Saturday, August 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఅడుగడుగునా గుంతలే

అడుగడుగునా గుంతలే

- Advertisement -

అధిక లోడుతో  వెళ్తున్న కంకర టిప్పర్లు..
నవతెలంగాణ-మిడ్జిల్ 
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని కంచనపల్లి గ్రామ శివారులోని చేదు గట్టు నుండి అనుమతుల పేరుతో అక్రమంగా పరిమితికి మించి ఓవర్ లోడ్, అధిక వేగంతో నిత్యం రాకపోకలు సాగిస్తున్న కంకర టిప్పర్లను శనివారం స్థానిక రైతులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. భారీ వాహనాల వల్ల కూర గడ్డపల్లి, బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు గ్రామాల బీటీ రోడ్డు, గుంతలుగా మారి పొలాలకు వెళ్లే రైతులు, పాఠశాల విద్యార్థులు, పాదచారులు నిరంతరం ప్రమాదాల బారిన పడుతున్నారని ఆగ్రహించారు. అంతేకాకుండా టిప్పర్‌ వెనుక అరకిలోమీటర్‌ మేర దుమ్ము ఆవహిస్తోందని, దీనివలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, వృద్ధులు, చిన్నారులు, రైతులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారని, పంటలు కూడా పాక్ష‍ికంగా దెబ్బతింటున్నాయని ఆవేదన చెందారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. కంచనపల్లి మీదుగా వెళ్లే ఓవర్ లోడ్ వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచి, వేగాన్ని నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. పర్మిట్ మేరకే వాహనాలను అనుమతించి, నిబంధనలు పాటించని గుట్ట యజమానిపై కేసు నమోదు చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారుల, పోలీస్, రవాణా శాఖ (RTA) అధికారులను కోరారు.

ఇటీవల కంచనపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్ చెన్నయ్య జడ్చర్ల నుండి గ్రామానికి వస్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయనతో పాటు గ్రామస్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధిక లోడుతో వెళుతున్న టిప్పర్లపై కేసు నమోదు చేయాలి: మాజీ సర్పంచ్ నరసింహులు 
“అనుమతి లేకుండా రాత్రిపూట గుట్టలో బాంబులు పెట్టి పేల్చడంతో చుట్టుపక్కల గ్రామాలైన బైరంపల్లి చేదు గట్టు తాండ, కంచనపల్లి, గ్రామాలలో ఇల్లు నేరలొచ్చి కూలిపోయే ప్రమాదం ఉంది. రాతపూర్వకంగా జిల్లా అధికారులకు, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గుట్ట యజమానులు ఇచ్చే మామూళ్ళకు తలొగ్గి, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వెంటనే అధిక లోడుతో వెళుతున్న వాహనాలతోపాటు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని” డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -