దేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి పీవీ: మంత్రి పొన్నం..

– హుస్నాబాద్ లో ఘనంగా పీవీ జయంతి వేడుకలు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని, భారత రత్నా పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..తెలంగాణ ముద్దు బిడ్డ, హుస్నాబాద్ నియోజకవర్గ బిడ్డ పీవీ నరసింహారావు వంగర గ్రామంలో జన్మించి దేశానికి గొప్ప నేతగా ఎదిగాడన్నారు. దేశ ప్రధానిగా భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తేవడం వల్ల ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. పీవీ చూపిన మార్గదర్శకంలో మేమంతా నడవాలని కోరుకుంటున్నానన్నారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల తెచ్చి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యకు ప్రాధాన్యత తెచ్చిన వ్యక్తి పి వి అన్నారు. అయన దేశ ప్రధానిగా చేసిన సేవలను ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకురాలు ,సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజులరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంకచందు, బురుగు వెంకటస్వామి, వెన్న రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love