Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడేండ్లయినా సమస్యలు తీర్చలే

మూడేండ్లయినా సమస్యలు తీర్చలే

- Advertisement -

తాము ఇండ్లు కడుతుంటే కూల్చేస్తున్నారు
సీఎం రేవంత్ రెడ్డిపై మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఆగ్రహం

నవతెలంగాణ-గజ్వేల్
మల్లన్నసాగర్‌లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని గతంలో వారికి మద్దతుగా 48 గంటల దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఈ ‌మూడేండ్ల కాలంలో మూడు సమస్యలు కూడా తీర్చలేకపోయారని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాల్టీలోని మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం నిర్వాసితులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నామని ఆరోపించారు. ఈ మేరకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన, ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు న్యాయం చేయాల్సింది పోయి, గజ్వేల్‌లో నిర్వాసితులు ఇండ్ల నిర్మాణం చేసుకుంటే కూల్చుతున్నారని.. ఇప్ప్పుడు కాంగ్రెస్ నాయకులను ఏమి అనాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోతున్న ప్రభుత్వం నిర్వాసితుల త్యాగాన్ని మర్చిపోయిందని ఆరోపించారు. 10 ఏండ్లు నిర్వాసితులకు ఉచితంగా నీరు, సౌకర్యాలు, పన్ను మినహాయింపు ఇస్తామన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుంటుంటే ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు.

తాము చనిపోతే ‌బొంద పెట్టేందుకు స్థలం కూడా లేదని, ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు తమను మున్సిపాల్టీలో కలిపి పన్నులు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారన్నారు. ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుంటే కూల్చే పరిస్థితి వచ్చిందని తెలిపారు. నిర్వాసితుల ధర్నాకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ నర్సింగ్ రావు తదితరులు మద్దతు తెలిపి మాట్లాడారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. నిర్మాణంలో ఉన్న భవనానికి అడ్డంకులు ‌సృష్టిస్తున్న మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆర్‌అం‌డ్‌ఆర్ కాలనీలో ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ అడగవద్దని డిమాండ్ చేశారు. నూతనంగా విలీనమైన ముంపు గ్రామాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించాలని, నివాస ‌గృహాలు నిర్మించుకునేందుకు ప్రత్యేక నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని, పెండింగ్ పరిహారాలు వెంటనే చెల్లించాలని, నిర్వాసితుల జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామరంచ ప్రతాప్ రెడ్డి, గూడూరి రాములు, పెద్ది బాలకిషన్ చింతకింది కనకయ్య, బండ్ల స్వామి, ఎన్‌సీ సంతోష్, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు, అతెల్లి శ్రీనివాస్, కోట బాబు, ముంపు గ్రామాల నాయకులు తదితరులు పా‌ల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -