జడ్‌ ప్లస్‌ భద్రతను తిరస్కరించిన పంజాబ్‌ సీఎం

చండీగఢ్‌: కేంద్ర హోం శాఖ తనకు కేటాయించిన జడ్‌ ప్లస్‌ భద్రతను పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ తిరస్కరించారు. తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం ఉందని వెల్లడించారు. పంజాబ్‌, ఢిల్లీలో వారు తనకు రక్షణగా ఉంటారని చెప్పారు. ఇటీవల ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ నాయకుడు అమత్‌పాల్‌ సింగ్‌ అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో భగవంత్‌ మాన్‌కు జెడ్‌ ప్లస్‌ రక్షణ కల్పించాలని గతవారం కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతను తిరస్కరించిన ముఖ్యమంత్రి తనకు పంజాబ్‌ పోలీసులు అందించే రక్షణ సరి పోతుంద న్నారు. అలాగే రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతుందని కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో వెల్లడించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో అందించవచ్చని చెప్పారు.
కాగా, పంజాబ్‌ ముఖ్యమంత్రికి జెడ్‌ ప్లస్‌ భద్రత ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముఖ్యమంత్రులు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖబీర్‌ సింగ్‌ బాదల్‌, మాజీ మంత్రి విక్రమ్‌ సింగ్‌ మాజిథియాకు ఈ భద్రతను కల్పించారు. ఇందుకోసం రక్షణగా 55 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తారు.

Spread the love