నివారణ, ఎదుర్కోవటం, స్పందనపై దృష్టి

– నేటి నుంచి జీ20 హెల్త్‌
వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం :కేంద్ర ఆరోగ్య అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆదివారం నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌ లో జీ20 సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆరోగ్య రంగంలో ప్రధానంగా నివారణ, ఎదుర్కోవటం, స్పందన అనే విషయాలపై దృష్టి సారించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలపై చర్చించనున్నట్టు తెలిపారు. వీటితో పాటు ఔషధాలు, వ్యాక్సిన్లు, థెరపీలు రోగ నిర్దారణ అంశాలు కూడా ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. 2022 డిసెంబర్‌ ఒకటిన భారతదేశం జీ20 గ్రూప్‌ ప్రెసిడెన్సీని తీసుకుందని గుర్తుచేశారు. మన దేశం విశ్వసించే వసుదైక కుటుంబం అనే భావనను తలపించేలా జీ20 ఇతివృత్తం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు … అనే నమూనాలో ఉందని తెలిపారు.ఔషధరంగ సహకారంతో యాంటీ మైక్రోబయాల్‌ రెసిస్టెన్స్‌ సమస్యను అధిగమించే విషయంపై చర్చిస్తామని తెలిపారు. అందుబాటులో, భద్రమైన, ప్రభావవంతమైన, నాణ్యమైన, చవకైన వైద్యసేవలతో పాటు ఆరోగ్య సేవల విస్తరణకు డిజిటల్‌ హెల్త్‌ ఆవిష్కరణలు, పరిష్కారాలను ఉపయోగించడంపై సమావేశం లోతుగా విశ్లేషిస్తుందని చెప్పారు. వాతావరణ మార్పులతో వస్తున్న ఆరోగ్య సమస్యలు-సంప్రదాయ వైద్యవిధానాలపై నిపుణులు దృష్టి సారిస్తారని ఆయన వివరించారు.ప్రపంచ వైద్య అవసరాలను తీర్చడంలో టెలిమెడిసిన్‌ కీలక భూమిక వహిస్తున్నదని అగర్వాల్‌ ఈ సందర్భంగా చెప్పారు. కో-విన్‌ వేదిక సులభంగా రక్తనిధి కేంద్రాలను తెలుసుకునేందుకు ఉపయోగపడిందన్నారు. సంయుక్తంగా చేసే కృషి సామాన్యునికి ఆరోగ్య సేవలందేందుకు దోహద పడుతోందని తెలిపారు. జీ-20 సదస్సులో ప్రపంచ ఆరోగ్యసంరక్షణ కోసం ఆయా దేశాలు ఒప్పందాలు చేసుకుంటాయని వెల్లడించారు. 180 మంది సభ్యులు, 10 ఆహ్వానిత దేశాలు, 22 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌లో నిర్వహించబోయే సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ డివైసెస్‌ సమావేశం
సదస్సు సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం మెడికల్‌ డివైసెస్‌ అంశంపై సమావేశం నిర్వహిస్తుం దని అగర్వాల్‌ తెలిపారు. కోవిడ్‌-19 సమయంలో ప్రపంచాన్ని ఆదుకోవడంలో భారతదేశం, తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించాయనీ, వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా చేశాయని గుర్తుచేశారు. ఈ సమావేశాలతో మరోసారి భారతదేశం, తెలంగాణ విశిష్టత ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 90 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. అయితే ఇప్పటికీ తక్కువ ఆదాయం కలిగిన దేశాలు, ఆఫ్రికన్‌ దేశాల్లో ఈ ప్రక్రియ 20 నుంచి 25 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. భవిష్యత్తులో కరోనా కన్నా భయంకరమైన మహమ్మారి వచ్చినా… ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను హెచ్చరించిందని గుర్తుచేశారు.

Spread the love