ఇటీవల సినీనటి రాధిక నటించిన తమిళ సినిమా ”తాయి కిజావి” వుమన్ ఎంపవర్మెంట్ గురించిన చర్చను తాజాపరిచింది. రాజకీయ, ఆర్థిక, విముక్తి పోరాటాలు, ఉద్యమాలకు ముందు ఉండి నడిపిన మహిళల జాబితా చాలా పెద్దదే. వారి జీవితాలను నామమాత్రం రాసుకుంటూ పోతే కొన్ని వందల పేజీలు కావచ్చు. చరిత్రకెక్కని, రవి కూడా కాంచని ఓ బంజారా మహిళా యోధురాలి చరిత్రను కవి, రచయిత నవలాకారుడు ఆమ్గోత్ వెంకట్ పవర్ “పోర్యతార” (తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల) నవలలో రాశారు. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ సాహిత్య పరిషత్తు వారిచే ఉత్తమ నవలా పురస్కారాన్ని అందుకున్న ఈ తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవలపై చర్చించుకోవాల్సిన సందర్భం కూడా ఉన్నది. ప్రతి జాతికి తమ తమ ఆచార వ్యవహారాలకు సంబంధించి, జీవనానికి సంబంధించిన ధర్మం ఉంటుంది. బంజారాలకు కూడా ఓ ధర్మం ఉన్నది. ఆకలి కలిగిన వాళ్ల దగ్గరి కూడు లాక్కోకూడదని ధర్మాన్ని పాటిస్తూ విస్తారమైన పశుపోషణ నే వృత్తిగా సంచార జీవితాన్ని గడుపుతున్నారు. బంజారాలు ఎక్కడనుండి వచ్చారు అనే దానికన్నా ఎక్కడికి వచ్చారు… ఎలాంటి జీవనం కొనసాగిస్తున్నారనేది ముఖ్యం. బంజారాల ప్రధాన ఆస్తి పశువులు.
మేలు జాతి పశువుల ఉత్పత్తి చేయటం, అమ్మటం, సుదూర ప్రాంతాల ప్రజలకు, ప్రభువులకు, భూస్వాములకు అమ్ముతూ ఉండేవారు. బలమైన పశుసంపద ఉండటం వలన కాలానుగుణంగా సంచార వ్యాపారం కూడా విస్తారంగా సాగించారు. ప్రపంచంలోని ఎడారి జాతుల ప్రధాన వృత్తి వ్యాపారమే. ఇక్కడి బంజారాలు కూడా ఉప్పు, పప్పులు మొదలగు వాటిని బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ పట్టణాలకు తరలించి అమ్మేవారు. ఆయా పట్టణాలలో దొరికే వస్తువులను ధాన్యాలను మరోచోట ఎడ్లబండ్ల ద్వారా తీసుకెళ్లి వ్యాపారం నిర్వహించేవారు. ఈ నిర్వహణలో దోపిడిదొంగలు, భూస్వాములు, జాగీరు దారులు తమ పరిధిలలో విధించిన పన్నులు, నిజాం పాలనలో వేసే పన్నులు చాలా భారంగా ఉండేవి. హైదరాబాద్ నగర నిర్మాణం, వ్యాపార సంబంధాలలో బంజారాలది ముఖ్యమైన పాత్ర. నేటి బంజారాహిల్స్ నాటి బంజారాల నివాస