అధ్యక్ష పాలన గుర్తుకొచ్చింది !

Presidential rule remembered!– సర్వాధికారాలు పీఎంఓవే
– ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టిన అధికారులు
– బ్రాండ్‌ మోడీ ఇమేజ్‌ పెంచేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యాలయం సర్వాధికారాలు చెలాయించింది. అక్కడ అధికారులు ఆడింది ఆట…పాడింది పాట. కార్యాలయంలో పనిచేసిన పలువురు సీనియర్‌ అధికారులు తమ అధికార పరిధిని అతిక్రమించి వివిధ రాష్ట్రాల్లో ప్రధాని ఇమేజ్‌ను పెంచేందుకు అహర్నిశలూ కృషి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పీఎంఓ వ్యవహార శైలి అధ్యక్ష తరహా పాలనను గుర్తుకు తెచ్చింది.
జీ-20 అధ్యక్ష స్థానాన్ని చేపట్టడానికి ముందు ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) భారతీయ విదేశీ సర్వీసుల (ఐఎఫ్‌ఎస్‌) అధికారుల సంఖ్య ఏడుకు పెరిగింది. 2022 నవంబరులో విపిన్‌ కుమార్‌, నిధి తెవారీలతో పాటు సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి దీపక్‌ మిట్టల్‌ను పీఎంఓలోకి తీసుకొచ్చారు. మిట్టల్‌ను ఓఎస్‌డీగా, కుమార్‌ను డిప్యూటీ సెక్రటరీగా, తెవారీని అండర్‌ సెక్రటరీగా నియమించారు. జీ-20 సదస్సు తర్వాత పీఎంఓ వెబ్‌సైటులోని అధికారుల జాబితాను పరిశీలించగా ఐదుగురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు వేర్వేరు పోస్టులు ఇచ్చారు.
జీ-20 దేశాల అధ్యక్ష పదవి రొటేషన్‌ పద్ధతిలో సభ్య దేశాలకు దక్కుతూ ఉంటుంది. ఇప్పుడది మన దేశానికి లభించింది. అందులో విశేషమేమీ లేదు. కానీ మోడీని భారత ప్రజల దృష్టిలో ఓ బలమైన ప్రపంచ నేతగా చూపేందుకు ఆయన కార్యాలయం సంవత్సరం పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించింది.
మోడీ హయాంలో పీఎంఓ దాదాపు అధ్యక్ష తరహా పాలనను తలపిస్తూ వ్యవహారాలు నడిపింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో అధ్యక్ష తరహా పాలనను గుర్తుకు తేవడం, మోడీకి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించడానికి ప్రయత్నించడం, బీజేపీ పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ మోడీని ముందుకు తేవడం…వీటన్నింటినీ గమనిస్తే దేశాన్ని ఏ వైపుకు నడిపేందుకు ప్రయత్నం జరిగిందో అర్థమవుతుంది.
అధికార పరిధిని అతిక్రమించి…
గత ఐదు సంవత్సరాల ఏలుబడిలో మోడీ ప్రభుత్వం అధ్యక్ష తరహా పాలనను గుర్తుకు తెచ్చిందనడంలో సందేహం లేదు. అందుకు పీఎంఓ ఇతోధికంగా తోడ్పాటు అందించింది. పీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కొందరు అధికారులు క్యాబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) సూచనల మేరకు ప్రభుత్వ వ్యవహారాలలో తల దూర్చారు. అనేక సందర్భాలలో వారు తమ అధికార పరిధిని అతిక్రమించారు. తద్వారా బలమైన నాయకుడిగా ప్రధానికి ఉన్న పేరు ప్రతిష్టలను దిగజార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పీఎంఓ అధికారుల ద్వారానే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిచాయి.
