నవతెలంగాణ-ఆలేరు టౌన్
తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదు ఉప్పల్ లోని బాగాయత్ వద్ద చేపట్ట దలచిన నిరసనను భగ్నం చేసేందుకు, ఆలేరు పట్టణంలో గురువారం పోలీసులు ఉద్యమకారులను ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మలిదశ ఉద్యమకారుల కమిటీ వేసిందని వారు గుర్తు చేశారు.
కమిటీ హామీల అమలులో కదలిక లేదని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన ప్రకారం, ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు 250 యార్డ్స్ స్థలము మరియు పెన్షన్ సౌకర్యం, హెల్త్ కార్డు వెంటనే ఇచ్చి అమలు చేయాలని ఒక ప్రకటనలో ఉద్యమకారులు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల హక్కుల సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు పసుపు నూరి వీరేశం, రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేష్, తమ్మిడి పద్మారావు, బడుగు జహంగీర్ ఉన్నారు.



