నివేదిక బయటపెట్టండి

– బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలేవీ?
– న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
– జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలో రెజ్లర్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు, నిధుల దుర్వినియోగం సహా పలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ మీనమేషాలు లెక్కించటంపై మల్లయోధులు మళ్లీ నిరసన బాట పట్టారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య వ్యవహారాలపై నియమించిన పర్యవేక్షణ కమిటీ రూపొందించిన నివేదికను బయటపెట్టాలని కోరుతూ భారత స్టార్‌ రెజ్లింగ్‌ క్రీడాకారులు వినేశ్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, భజరంగ్‌ పూనియా సహా పలువురు రెజ్లర్లు ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు.
నివేదిక ప్రజల ముందుంచాలి : బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్‌ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో పర్యవేక్షణ కమిటీని కేంద్ర క్రీడాశాఖ నియమించింది. జనవరి నాల్గో వారంలో రెజ్లర్లు ఆందోళనకు దిగగా.. మూడు రోజుల అనంతరం క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విచారణకు కమిటీ నియమించేందుకు అంగీకారం తెలిపారు. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక రావాల్సి ఉండగా.. సుమారు పది నెలలకు పైగా సమయం పట్టింది. ఏప్రిల్‌ 5న పర్యవేక్షణ కమిటీ నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. విచారణ సందర్భంగా బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు అనుకూలంగా వాంగ్మూలాలు నమోదు చేశారని, ఆరోపణలు చేసిన రెజ్లర్లపై తిరిగి ఆరోపణలు మోపేలా విచారణ సాగిందని కమిటీలో ఓ సభ్యుడు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘నివేదిక సమర్పించేందుకు కమిటీకి ఎంత కాలం పడుతుంది? ఇప్పటికే మూడు నెలలు ముగిసిందతి. విచారణలో ఏం తేలిందో తెలుసుకునేందుకు ఇప్పటికీ ఎదురుచూస్తున్నాం. విచారణ నివేదిక బాధిత రెజ్లర్లకు వ్యతిరేకంగా వచ్చిందా? ఇక చావాల్సిందేనా?’ అని వినేశ్‌ ఫోగట్‌ ప్రశ్నించింది. తక్షణమే విచారణ కమిటీ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ తీరుతో విసిగిపోయాం : ‘పర్యవేక్షణ కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను బయటపెట్టాలని ప్రభుత్వాని అడిగి అడిగి విసిగిపోయాం. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కానాగాట్‌ పోలీసు స్టేషన్‌లో మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశాం. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల ప్రక్రియతో మాకు సంబంధం లేదు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ సమీపిస్తున్నాయి. వీలైనంత త్వరగా సన్నద్ధత మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. అందుకు ప్రభుత్వమే తగిన పరిస్థితులు కల్పించాలని’ అన్షు మాలిక్‌ పేర్కొంది.

ఏమీ మారలేదు : ‘ భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో పరిస్థితులు ఏమాత్రం మారలేదు. రెజ్లర్ల ఆందోళనకు ముందు నెలకొన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్రాంతంలోనే టోర్నమెంట్లు జరుగుతున్నాయి. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి దగ్గర అధికారం ఉంది. కానీ మా దగ్గర సత్యం మాత్రమే ఉంది. ఈ పోరాటంలో అది మాత్రమే చాలదని అనిపిస్తుంది. మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చట్టపర చర్యలు తీసుకునే వరకు జంతర్‌ మంతర్‌ విడిచిపెట్టేది లేదు. జనవరిలో మా ఆందోళన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేరలేదు. రెండు రోజుల క్రితం ఓ మైనర్‌ రెజ్లర్‌ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా, ఎటువంటి స్పందన లేదు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఎవరు ఉన్నారో మాకు తెలియదు. అయినా, మా న్యాయ పోరాటం ఆగదు’ అని ఆందోళన సందర్భంగా మల్లయోధులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, 12 ఏండ్లగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ జాతీయ క్రీడా నిబంధనల ప్రకారం మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయాడు. అధ్యక్షుడిగా బ్రిజ్‌ భూషణ్‌ కొనసాగకపోయినా.. అతడి కనుసన్నల్లోనే భారత రెజ్లింగ్‌ సమాఖ్య పని చేయనుంది. ఈ విషయాన్ని ఇటీవల బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ స్పష్టం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో డబ్ల్యూఎఫ్‌ఐ అత్యవసర సమావేశం నిర్వహించిన బ్రిజ్‌ భూషణ్‌ మే 7న ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించారు. డబ్ల్యూఎఫ్‌ఐ పర్యవేక్షణ బాధ్యతలను క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికీ బ్రిజ్‌ భూషణ్‌ సహా ఇతర ఆఫీస్‌ బేరర్లకు అప్పగించలేదు. అయినా, బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య కార్యకలాపాలను పున ప్రారంభించారు.

Spread the love