దేశ అత్య‌వ‌స‌ర ప్రాధాన్య‌త‌ నేటి బాల‌ల ర‌క్ష‌ణ‌

దేశ అత్య‌వ‌స‌ర ప్రాధాన్య‌త‌ నేటి బాల‌ల ర‌క్ష‌ణ‌Any Society Which Does Not Care for its Children is No Nation at All
నెల్సన్‌ మండేలా
నవంబర్‌ నెల వచ్చిందంటే మన ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, పౌర సమాజం భారత తొలి ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14, ఐక్య రాజ్యసమితి బాలల ఒడంబడికను ఆమోదం తెలిపినా, నవంబర్‌ 20 వ తేదీని బాల హక్కుల రక్షణ వారోత్సవాలను జరుపుకుంటూనే ఉన్నాం. బాలల హక్కుల గురించి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టిన పలు విధానాలు, చట్టాలు ఎన్ని తెచ్చినా భారతదేశ బాల్యానికి ఇంకా విముక్తి జరగడం లేదు.

అసలు బాలలు ఎంత మంది ఉన్నారు బడికెళుతున్న వారు ఎంత మంది బాలకార్మికులు ఎంతమంది ఉన్నారనే విషయం ప్రతి పది సంవత్సరాలకు ఒక సారి దేశ వ్యాప్తంగా సేకరించే జనాభా లెక్కలప్పుడే తెలుస్తాయి. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల తరువాత 2021 నిర్వహించాల్సిన జనాభా లెక్కలు ఈనాటి వరకు నిర్వహించలేదు కాబట్టి ప్రభుత్వాల వద్ద సరి అయిన గణాంకాలు లేవు.
బాలకార్మికులు లెక్కలు ప్రభుత్వానికి దొరకక పోవచ్చును గాని మనం ప్రతి నిత్యం బాలకార్మికులు పనులు చేయడం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా అన్ని పట్టణ, నగర శివారులలో ఇటుక బట్టీలలో తల్లిదండ్రులతో పాటు అయిదు సంవత్సరాల పాల బుగ్గల పసివారు ఇటుకలను తయారు చేస్తూ, నిర్మాణరంగంలో భవన నిర్మాణలో పనిచేస్తూ మన అందమైన నగరాలను నిర్మిస్తూ, గద్వాల జోగులంబ జిల్లాలో వేలాది మంది బహుళ జాతి కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న హైబ్రిడ్‌ పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తూ, పంటకు వచ్చిన పత్తిని తెంపటానికి దాదాపు అన్ని జిల్లాలలో బాలకార్మికులు మనకు తటస్థ పడుతూనే ఉంటారు. గొర్రెల పంపిణీ పథకం ఏమో గాని వాటి వెంట బాలలను తమ కుటుంబాల తోటి వెళ్ళడం నిత్యం దర్శనం అవుతూనే ఉంటారు. వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులలో కలుపు, కోతలు, మోతలు మోస్తూ, కరీంనగర్‌, సిరిసిల్ల, నల్గొండ, సూర్యపేట మొదలగు జిల్లాలలో ఇసుకను తరిలించే పనిలో కొంత మంది బాలలు ప్రమాదాలకు గురి అయి ప్రాణాలు పోయిన విషయాలు ఈ మధ్య మనం విన్నాం. అదే విధంగా, వికారాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో గ్రానైట్‌ గనులలో, రవాణా కూలీలుగా పనిచేస్తూ, సెవన్‌ సీటర్‌ ఆటోలలో సహాయకులుగా రాష్ట్రం నలుమూలలలో ప్రతి చిన్న గ్రామం నుండి పెద్ద పెద్ద నగరాలలో కనిపిస్తూనే ఉంటారు. మరో ముఖ్యమైన చాకిరీ ఏంటంటే, ఈ పిల్లలు నగరాలలో మద్యతరగతి ఇళ్ళల్లో పని మనుషులుగా బాల్యాన్ని కోల్పోతున్నారు. పనిమనుషులగా పని చేసిన పిల్లల అనుభవాలను వింటే వీరిని ఆధునిక బానిసలుగా చేసి ఇళ్ళలో బంధీలుగా, స్వేచ్చలేకుండా, బిక్కు బిక్కుమని తమ రోజులను గడపడం సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఇక వీధి బాలల కష్టాలు సరే సరి. వీధులలో ఛీ కొడుతూ, చెత్త కుప్పల వద్ద కుక్కలతో ఆహారం కోసం పోటీ పడుతూ ఉన్న దృశ్యాలు దర్శనమిస్తూనే ఉంటాయి. హైదరాబాదు నగరంలో జరీ, గాజుల పరిశ్రమల్లో వేలాది మంది పిల్లల్ని ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణా ద్వారా తీసుకొనివచ్చి పనులను చేయించు కోవడం అప్పుడప్పుడు ఆపరేషన్‌ స్మయిల్‌ పేరు మీద పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు దాడులు చేసినప్పుడు మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. ఇలా బాలలు చదువుకునే వయస్సులో తమ బాల్యాన్ని కోల్పోయి బాలకార్మికులుగా జీవానాన్ని గడుపుతున్నారు.
