Wednesday, June 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనా పైనే చమురు ధరల భవిష్యత్

చైనా పైనే చమురు ధరల భవిష్యత్

- Advertisement -

ఇంధన సంక్షోభ నివారణలో కీలకపాత్ర
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం..చౌకగా అమ్మకాలు జరిపే అవకాశం

బీజింగ్ : చమురు ధరల భవిష్యత్ చైనాపై ఆధారపడబోతోంది. వినడానికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే అయినప్పటికీ ఇందులో ఆవగింజంత అతిశయోక్తి కూడా లేదు. ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలలో చైనాది రెండో స్థానం. ఇరాన్ యుద్ధం కారణంగా రోజుకు 11 మిలియన్ బ్యారల్స్‌కు పైగా చమురు సరఫరాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ తన వద్ద ఉన్న నిల్వలను కాపాడుకోవడానికి చైనా సర్వశక్తులు ఒడ్డింది. దిగుమతులను కుదించుకుంది. తన వద్ద పెద్ద మొత్తంలో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వాడుకుంది. క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచింది. ఈ చర్యల ద్వారా చమురు ధరల ప్రభావాన్ని పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా తగ్గించగలిగింది. చైనా చర్యల ప్రభావం అటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా కన్పించింది.

ఆసియా దేశాలకు మార్గదర్శి
మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం కారణంగా ఈ ఏడాది చమురు ధరలు బ్యారల్‌కు 200 డాలర్ల వరకూ పెరగవచ్చునని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సరఫరా నష్టాల అంచనా వంద కోట్ల బ్యారల్స్ దాటినప్పటికీ ముడి చమురు ధరలు సాపేక్షంగా చూస్తే తక్కువగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం చైనాయేనని విశ్లేషకులు తేల్చి చెప్పారు. చమురు సంక్షోభాన్ని తట్టుకోవడంలో మిగిలిన ఆసియా దేశాలకు చైనా మార్గదర్శిగా నిలిచిందని, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిందని వారు తెలిపారు. ఇదిలావుంటే ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఎంఓయూ కారణంగా హార్ముజ్ జలసంధిలో త్వరలోనే వాణిజ్య నౌకల రాకపోకలు యధావిధిగా జరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం 78 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. గత నెల ప్రారంభంలో ఇది నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయి 114 డాలర్లకు చేరడం గమనార్హం.

పునరుద్పాదక ఇంధనంపై ఆసక్తి
వచ్చే సంవత్సరం ప్రపంచంలో చమురు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ఇటీవల నెలకొన్న అస్థిర పరిస్థితులు పునరుత్పాదక ఇంధన వనరులపై ఆసక్తిని పెంచాయి. ఈ ఇంధనం దీర్ఘకాలంలో ముడి చమురు వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఈవీలు, బ్యాటరీలు, సౌరశక్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న చైనా…ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మార్చి నెలలో క్లీన్ ఎనర్జీ సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులలో రికార్డు సృష్టించింది. అమెరికా ఆంక్షల ఎత్తివేతతో ఇరాన్ రాబోయే రోజులలో తన ముడి చమురు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. అయితేచైనా చమురుతో పోలిస్తే ఇరాన్ చమురు కొనుగోలుదారులను అంతగా ఆకర్షించదు. ఎందుకంటే చైనా చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. కాబట్టి ఇరాన్ కంటే తక్కువ ధరకే విక్రయించగలదు.

సంక్షోభ నివారణకు బీజింగ్ చర్యలు
ప్రపంచ ఇంధన రంగంలో చైనా ప్రభావం పెరుగుతున్నందున దాని విధానాలు, వినియోగ సరళి మార్కెట్‌కు కీలకం కాబోతున్నాయి. చమురు వినియోగాన్ని చైనా తగ్గించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆంక్షలకు గురైన చమురును యుద్ధానికి ముందు రష్యా, ఇరాన్ దేశాల నుంచి చౌకగా కొనుగోలు చేసిన చైనా తన వద్ద ఉన్న నిల్వలను పెంచుకుంది. ప్రస్తుతం చైనా వద్ద బిలియన్ బ్యారల్స్‌కు పైగా వాణిజ్య, వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల వినియోగం మే నెలలోనే ప్రారంభమైంది. దేశంలో సరఫరాలు సజావుగా జరిగేందుకు వీలుగా డీజిల్, గ్యాసోలిన్ వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతులను కూడా చైనా పరిమితం చేసింది. ఈ చర్యల కారణంగా చైనా చమురు శుద్ధి కర్మాగారాలు ప్రపంచ మార్కెట్ నుంచి ముడి చమురును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మరోవైపు చైనాలో ఎలక్ద్రిక్ వాహనాల వినియోగం బాగా పెరగడం శిలాజ ఇంధనాల అవసరాన్ని తీర్చింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం గత సంవత్సరం చైనాలో ఎలక్ట్రానిక్ వాహనాలు రోజుకు సుమారు పది లక్షల బ్యారల్స్ చమురు వినియోగాన్ని తగ్గించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -