ప్రజ్ఞానంద రికార్డు.. క్లాసికల్‌ చెస్‌లోనూ కార్ల్‌సన్‌కు షాక్‌

నవతెలంగాణ – హైదరాబాద్: భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరో రికార్డు సృష్టించాడు చెస్‌లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు మరోసారి ఓటమి ఎలా ఉంటుందో టేస్ట్ చూపించాడు. క్లాసికల్ చెస్‌ గేమ్‌లో కార్ల్సన్ను మట్టికరిపించాడు ప్రజ్ఞ. 2024 నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అతడు కార్ల్‌సన్‌ ఆట కట్టించాడు. ఈ మ్యాచ్‌ను 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. గతంలో ర్యాపిడ్‌/ఎగ్జిబిషన్‌ గేమ్స్‌లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి. చెస్ చరిత్రలోనే గత దశాబ్దకాలంగా కార్ల్సన్దే ఆధిపత్యం. తాజా గెలుపుతో ప్రజ్ఞానంద కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఆట ఆరంభంలో కార్ల్‌సన్‌ చేసిన కొన్ని తప్పులు ప్రజ్ఞానందకు ప్లస్పాయింట్గా మారడంతో తనదైన శైలిలో దూసుకెళ్లాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రమంలోనూ వ్యూహాత్మక ఎత్తులతో గొప్పగా ఆడాడు. చివరకు గెలుపును సొంతం చేసుకొని తన సత్తా చాటాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరాడు. కార్ల్‌సన్‌ ఐదో స్థానానికి పడిపోయాడు.

Spread the love