క్లుప్తంగా చెప్పాలంటే మనకు లభ్యమవుతున్న కూడు, గూడు, గుడ్డ అందించే అన్ని ఉత్పాదక ప్రక్రియలలోనూ బాలల శ్రమ ఉందనేది చేదు నిజం. బాలకార్మికత నిర్మూలనే దేశాభివృద్ధికి ముఖ్యమైన కొలమానంగా ప్రభుత్వాలు అంగీకరించే వరకు ఈ పరిస్థితిలో మార్పులురావు.
బడి నుండి పనికి :
మరోవైపు, బడిలో చేరిన పిల్లలు చాలామంది పదోతరగతి పూర్తికాకుండానే చదువు మానేస్తున్నారు. బడి మానేస్తున్న పిల్లలలో అత్యధిక శాతం అణగారిన వర్గాల కుటుంబాలకు చెందిన పిల్లలే. ఈ పిల్లలంతా బడులు మాని పనులలలో చేరిపోతున్నారన్నమాట. ఈ పరిస్థితికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో కొన్ని బడులలో సరైన వసతులు లేక పోవడం, పిల్లల పట్ల తగు శ్రద్ద వహించక పోవడం, బడి పట్ల ఆసక్తిని కలిగించక పోవడం, ఆహ్లాదకరమైన బోధన ఉండకపోవడం, ఉన్నత పాఠశాలలు దూరంగా ఉండడం, చదువడం లేదని పిల్లలను శారీకంగా దండించడం, మానసికంగా హింసించడం వలన బడి మానేస్తుంటారు. బడి హాజరు రిజిస్టరులో డ్రాపౌట్‌ గా ముద్ర పడుతుంది. నిజానికి ఈ పిల్లలు బడి చూపిన వివక్షత వలన వాకౌట్‌ అయ్యారని, లేదా కొన్ని సందర్భాలలో పుశౌట్‌ అయ్యారని గ్రహించాలి. బడి మానిన బాలలందరు ఏదో ఒక పనిలో చేరిపోతారని పలు నివేదికలు చెబుతూనే ఉన్నాయి. అలాగే బాల కార్మికులుగా ఉన్న బాలలందరూ అత్యధిక శాతం బడి మానేసినవారే. బాలకార్మికత బాలల విద్యాహక్కును కాలరాస్తున్నది. ఇది వారి ఆరోగ్యానికి, భద్రతకు, నైతికతకు భంగం కలిగిస్తుంది. బాలకార్మికత నిర్మూలన, బాలల విద్యా హక్కు ఒకే కోణానికి చెందిన రెండు దిక్కులు. ఇవి విభజించలేని అంశాలు.
బాలికలు- బాలకార్మికులు :
బాలకార్మికులలో అత్యధిక శాతం బాలికలే. వీరి పని చాలా సార్లు నిగూఢంగా ఇమిడి ఉంటుంది. ఎక్కువ మంది బాలికలు ఇంటిపనిలో నిమగమై ఉన్నారు. వీళ్లు ఇంట్లో చేసే పనిని చాలా సంవత్సరాలుగా గుర్తించనేలేదు. వీళ్లని ఈ రోజు ఏం పని చేశావని అడిగితే ఏమి చేయలేదని చెపుతారు. కానీ వివరాల్లోకి వెళ్లి ఈ రోజు నీళ్ళు ఎవరు తెచ్చారు, కట్టెలు ఎవరు తెచ్చారు, వంట ఎవరు చేశారు, అంట్లు ఎవరు తోమారు అని అడిగితే ఈ పనులన్నీ తామే చేశామనిచెప్పారు. వాస్తవానికి వాళ్ళ అమ్మా, నాన్నలు కూలినాలికి పోవడానికి ఇంట్లో పనంతా బాలికలే చేస్తారు. బడికి వెళ్లకుండా ఇంటి పనులను చేసే బాలికలను బాల కార్మికులుగా గుర్తించకుండా మన పాలకులు, సభ్య సమాజం సమర్ధించి, బాలికల దోపిడీకి పరోక్షంగా దోహదపడిందనే చెప్పాలి.
రాజీ లేని ధోరణే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మూలం :
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పౌర సమాజం, అన్ని ప్రజా సంఘాలతో కలసి సమిష్టి కృషి చేయాలి. బాలకార్మిక వ్యవస్థపై ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడని ధోరణి తీసుకోవాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఉద్యమాల ద్వారా వత్తిడి పెంచాలి. తన నెట్‌ వర్క్‌ ద్వారా పిల్లలను, వారి తల్లిదండ్రులను సమాజంలో ఇతరులను చేర్చుకుని వ్యవస్థతో సంప్రదింపులకు ఆస్కారం కల్పించాలి. ముఖ్యంగా భవన నిర్మాణ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఆహార పదార్ధాల పరిశ్రమలలో బాలకార్మికతకు ఆస్కారం లేకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలి. కంపెనీలు, తమ లావాదేవీలలో ఏదశలోనూ బాలకార్మికులు లేకుండా చూడాలి. కంపెనీల ఉత్పత్తి ఏదశలో (సప్లరు చైన్‌) బాలకార్మికులు ఉన్నా, అనగా ముడి సరకులు సేకరణ స్థాయి నుండి వస్తువుల తయారీ వరకు ప్రభుత్వం అట్టి కంపనీలపై కటిన చర్యలు తీసుకోవాలి. బాలలు పూర్తికాలం పాఠశాలలకు వెళ్ళేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, పౌరసమాజం, కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజల సహకారం తీసుకోవాలి.
బాలలు అతి చవక వేతనానికి లభించినంత కాలం పెద్దలకు సరైన వేతనాలు లభించడం, సమాన పనికి సమాన వేతనాలు లభించడం సాద్యపడదని గమనించాలి. బాలలందరూ బడిలో కొనసాగినప్పుడు, తక్కువ వేతనానికి పనిచేసే బాలకార్మికులు లేనప్పుడు పెద్దలు తమ శ్రమకు తగిన పారితోషకం (వేతనం) కోసం బేరమాడగల సామర్థ్యం పెరుగుతుంది.
బడిలో చేరవలసిన వయసులో పిల్లందరూ బడిబాట పట్టేలా, 18 ఏళ్ళ వయసు వరకు చదువు మానకుండా బడికి వెళ్ళేలా చూడాలి. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్యమిస్తున్న అన్ని రకాల గ్రూపులు, ప్రభుత్వం, పౌరసమాజం, స్వచ్చంద సంస్థలు, కార్మిక సంఘాలు అందరి సమిష్టి కృషి. ఒకరి ప్రయత్నానికి మరొక తోడ్పాటు అవసరం.
బాలకార్మికుల రహిత సమాజం:
బడి మానివేసిన, లేదా అసలు బడికి వెళ్ళని పిల్లలందరిని బడిలో చేర్చి, బడికి వస్తున్న మొదటితరం విద్యార్థులను బడిలో కొనసాగడానికి ఎదురయ్యే ప్రతిబంధకాలన్నిటిని తొలగిస్తూ సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛ, ప్రోత్సాహం అందేలా కృషి జరగాలి. బడిలో పిల్లల, శారీరక మనోవికాసానికి అవసరమైన అన్ని సదుపాయాలను పాఠశాలలు కల్పించాలి.
బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే పేదల పట్ల గౌరవం, బాలలకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను గౌవరవించడం అనే రాజీ లేని సంకల్పం ఉండాలి. బడి బయట వున్న బాలలెవరైనా కార్మికులుగా మారే ప్రమాదం ఉందని, బాలకార్మికత ఏ రూపంలో ఉన్నా అది ఆధునిక బానిసత్వమేనని నమ్మాలి.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం నిర్భంద విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచంలో చాలా దేశాలు రుజువు చేశాయి. అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కొన్నవే. కానీ ఆయా దేశాలు రాజకీయ దృఢ సంకల్పంతో, తమ దేశ బాలలపై తమ ఆర్ధిక వ్యవస్థను నిర్మించలేమన్న కఠోర వాస్తవంతో బాలలందరికి ఉచిత, నిర్భంద నాణ్యమైన విద్యను అందించి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపారు.
బాలకార్మికత పట్ల సమాజం, ప్రభుత్వాలు ఏమాత్రం సహనం ప్రదర్శించకుండా, బాలకార్మికత ఏ రూపంలో ఉన్నా చట్ట విరుద్ధమేనని ప్రకటించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రత్యేకించి చూడకుండా వివిధ బాలల హక్కుల ఉల్లంఘనలతో ముడిపడి ఉన్న ముఖ్యమైన అంశం అని గమనించాలి. మన దేశం బాలల హక్కుల రక్షణకు అతి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణ నిర్మూలన సాధ్యంఅని అని గమనించాలి.