వ్యవహారాలు చక్కదిద్దిన క్వత్రా
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం 2016 అక్టోబరులో మోడీ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో ఎంఓయు కుదుర్చుకుంది. పీఎంఓలో ఓఎస్‌డీగా ఉన్న వినరు మోహన్‌ క్వత్రాను 2017 జులైలో రాయబారిగా పారిస్‌ పంపారు. రఫేల్‌ ఒప్పందం వివాదాస్పదమైన సమయంలోనే పీఎంఓలోని ఉన్నతాధికారిని ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పంపడంపై విమర్శలు వచ్చాయి. క్వత్రా 2020 ఫిబ్రవరి వరకూ ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. ఆ సంవత్సరం మార్చిలో క్వత్రాను భారత రాయబారిగా నేపాల్‌కు పంపారు.
మన దేశంలోని కొన్ని ప్రాంతాలను తనవిగా చూపుతూ నేపాల్‌ వివాదాస్పద మ్యాప్‌ను రూపొందించింది. దీనిపై ఆ దేశంతో చర్చలు జరుగుతున్న సమయంలోనే క్వత్రా అక్కడికి వెళ్లారు. 2020 మేలో మ్యాప్‌ను నేపాల్‌ క్యాబినెట్‌ ఆమోదించింది. మ్యాప్‌పై భారత రాయబారిగా క్వత్రా నేపాల్‌లో అనేక కీలక సమావేశాలు నిర్వహించారు.
2022 ఏప్రిల్‌లో మోడీ ప్రభుత్వం క్వత్రాను తదుపరి విదేశాంగ కార్యదర్శిగా ప్రకటించింది. 2023 ఫిబ్రవరిలో క్వత్రా నేపాల్‌ వెళ్లి ప్రధాని ప్రచండను భారత్‌కు ఆహ్వానించారు. సరిహద్దు వివాదంపై ఎన్ని చర్చలు జరిగినప్పటికీ నేటి వరకూ సమస్య పరిష్కారం కాలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా ఈ వివాదం తెర పైకి వచ్చింది. క్వత్రాపై మోడీకి ఉన్న నమ్మకం కారణంగా ఆయన ఈ సంవత్సరం అక్టోబర్‌ వరకూ పీఎంఓలో విదేశాంగ కార్యదర్శిగా కొనసాగుతారు.
లంకలో బగ్లే
ఇప్పుడు మరో ఐఎఫ్‌ఎస్‌ అధికారి గోపాల్‌ బగ్లే విషయానికి వద్దాం. 2017 నుండి పీఎంఓలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్న బగ్లే 2022 మేలో శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. 2023 డిసెంబర్‌ వరకూ అక్కడే ఉన్న బగ్లేను ఆస్ట్రేలియాకు రాయబారిగా పంపారు. శ్రీలంక విద్యుత్‌ కారిడార్ల విషయంలో మోడీ ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచేందుకు బగ్లే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అంతేకాదు… బగ్లే శ్రీలంకలో ఉన్న సమయంలోనే మోడీ ప్రభుత్వం ఆ దేశానికి నాలుగు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
ఖతార్‌లో మిట్టల్‌
2020 ఏప్రిల్‌లో ఐఎఫ్‌ఎస్‌ అధికారి దీపక్‌ మిట్టల్‌ను ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు. ఇజ్రాయిల్‌ తరఫున గూఢచర్యం నెరపుతున్నారన్న ఆరోపణలపై ఆ సంవత్సరం ఆగస్టులో ఎనిమిది మంది నౌకాదళ అధికారులను ఖతార్‌ అరెస్ట్‌ చేసింది. వీరిని విడుదల చేయించే విషయంపై మిట్టల్‌ 2022 నవంబర్‌ వరకూ ఖతార్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఆ నెలలో మిట్టల్‌ను ప్రధాని సలహాదారుగా పీఎంఓలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ మిట్టల్‌ తన ప్రయత్నాలు కొనసాగించారు. గత ఏడాది డిసెంబరులో దుబారులో మోడీ, ఖతార్‌ ఎమిర్‌ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నౌకాదళ అధికారులను ఖతార్‌ విడుదల చేసింది.
