ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ
నవతెలంగాణ-పెద్దపల్లి:
జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైస్‌ మిల్లర్లకు అలాట్‌ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, పౌర సరఫరాల కమిషనర్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోలు అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌. సంగీత సత్యనారాయణ సమీకృత జిల్లా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలకు అలాట్‌ చేసిన రైస్‌ మిల్లులకు తప్పనిసరిగా ధాన్యం పంపాలని, రైస్‌ మిల్లులలో ఉన్న స్థలంలో దాన్యం దిగుబడి చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆగకుండా ప్రతిరోజు జరిగే విధంగా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జిల్లా సహకార అధికారి మైఖేల్‌ బోస్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా దశాబ్ది వేడుకల నిర్వహణ:
రాష్ట్ర ఆవతరణ దశాబ్ది వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులతో సమీకత కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బుధవారం రివ్యూ నిర్వహించారు. జూన్‌ 2 నుంచి జూన్‌ 22 వరకు 21 రోజుల పాటు ఘనంగా దశాబ్ది వేడుకల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, నిర్దేశించిన షెడ్యూల్‌ మేరకు జిల్లాలో దశాబ్ది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love