్వ ఆసుపత్రి లో సేవ చేయడమే మార్గం అనుకున్నాను. డబ్బు లేక చికిత్స పొందలేక ప్రాణాలు కోల్పోతున్న పేదవారికి సాయపడాలన్నదే నా లక్ష్యం.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నప్పుడు మీ ముందున్న సవాళ్లు ఏంటి?
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న జ్వరాలకే గానీ, ఆపరేషన్లు అంటే ప్రభుత్వ హాస్పిటల్ పై నమ్మకం అంతగా లేని పరిస్థితి. అప్పులు చేసైనా ప్రైవేట్ హాస్పిటల్ కే వెళ్లాలనుకుంటారు. డబ్బులేక ప్రైవేట్ కి వెళ్లలేక, నమ్మకం లేక ప్రభుత్వ ఆసుపత్రికి రాలేక జనం ఇబ్బంది పడేవారు. ఇవి గమనించి మొదట సర్జన్ గా ఏ సర్జరీ కేసునూ వదలకుండా ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టాను. ఆపరేషన్ ముందు, తర్వాత ఫోటోలు తీసి ఓపి ముందు నోటీస్ బోర్డులో పెట్టాను. నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలా బొమ్మలతో పోస్టర్ డిజైన్ చేసి హాస్పిటల్ లో అంటించాను. దీంతో మెల్లగా జనం వచ్చి ఆపరేషన్లు చేయించుకోవడం, ఊరెళ్లి మరింత మందికి చెప్పడం మొదలైంది. లోకల్ మీడియా, పేపర్ ఆర్టికల్స్ తోడయ్యాయి. ఇన్‌స్టాలో సర్జికల్ సర్వీసుల వీడియోలు పెట్టడంతో యువత కూడా నేను పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి రావడం మొదలుపెట్టారు.
మీరు నెలకు ఎన్ని ఆపరేషన్లు చేస్తారు ? ఎవరైనా మీ పనిని గుర్తించారా ?
సాధారణంగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు గరిష్టంగా 15-20 ఆపరేషన్లు జరుగుతాయి. కానీ నేను నెలకు 30-50 ఆపరేషన్లు చేస్తున్నాను.
ఈ సేవలకు గుర్తింపుగా సుమన్ టీవీ వారు ” Best Rural Surgeon ” అవార్డు ఇచ్చారు. ఇటీవల బాపట్ల జిల్లా Best Surgeon గా ప్రభుత్వం తరపున అవార్డు అందుకున్నాను.
గురుకుల విద్య మీ జీవితంపై చూపిన ప్రభావం ఎటువంటిది ?
“నాలా నా పిల్లలు మెషిన్ కుట్టేవాళ్ళు కాకూడదు” అనుకున్న నాన్న సంకల్పమే నా ఇద్దరు అన్నయ్యలను ఉద్యోగులుగా, నన్ను డాక్టర్ గా తీర్చిదిద్దింది. ముగ్గురం గురుకుల పాఠశాలల విద్యార్థులమే. డబ్బు వెనకాల పరిగెత్తే ఈ కాంక్రీటు అడవుల్లో కొన్ని విలువలను పాటిస్తూ నేను ప్రాక్టీస్ చేస్తున్నానంటే, దానికి కారణం గురుకులంలో నేర్చుకున్న నైతిక విలువలు మాత్రమే.
పేర్ల రాము, 9642570294
పేదల డాక్టర్…
- Advertisement -
- Advertisement -