సుష్మను పక్కన పెట్టి…
సుష్మా స్వరాజ్‌ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడే పీఎంఓ పెత్తనం నడిచింది. మోడీ జరిపిన కొన్ని విదేశీ పర్యటనల్లో సుష్మ భాగస్వామి కాలేదు. మీడియాతో సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా ఆమెను పక్కన పెట్టారు. ఆమె తన పదవీకాలంలో ఒక్కసారి కూడా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో…నిన్నటి వరకూ విదేశాంగ మంత్రిగా వ్యవహరించిన జైశంకర్‌కు తత్వం బోధపడింది. విదేశీ వ్యవహారాలలో బ్రాండ్‌ మోడీ పాత్రను అర్థం చేసుకున్న ఆయన అంతా ప్రధానికే వదిలేశారు.
ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణలో బజాజ్‌
అధ్యక్ష తరహా పాలనను నడపడానికి మోడీకి సహకరించిన మరో అధికారి తరుణ్‌ బజాజ్‌. 2015-17 మధ్య కాలంలో పీఎంఓలో పనిచేసిన బజాజ్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పంపారు. వాస్తవానికి ఆయన రెవెన్యూ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర బడ్జెట్లను పర్యవేక్షించేది రెవెన్యూ కార్యదర్శే. బడ్జెట్‌లో కీలక పద్దు అయిన పన్నుల వ్యవహారాలను ఆయనే చూసుకునే వారు. కార్పొరేట్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా నెరవేర్చారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలన్నీ బజాజ్‌ ఆధ్వర్యంలోనే జరిగాయి. 2022 వరకూ ఆయన ఆ పదవిలోనే కొనసాగారు.
రామ మందిరం కోసం…
పీఎంఓలోని మరో అధికారి ఏకే శర్మను ఉత్తరప్రదేశ్‌కు పంపారు. 2022 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన శర్మ, గెలుపొందిన తర్వాత యోగి క్యాబినెట్‌లో మంత్రిగా చేరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే శర్మ యూపీ ప్రభుత్వంలో చేరారు. అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణం లో పీఎంఓలోని మరో అధికారి నృపేంద్ర మిశ్రా ప్రమేయం కూడా ఉంది. 2019 ఆగస్టులో పీఎంఓ లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన మిశ్రా, కొద్ది వారాల తర్వాత నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత ఆయనకు మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో బాలరాము డి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే.
మేము సైతం అన్న అధికారులు
రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి అమర్‌జీత్‌ సిన్హాను 2020 ఫిబ్రవరిలో మోడీ సలహాదారుగా నియమించారు. 2021 ఆగస్టులో ఆయన పీఎంఓకు రాజీనామా చేసినప్పటికీ 2022 నవంబరులో తిరిగి మోడీ ప్రభుత్వంలో చేరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మాణ పరమైన సంస్కరణలను రూపొందించే కమిటీకి నేతృత్వం వహించారు. ఉత్తరాఖండ్‌లో మోడీ మందిర ప్రాజెక్టును ముందుకు తీసికెళ్లేందుకు పీఎంఓలోని మరో అధికారి భాస్కర్‌ ఖుల్బేను అక్కడికి పంపారు. కోవిడ్‌ సమయంలో పీఎంఓ అధికారి పున్య సలీలా శ్రీవాత్సవ మీడియాకు రోజువారీ బులెటిన్లు విడుదల చేస్తూ మోడీ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ టీవీ ఛానల్‌లో ఆయన ప్రతి రోజూ సాయంత్రం వేళ కోవిడ్‌ బులెటిన్‌ చదివేవారు. మోడీ ప్రభుత్వం కోవిడ్‌ వైరస్‌తో అద్భుతంగా పోరాడు తోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో నాటేందుకు ప్రయత్నిం చారు. మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పీఎంఓ అధికారులు ముర్ము, అమిత్‌ ఖారేలు కూడా మోడీ ఇమేజ్‌ పెరగ డానికి తమ వంతు కృషి చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాలనలో బీహార్‌లో జరిగిన దాణా కుంభకోణాన్ని వెలికితీసింది ఖారేయే.

Spread the love