ప్రాంతం. గోలకొండ చుట్టూ వారి నివాసం. సంచార వ్యాపారం తో పాటు స్థిర వాసాలు ఏర్పరచుకుని జీవించేవారు. లదణి (వలస) జీవితాలతో కొనసాగించే ఈ బంజారాలు బంజారాహిల్స్ ను, షాద్ నగర్ ను, శంషాబాద్ ను ఇలా ఎక్కడ పశుపోషణకు అవకాశం దొరుకుతుందో అక్కడికి వెళ్లేవారు. ప్రముఖులు హైదరాబాద్ జీవిత చరిత్ర రాస్తూ బంజారా జీవితాన్ని హైదరాబాద్ నగరం చుట్టూ లదణి లదణి లుగా మారుతున్న వైనాన్ని వివరంగా రాశారు . ఇట్లా అడవులు, పీఠభూములు, గుట్టలు, కొండల ప్రాంతాల్లో తాండాలుగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
అట్లా వ్యవసాయం మీద ఆధారపడుతూ ప్రారంభమైన వీరి జీవనం ముఖ్యముగా వ్యవసాయాధార వలసదారులు వెళ్లినట్లుగా మైదానము, నల్లరేగడి భూములకు వెళ్ళలేదు. మెట్ట, వర్షాధార వ్యవసాయానికి పనికి వచ్ఛే భూములను మాత్రమే ఆశ్రయించారు. ఈ పరిణామ క్రమంలో ఎదుర్కొన్న కష్టాలను, నష్టాలను నైజాం, భూస్వాముల ఆగడాలను ఎదుర్కొంటూ జీవిస్తున్న సందర్భంలో ఓ బంజారా మహిళ జడ్చర్ల, తిమ్మాజీపేట, నాగర్ కర్నూల్, బిజినేపల్లి, కొత్తకోట, వనపర్తి గోపాల్ పేట్ చుట్టూ ఉన్నటువంటి తండాలకు నాయకత్వం వహించి విముక్తి పోరాటాలను చేసింది. ఆమె హీరిబాయి. హీరిబాయి జీవిత చరిత్రను చదవాలంటే బంజారా జీవితాలను వంద ఏండ్ల వెనక్కి వెళ్లి చదవాలి. అది జరగక పోతే తెలియని భాషను,అర్థం కాని భాషను విన్నట్లే. తాండా రాజకీయ జీవనం ఆ తండా పంచుల నిర్ణయాల పై ఆధారపడుతుంది. తెగల ప్రజాస్వామ్య విలువలకు ఇది చక్కటి ఉదాహరణ. పెండ్లిలు, ఇతర తాండవాసులతో సంబంధాలు, వ్యాపార వ్యవహారాలు, నిర్వహణ అన్ని ఆ పంచులే చూసుకునేవారు. వీరి నాయకుడే ”నాయక్”. విలక్షణమైనటువంటి వివాహ ఆచారం, సంప్రదాయం, సంస్కృతి వాడ్ బూడ్ (అనుభవ వృద్ధులు) సిక్వాడి (హితోపదేశం) ద్వారా తర్వాతి తరాలకి అందించేవారు లంబాడీ మనవు అనేది ఒక ప్రధాన అంశం ఒక తాండా మహిళా మరో తాండాయువకుడితో పెళ్లి అయిన తర్వాత తను పుట్టిన తండాకి తిరిగి వచ్చే దాఖలా ఉండదు. హీరి బాయి పెరిగిన తీరు, ఆమె ధీరత్వం చూసిన తల్లిదండ్రులు, తాండా వాసులు ఆమె భర్త గత్తరకు గురై చనిపోతే తిరిగి తండాకు పిలుచుకొని ఆదరిస్తారు.
