Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు

అమెరికా కాన్సులేట్‌ రోడ్డుకు ట్రంప్‌ పేరు

- Advertisement -

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అమెరికాతో ఉన్న అనుబంధానికి
గుర్తు అని వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
​​”తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన‌ట్టుగా అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయించాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆ రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించేందుకు వేదికపై ఉన్న అమెరికా రాయబారి సెర్జియో గోర్, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌లను ఆయన ఆహ్వానించారు. హైదరాబాద్‌‌ నానక్ రాంగూడలోని యూఎస్ కాన్సులేట్‌లో మంగళవారం జ‌రిగిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ​హైదరాబాద్‌కు అమెరికా డెవలప్‌మెంట్ సెంటర్ ఇస్తే తాము గ్లోబల్ సీఈఓలను ఇచ్చామని అన్నారు. హైదరాబాద్‌కూ అమెరికాకూ మధ్య ఉన్నది దౌత్య సంబంధం కాదనీ, ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధమని వివరించారు. ప్రతి తెలుగు ఇంట్లోనూ అమెరికా ఒక భాగమైందన్నారు.

​ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ-యూఎస్ అడుగులు వేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడటంలో అమెరికా అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. 1990లో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో అడుగుపెట్టిందని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈఓగా ఎదగడం వరకు ఉన్న ప్రయాణాన్ని గుర్తుచేశారు. తెలుగు వారి నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు. ​”తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం ఇప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదన్నారు. అది దాటి ‘సహసృష్టి’ దశలోకి అడుగుపెట్టిందని వివరించారు. జీవవిజ్ఞానం (లైఫ్ సైన్సెస్), వ్యాక్సిన్ల తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో ఈ బంధం మరింత గట్టిపడిందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), శుద్ధ ఇంధనం (క్లీన్ ఎనర్జీ), ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఈ భాగస్వామ్యం మరిన్ని కొత్త పుంతలు తొక్కబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ​డెక్కన్ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం సాంస్కృతిక దౌత్యానికి ప్రతీక అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -