బొగ్గు గనుల వేలంపై నిరసనలు

బొగ్గు గనుల వేలంపై నిరసనలు– శ్రావణపల్లి బ్లాకును సింగరేణికి కేటాయించాలని డిమాండ్‌
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నాలు
నవతెలంగాణ- విలేకరులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు బ్లాకుల వేలం పాటను వెంటనే ఆపేయాలని, రాష్ట్రంలోని గనులను సింగరేణి సంస్థకే నేరుగా కేటాయించాలని రెండో రోజూ నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం సీపీఐ(ఎం) శ్రేణులు ధర్నాలు చేశారు. మంచిర్యాలలోని శ్రావణపల్లి బ్లాకును సింగరేణికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని గీతాభవన్‌ చౌరస్తాలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తున్నదని, అందులో సింగరేణి సంస్థ కూడా ప్రయివేటు సంస్థలతోపాటు పోటీ పడాలనడం సరైంది కాదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సింగరేణి కాలరీస్‌ బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు. సహజంగానే శ్రావణపల్లిలో సింగరేణి సంస్థనే బొగ్గు తవ్వాలన్నారు. కానీ కేంద్రం వేలంపాట ద్వారా ప్రయివేటు సంస్థలకు అవకాశం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం నుంచే బొగ్గు గనుల శాఖామంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించటం అన్యాయమన్నారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదలాలని పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు.
బొగ్గు గనులను సింగరేణికెే కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ డిమాండ్‌ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రాష్టంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా, సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు బొగ్గుబావుల వేలంపై పోరాటాలు చేయాలని కోరారు. వేలం పాటకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు, విద్యార్థులు, యువత, మేధావులు అందరూ ఏకతాటిగా పోరాటాలకు సిద్ధం అవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఆసిఫాబాద్‌లో అంబేద్కర్‌ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.

Spread the love