హైదరాబాద్ మెట్రో ట్రైన్ పేరుతో
రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు
రూ.30 వేల కోట్ల మెట్రో రైల్
ఆస్తులపై సీఎం కన్ను : కేటీఆర్
నవతెలంగాణ-మియాపూర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పార్టీ నియోజవకర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మియాపూర్‌లోని నేరన్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్ పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను పడిందన్నారు. బీఆర్ఎస్ తరపున కార్యకర్తల కష్టంతో గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారని ఆరోపించారు. ఆయననే గతంలో పదేండ్ల బీఆర్ఎస్ కాలంలో ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గానికి రూ.9,500 కోట్లతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ఒక ప్రగతి నివేదికను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
మరి ఈ రెండేండ్లలో ఎన్ని డబ్బులు నియోజకవర్గానికి తెచ్చారో గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడని ఆరోపించారు. తులం బంగారం, మహిళలకు రూ.2500 ఇవన్నీ ఎక్కడా అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఆరచకాలు సృష్టిస్తోందన్నారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేక్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