బాలల హక్కుల కోసం రాజ్యాంగంలో వివధ అధికరణాలలో స్పశించిన అంశాలను అలాగే అంతర్జాతీయంగా మన దేశం ఆమోదం తెలిపిన పలు ఒడంబడికాలను అర్ధం చేసుకోవాలి.
రాజ్యాంగంలో బాలలకు రక్షణ :
భారత రాజ్యాంగం రూపొందిస్తున్న దశలోనే బాలల రక్షణ గురించి విస్తృతమైన చర్చలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ నేతృత్వంలో పలువురు జాతీయ స్వాతంత్య్ర సమర యోధులు, మేధావులు రాజ్యాంగంలో బాలల రక్షణకు తగు స్థానం కల్పించారు. రాజ్యాంగంలోని కొన్ని అధికరణాలను పరిశీలిస్తే ఆర్టికల్‌ 21 గౌరవంతో జీవించే హక్కును అలాగే 2002 సంవత్సరంలో చేసిన రాజ్యాంగ సవరణ 21a ద్వారా 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ విద్యా హక్కును కూడా ఈ అధికరణమే వివరిస్తుంది. ఆర్టికల్‌ 24 ప్రకారం బాలలకు ప్రమాదకరమైన పనుల నుండి రక్షణ కల్పించాలని నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 39-ఇ బాలల ఆర్థిక అవసరాలను అలుసుగా చేసుకుని వారిని వేధించడం, వారిపై పని భారాన్ని మోపడం నుండి రక్షణ కలిగిస్తుంది. ఆర్టికల్‌ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్‌ 15 వివక్షత నుండి రక్షణ, ఆర్టికల్‌ 23 వెట్టి చాకిరీ, అక్రమ రవాణా నుండి రక్షణ, ఆర్టికల్‌ 46 బలహీన వర్గాల సమూహాలను సామాజిక న్యాయం, అన్నీ రకాల దోపిడి నుండి రక్షణ కల్పించ బడింది.
బాలల సంరక్షణ – చట్టాలు :
ప్రభుత్వాలు బాలల రక్షణకు రాజ్యాంగం ఆదేశించిన పలు హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చట్టాలను, విధానాలను రూపొందిస్తూనే ఉన్నాయి. బాలలను పని భారం నుండి, దోపిడి నుండి రక్షణకు బాలలు కౌమార్య (అడోల్సెంట్‌) కార్మిక చట్టం బాలలకు ఉచిత విద్యను అందించ డానికి బాలల ఉచిత నిర్బంద విద్యా హక్కు చట్టం, 18 సంవత్సరాలలోపు బాలలకు సంరక్షణ, రక్షణ కొరకు జువనైల్‌ జస్టీస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) ఆక్ట్‌, 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహాలు నిషేదిస్తూ, బాల్య వివాహ నిషేధ చట్టం, 18 సంవత్సరాలలోపు బాలలను లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించడానికి పోక్సో చట్టం, భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్‌ పీనల్‌కోడ్‌), ఎస్సీ, ఎస్టీ ఆక్ట్‌, మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం (ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ ప్రివెన్షన్‌ ఆక్ట్‌ ) ఇంటర్‌ స్టేట్‌ మైగ్రేషన్‌ వర్కమన్‌ చట్టం ఇలా అనేక చట్టాలను చేశారు. కానీ అమలులో చిత్తశుద్ది లోపించిందని నేటి బాలల స్థితిగతులను చూస్తే అర్ధమవుతుంది.
చివరగా ..
బాలల హక్కుల పరిరక్షణ – ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత:
బాలలకు భారత రాజ్యాంగం, మన ప్రభుత్వం ఆమోదించిన పలు ఐక్యరాజ్య సమితి ఒడంబడికల ద్వారా జీవన హక్కును, వికాసపు హక్కును, ఎదుగుదల, భాగస్వామ్యపు హక్కులను, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, వివక్షత నుండి రక్షణ, లైంగిక దాడుల శారీరక దాడులు నుండి రక్షణ, స్వేచ్చ ఇలా అనేక హక్కులు కలిగి ఉన్నారు. అయినా పిల్లలు బాల కార్మికత, బాల్య వివాహాలు, వ్యభిచారం, అక్రమ రవాణా, ఆకలి, పౌష్టికాహార లోపం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌, నిరాశ్రయులవడం, అనాధలుగా మారడం నివాస వసతి లేకపోవడం, సాయుధ సంఘర్షణలలో నలిగిపోవడం, రకరకాల మార్గాలలో అదృశ్యం కావడం మొదలగు హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక అంశాలలో బాలల హక్కుల రక్షణలో వెనుకబడే ఉన్నామని వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల గణాంకాలు తెలియచేస్తున్నాయి.
