విభజన హామీలను విస్మరించిన ప్రధాని మోడీ

– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
– కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌
 –  ప్రధాని పర్యటనపై నిరసనలుొ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ప్రధాని నరేంద్ర మోడీకి లేదని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోటరమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ అన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ శనివారం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా హైదరాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోట రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజన చట్టం హామీల్లో ఉన్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు. తెలంగాణ పర్యటనకి వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ ఇచ్చిన హామీల గురించి ఊసెత్తకుండా.. ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవ్వడం సిగ్గుచేటన్నారు. బయ్యారం ఉక్కు పరశ్రమ పెడతామని చెప్పి తొమ్మిదేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా తెలంగాణ యువతని మోసం చేసారన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు హామీని ఇప్పటిదాకా నెరవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం యువతను మోసం చేస్తున్నదన్నారు.
ఆనగంటి వెంకటేష్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర విభజన చట్టం హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎండి.జావెద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్‌, అశోక్‌ రెడ్డి నాయకులు హస్మీ, అనిల్‌, రఘు, స్టాలిన్‌, వికిత, రమేష్‌, కళ్యాణ్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా మోడీ దిష్టి బొమ్మతో ర్యాలీ నిర్వహించారు. మోడీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. వైరా, కల్లూరు, మధిరలో దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లాల బావి సెంటర్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లో మండలంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.

Spread the love