అభివృద్ధిలో అసమానతలు

– తలసరి ఆదాయం దారుణం అనేక రంగాలలో వెనుకబాటు
– మోడీ సర్కార్‌ చెబుతున్న బలోపేత ఆర్థిక వ్యవస్థ అంతా డొల్లే
– క్షేత్రస్థాయిలో విలవిల్లాడుతున్న ప్రజలు
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానంలో నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకొని సంఫ్‌ పరివార్‌ నేతలంతా ప్రచార బాకాలూదుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానానికి సమాధానం ఇచ్చినప్పుడు కూడా ప్రధాని ఈ విషయాన్ని గొప్ప చెప్పారు. కానీ దేశాభివృద్ధిలో ప్రాంతాలవారీ అసమానతలను, ప్రజల కొనుగోలు శక్తి క్రమేపి నిర్వీర్యం అవుతుండటాన్ని ఆయన ప్రస్తావించలేదని, వాస్తవానికి ఆయన చెప్పినంత పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ లేదని, అంతా డొల్ల అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతానికి అయితే ప్రపంచంలో అమెరికాయే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. చైనా, జపాన్‌, జర్మనీలు ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఎంతో స్పష్టంగా తెలియడం లేదు. ఒకప్పుడు మూడు ట్రిలియన్‌ డాలర్లు దాటిన మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం కరోనా సమయంలో తగ్గిపోయింది. జూన్‌ 12న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ట్వీట్‌ ప్రకారం 2023లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023లో 3.75 ట్రిలియన్‌ డాలర్లు. ఎందుకో తెలియదు గానీ ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు. 3.2 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానం లోకి వెళ్లిపోయింది. గనుక మన ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉన్న నేపథ్యంలో దాని పరిమాణం 3.5 ట్రిలియన్‌ డాలర్లు ఉండవచ్చునని చెబుతున్నారు.
తలసరి ఆదాయం పెరిగితేనే…
ఇప్పుడు ఐదో స్థానానికి చేరిన మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మూడో స్థానంలో నిలుస్తుందని మోడీ చెబుతున్నారు. ప్రపంచంలోనే మనది అత్యధిక జనాభా కలిగిన దేశం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఒకటో స్థానానికి చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే బలపడుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నా యా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రజల ఆదాయం పెరిగితే వ్యయం కూడా దానంతట అదే పెరుగుతుంది. వారి జీవితాలు ఆనందంగా గడుస్తాయి. కానీ మన దేశంలో అలా జరగడం లేదు. బ్రిటన్‌ ప్రజల జీవన ప్రమాణాలకు, భారత ప్రజల జీవన ప్రమాణాలకు మధ్య చాలా తేడా ఉంది. మన దేశ ప్రజల తలసరి ఆదాయంతో పోలిస్తే బ్రిటన్‌ ప్రజల తలసరి ఆదాయం 18 రెట్లు అధికం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరిగితే ఒరిగేదేమీ ఉండదు. ప్రజల తలసరి ఆదాయం పెరగడమే ముఖ్యం.
అంగోలా కంటే తక్కువే
మన దేశంలో ప్రజల తలసరి ఆదాయం చాలా దారుణంగా ఉంది. పేద దేశమైన అంగోలాలో కంటే మన దేశంలో తలసరి ఆదాయం తక్కువే. ఈ విషయంలో మన దేశం 197 దేశాలలో 142వ స్థానంలో ఉంది. మన తలసరి ఆదాయం 2601 డాలర్లు. దీనితో పోలిస్తే అమెరికాలో 31 రెట్లు, జపాన్‌, ఇటలీ దేశాలలో 14 రెట్లు ఎక్కువ. జనాభా అధికంగా ఉండడం వల్లే మన తలసరి ఆదాయం తక్కువగా ఉన్నదని కొందరు చేస్తున్న వాదనలో పస లేదు. ఎందుకంటే జనాభా అధికంగా ఉన్న చైనాలో తలసరి ఆదాయం మన దేశంతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా ఉంది. బడా దేశాల సంగతి పక్కన పెడితే మనం ఎన్నడూ పేరు కూడా వినని దేశాలైన వనటూ, సావో టోమ్‌ ప్రిన్సిప్‌లలో సైతం మన కంటే తలసరి ఆదాయం అధికంగానే ఉంది. చివరికి ఐవరీ కోస్ట్‌లో కూడా తలసరి ఆదాయం మన కంటే ఎక్కువగానే ఉంది. తలసరి ఆదాయాన్ని లెక్కించడంపై కూడా పలు వివాదాలు ఉన్నాయి. అంబానీ, అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల ఆదాయంతో పాటు అతి తక్కువ వేతనం పొందే వ్యక్తిని కూడా పరిగణనలోకి తీసుకొని సగటు తలసరి ఆదాయాన్ని నిర్ణయిస్తారు. కాబట్టి కేవలం తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నంత మాత్రాన కూడా దేశ ప్రజలందరి ఆదాయం పెరుగుతోందని, వారి జీవితాలు భేషుగ్గా సాగుతున్నాయని అనుకోవడం పొరబాటే అవుతుంది.
నిరాశాజనకం…దయనీయం
ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ అనేక ఇతర రంగాలలో మన స్థానం అట్టడుగునే ఉంటోంది. అత్యంత ఆనందదాయకమైన దేశాలలో మనది 125వ స్థానం. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన పది దేశాలలో ఏ ఒక్కటి కూడా ఈ జాబితాలో లేదు. పత్రికా స్వే చ్ఛతో 161 వ స్థానం. మానవాభివృద్ధి సూచికలో కూడా మనం 130వ స్థానంలో ఉన్నాము.దీనిని బట్టి మనకు అర్థమవుతోంది ఏమంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న మాత్రాన దేశం సుసంపన్నం కాదు. తలసరి ఆదాయం పెరుగుతున్నప్పుడు, ప్రజలకు సుపరిపాలన లభిస్తున్నప్పుడు, వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే దేశం సౌభాగ్యవంతమవుతుంది.
డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాల పాలనలోనే…
రెండు సంవత్సరాల క్రితం నిటి ఆయోగ్‌ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలోని ఐదు నిరుపేద రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలే నడుస్తున్నా యి. బీహార్‌ (అప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం పనిచేస్తోంది) మొదటి స్థానంలో ఉండగా జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తర్వాతి స్థానాలలో నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే బీహార్‌లో 52 శాతం, జార్ఖండ్‌లో 42 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 38 శాతం, మధ్యప్రదేశ్‌లో 37 శాతం జనాభా పేదలే. బలమైన ఆర్థిక వ్యవస్థ ఏ దేశానికైనా అవసరమే కానీ ప్రజల తలసరి ఆదాయం పెరగడం అంతకంటే అవసరం. అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. లేనిపక్షంలో అదానీ, అంబానీ సహా దేశంలోని అతి కొద్దిమంది బిలియనీర్లు, సంపన్న వర్గం ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలను సొంతం చేసుకుంటారు. పేదలు మాత్రం ఆకలితో అలమటిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతూనే ఉంటారు.
పేదలు నిరుపేదలుగా…
ప్రపంచంలో ధనవంతులు మరింత సంపన్నులుగా, పేదలు మరింత నిరు పేదలుగా మారిపోతున్నారు. అభివృద్ధిలో అసమానతలే దీనికి కారణం. సంపన్నుల ఆదాయం శరవేగంగా పెరుగుతుంటే పేదల ఆదాయం పాతాళానికి పడిపోతోంది. సంపన్న దేశాలతో పోలిస్తే మన దేశంలో అభివృద్ధిలో అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దేశ జనాభాలో ఐదు శాతం మంది చేతిలో 60% సంపద పోగుపడి ఉంది. చివరి యాభై శాతం జనాభా చేతిలో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది. 2020లో దేశంలో 102 మంది బిలయనీర్లు ఉండగా ఈ సంవత్సరంలో వారి సంఖ్య 163కు పెరిగింది. ఒక వైపు సంపన్నుల సంపద పెరుగుతుంటే మరోవైపు పేదల సంఖ్య, వారిలో పేదరికం కూడా పెరుగుతోంది. 2018లో ఆకలితో అల్లాడిన భారతీయుల సంఖ్య 19 కోట్లు ఉండగా 2022 నాటికి 35 కోట్లకు పెరిగింది. 2022లో చనిపోయిన ఐదేళ్ల లోపు చిన్నారులలో 65 శాతం మంది ఆకలితోనే ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలిపింది.

Spread the love