బాలల పట్ల సమాజంలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం ఫలితంగా వారికున్న హక్కుల భంగం జరుగుతూనే ఉంది. వారి ప్రాధమిక అవసరాలు నిరాకరించబడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులలో వారికి విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, ఆత్మగౌరవం, వారి ప్రాధాన్యతను గుర్తించే పరిస్థితులను కల్పించవలసిన చట్టబద్ద బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
బాలల హక్కులు సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలలో అంతర్లీనంగా ఉండే విశ్వజనీయమైన సార్వత్రిక నియమాలు. కనుక, బాలల హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించవలసిందే.
అత్యధిక శాతం పేద, అణగారిన వర్గాలకు చెందిన బాలలే తీవ్రమైన అన్యాయాలకు గురవుతుంటారు. పిల్లలు ఎదుర్కొనే ఛీత్కారాలు విస్తృతమైనవి. అవి అనునిత్యం వారికి కలిగే అనుభవాలే. తరచూ జరిగే అమర్యాదకర సంఘటనలే. పేదరికంలో పెరుగుతున్న పిల్లలనే ఆ పేదరికానికి బాధ్యులను చేయడం భావ్యం కాదు. బాలలు పేదరికంలో మగ్గడం సంస్థాగతంగా జరుగుతున్న ఒక అన్యాయం. ఈ దుస్థితికి ప్రస్తుతం ఉనికిలోనున్న రాజకీయ, సామాజిక, ఆర్ధిక వ్యవస్థలే బాధ్యత వహించాలి.
ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఒడంబడిక ఉన్నప్పటికీ, బాలల హక్కుల రక్షణకు భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్నప్పటికి చట్టాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించే సమయంలో బాలల హక్కుల పట్ల ప్రభుత్వాలు ఎప్పుడూ రాజీధోరణి ప్రదర్శిస్తుంటాయి. లోపభూయిష్టంగా ఉన్న చట్టాలన్నీటిని సవరించాలి.
వివిధ చట్టాలలో పేర్కొన్న ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమశాలలు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులు, బాలల సంక్షేమ సంఘాలు, ప్రత్యేక జువెనైల్‌ పోలీస్‌ యూనిట్లు, సమగ్ర బాలల పరిరక్షణా పథకం, జిల్లా బాలల పరిరక్షణా యూనిట్లు, బాలల హోమ్స్‌, షెల్టర్లు, దత్తత, స్పాన్సర్షిప్‌, చైల్డ్‌ లైన్‌ మొదలైన వ్యవస్థలు, అందులో పని చేస్తున్న వృత్తి నిపుణులు, వివిధ హోదాల్లో (ప్రొబేషన్‌ ఆఫీసర్లు, ప్రొహిబిషన్‌ ఆఫీసర్లు, బాలల సంక్షేమ అధికారులు) ఉన్నవారి సమగ్ర పనితీరుకై ఒత్తిడి చేస్తూ ఉండాలి. బాలల హక్కుల పరిరక్షణ కోసం మనుగడలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలు సమర్ధవంతంగా, సమగ్రంగా పని చేసినప్పుడే పిల్లల్ని దుర్భర పరిస్థితుల నుండి కాపాడగలం.
పిల్లల హక్కుల పరిరక్షణ వనరుల పంపిణీకి సంబంధించిన అంశం. బాలలకు భద్రత కల్పించడం కేవలం సామాజిక విధానమే కాదు, అది పౌర సదుపాయాల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, విద్య మొదలైన అనేక విధానాలను స్పృశించే అంశం.
జనాభాలో 40 శాతంగా ఉన్న బాలల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ నివేదికలలో చేసిన సిఫారసులకు అనుగుణంగా నిధులను కేటాయించాలి.
బాలలు అనునిత్యం అనుభవిస్తున్న అన్యాయాలను, దౌర్జన్యాలను సరిదిద్దాలనే స్పృహ, బాలల హక్కులను కాపాడాలనే రాజకీయ సంకల్పం గ్రామ పంచాయితి నుండి జాతీయస్థాయి వరకు రావాలి. అప్పుడే బాలలు హుందాగా, స్వేచ్ఛంగా ఎదగడానికి గ్యారంటీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుంది.
రేగట్టే వెంకట్‌ రెడ్డి, 9949865516

Spread the love