స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు ఏ త్యాగానికైనా సిద్ధం

– సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విశాఖ : ‘విశాఖ ఉక్కు – ప్రజలందరి హక్కు’ నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడం కోసం ఏ త్యాగానికైనా సీపీఐ(ఎం) సిద్ధంగా ఉన్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రయివేటీకరణ చేస్తున్న బీజేపీని రాష్ట్ర ప్రజానీకం బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు విశాఖలోని జీవీయంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు(విశాఖ), కె.లోకనాధం(అనకాపల్లి), పి.అప్పలనర్స(అల్లూరి), టి.సూర్యనారాయణ (విజయనగరం), డి.వెంకటరమణ(మన్యం), డి.గోవిందరావు (శ్రీకాకుళం)లు శుక్రవారం ఉదయం 10గంటల నుంచి 24 గంటల నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను శ్రీనివాసరావు ప్రారంభించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని కారుచౌకగా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతుందని విమర్శించారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను స్ట్రాటజిక్‌ సేల్‌ పేరుతో 100శాతం అమ్మకానికి పెట్టిందన్నారు. విశాఖ కార్మిక వర్గం, ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా సుమారు 900 రోజుల నుంచి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం ఆందోళన చేస్తున్నారన్నారు. వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒకపక్క తాము వ్యతిరేకమని చేపుతూనే మరో ప్రక్క బీజేపీతో అంటకాగుతూ నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా స్టీల్‌ప్లాంట్‌ కోసం మాట్లాడటంలేదని విమర్శించారు. ఈ అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారనీ, స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవలసిన బాధ్యత రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరి మీద ఉందన్నారు.

Spread the love