1899 -1900 సంవత్సరం ఆ మరుసటి సంవత్సరాలు వరుసగా ఏడు సంవత్సరాల వరకు విపరీతమైన కరువు సంభవించడంతో పశువులకి, మనుషులకి తిండి దొరకక చౌడు, బంక మట్టి తింటున్న సందర్భాల్లో తమ ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం హీరిబాయి గత్యంతరం లేక కొత్త అవతారం ఎత్తింది. ‘సింహమైనా పులైన ఆకలి అయినప్పుడు వేటాడుతాయి ఆకలి వేసినప్పుడు ఇంత దూరమైన ప్రయాణిస్తాయి ఎంత బలంతో అయినా వేటాడుతాయి వాటి ఆకలికి రాత్రి పగలు అని తేడాలు ఉండవు ఈ ప్రక్రియను ధర్మాన్ని అనుసరిస్తూ వేటాడుతాయి తప్ప తిండి నిధుల కోసం వేటాడవు మనం కూడా మన ధర్మం ప్రకారం ఆకలిని జయించే యుద్ధం మొదలు పెట్టబోతున్నాం’
భూకేన్ బాటి ఖొరాణు
తరసేన్ పాణి పరాణు
భులాడి పడ్కేజేన్ వాట్ వతాణు
ఆస్రో మాంగజేన్ సహారో దేణు
(ఆకలితో ఉన్న వాళ్లకు రొట్టెలు పెట్టాలి దూపగొన్న వారికి నీళ్లు ఇవ్వాలి. దారి తప్పిన వారికి దారి చూపాలి. ఆశ్రయం కోరి వచ్చిన వారికి సహకారం అందించాలి)
‘ఆకలి చావుల నుండి బయటపడటానికి మన గోర్ ధరమ్ ను అనుసరించే ఆకలి దాడులు చేయబోతున్నాం. తిండి గింజల కోసం ఎంత దూరమైనా నడవ పోతున్నాం. ఎంత బలమైన వాడినైనా డీ కొట్టబోతున్నాం. పేదోడు కడుపు కొట్టి నిలువ చేయబడిన గడీలను, వ్యాపారస్తుల ఇండ్లు ఏవైనా సరే మన దెబ్బకు ఖాళీ కావాల్సిందే. మనోళ్ల కడుపు నిండాల్సిందే. పేదలను దోచుకుని గడీల నింపుకుంటున్న దొరల లారీలు మన కోడిపర్తి మిట్టనుండే బాదేపల్లి మార్కెట్ కు పోతున్నాయి ఇక్కడి నుండే మనం లూటీ మొదలు పెడుతున్నాం.’ అంటూ తూర్పు దిక్కు వేలు చూపిస్తూ హీరీబాయి అన్నది.
హీరి బాయి ఒక రాబిన్ హుడ్.
నిజాం పాలనలో వీరిపై విధించిన పన్నులను తగ్గించుట నుండి బంజారాలను దొంగలుగా చిత్రిస్తూ మోపిన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871 ఎత్తేసే దగ్గర నుండి తాండాల్లో నీటి కోసం రెండు సార్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి చేదుడు బావులను ఏర్పాటు చేసుకునే అంతవరకు హీరి బాయి చరిత్ర ను చారిత్రక నవల రూపంలో వెంకట్ పవార్ రాసేదాక ఈమె చరిత్ర సమాజానికి తెలియదు.
80 ఏండ్ల వయసులో ఒంటరిగా సెక్యూర్టీని ఛేదించుకొని ఢిల్లీలో ఇందిరా గాంధీని కలవడం ఒక పోరాటం. ఆమె నాయకత్వం వహించే తండాలను దోపిడీదారులుగా చిత్రించిన ఆధిపత్య చరిత్ర కారులను ఏకపక్షం చేస్తూ హీరిబాయి చరిత్రను ‘పొర్యతార’ నవలగా వెలుగులోకి తెఛ్చిన ఆంగోత్ వెంకట్ పవార్కి అభినందనలు. ప్రచురించిన తెలంగాణ సాహిత్య అకాడమికి ప్రత్యేక సాహిత్యాభినందనలు.
హీరిబాయి ఒక రాబిన్ హుడ్.
నిజాం పాలనలో వీరిపై విధించిన పన్నులను తగ్గించుట నుండి బంజారాలను దొంగలుగా చిత్రిస్తూ మోపిన క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871 ఎత్తేసే దగ్గర నుండి తాండాల్లో నీటి కోసం రెండు సార్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి చేదుడు బావులను ఏర్పాటు చేసుకునే అంతవరకు హీరి బాయి చరిత్ర ను చారిత్రక నవల రూపంలో వెంకట్ పవార్ రాసేదాక ఈమె చరిత్ర సమాజానికి తెలియదు. 80 ఏండ్ల వయసులో ఒంటరిగా సెక్యూర్టీని ఛేదించుకొని ఢిల్లీలో ఇందిరా గాంధీని కలవడం ఒక పోరాటం.



