Thursday, June 25, 2026
E-PAPER
Homeజాతీయంపంజాబ్‌‌లో విద్యుత్ సంక్షోభం

పంజాబ్‌‌లో విద్యుత్ సంక్షోభం

- Advertisement -

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన థర్మల్ ప్లాంట్లు
చర్చలు జరుగుతున్నాయి: పీఎస్‌‌పీసీఎల్‌

​అమృత్‌‌సర్‌ : ‌ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా ఒప్పందాన్ని అమలు చేయాలనే డిమాండ్‌‌తో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది చేపట్టిన సమ్మె కారణంగా పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తి తీవ్ర సంక్షోభంలో పడింది. లేహ్రా మొహబ్బత్‌లోని గురు హర్గోబింద్ థర్మల్ ప్లాంట్ (‌జీహెచ్‌‌టీపీ)లోని నాలుగు యూనిట్లు పూర్తిగా మూతపడగా, రోపర్ థర్మల్ ప్లాంట్‌లో ఒక యూనిట్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై భారీ ఒత్తిడి పెరిగింది.పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌‌పీసీఎల్‌) ఆధీనంలోని లేహ్రా మొహబ్బత్ 920 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్‌లో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. బుధవారం నుంచి ఆదివారం ఉదయం వరకు వరుసగా యూనిట్లు ట్రిప్ అవుతూ చివరకు పూర్తిగా నిలిచిపోయాయి.
​సమ్మె కారణంగా కీలక సాంకేతిక పనులు నిర్వహించే 1,850 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు విధులకు దూరమయ్యారు. ఫలితంగా ప్లాంట్‌లో ఉన్న సుమారు 550 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే పనిని కొనసాగించాల్సి వచ్చింది. వీరిలో సగం మంది సాంకేతిక సిబ్బంది కాగా.. అందులో సుమారు 150 మంది ఇంజినీర్లు ఉన్నారు. సాధారణంగా సుమారు 250 మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పని చేసే యాష్ ఎవాక్యుయేషన్ విభాగాన్ని ప్రస్తుతం కేవలం 10 నుంచి 12 మంది రెగ్యులర్ సిబ్బంది 16–18 గంటల పాటు పనిచేసి నిర్వహిస్తున్నారు. యాష్ రవాణా, బాయిలర్ శుభ్రత, క్లింకర్ తొలగింపు, హై-వోల్టేజ్ స్విచింగ్, టర్బైన్, పంపుల నిర్వహణ, బొగ్గు హ్యాండ్లింగ్ వంటి పనులు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి నైపుణ్యం లేని తాత్కాలిక సిబ్బంది చేయడం సురక్షితం కాదని అధికారులు స్పష్టం చేశారు. పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజినీర్ల సంఘం కూడా తగిన శిక్షణ లేకుండా ఇంజినీర్లపై ఒత్తిడి పెడితే పెద్ద ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమ్మె రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉన్న సమయంలో చోటు చేసుకుంది. పంజాబ్‌లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 14,459 మెగావాట్లకు చేరగా, నార్తర్న్ గ్రిడ్ నుంచి 10,390 మెగావాట్లు తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి 4,140 మెగావాట్లకు పడిపోయింది.
​సమ్మె నేపథ్యం
మే 24న పంజాబ్ విద్యుత్‌ మంత్రి సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం.. జూన్ 15లోగా ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను నేరుగా పీఎస్‌‌పీసీఎల్‌‌లో కలపాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో జూన్ 9 నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది నిరసనకు దిగారు. జూన్ 16 నుంచి పూర్తిస్థాయి పనిబహిష్కరణ ప్రారంభమైంది. కార్మికులు అధికారిక నియామక ఉత్తర్వులు జారీ అయ్యే వరకు విధులకు తిరిగి రాబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పీఎస్‌‌పీసీఎల్‌ ‌చైర్మెన్‌ అండ్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌బసంత్‌ ‌గార్గ్‌ ‌మాట్లాడుతూ.. కార్మికులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -