క్విడ్‌ప్రోకో నిజమే…!

Quid proco is true...!– కార్పొరేట్‌ కంపెనీలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు
– ఎగవేతదారులకు రుణమాఫీలు
– ప్రతిఫలంగా పాలక పక్షానికి భారీగా ఎన్నికల విరాళాలు
–  బినామీలు, షెల్‌ కంపెనీల ద్వారా కూడా…
న్యూఢిల్లీ : ‘పగటి వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో కంపెనీలు రాజకీయ విరాళాలు ఇవ్వడానికి కారణం కూడా అలాగే ఉంటుంది. క్విడ్‌ప్రోకో ద్వారా సానుకూలత పొందేందుకు కార్పొరేట్‌ విరాళాలు ఉపయోగపడతాయన్న విషయాన్ని విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ కూడా తోసి పుచ్చలేదు’…. ఎన్నికల బాండ్లపై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. ఎన్నికల బాండ్లు చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమంటూ అత్యున్నత న్యాయస్థానం సుస్పష్టంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించింది. కంపెనీలు అందించే అపరిమిత, రహస్య విరాళాలు క్రిడ్‌ప్రోకోకు దారి తీస్తాయని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో…2017లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత క్విడ్‌ప్రోకో ఏ విధంగా జరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించి…
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఆ వెంటనే అదను చూసుకొని మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు ఫలితంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమ కుదేలైంది. అదే సమయంలో బడా కార్పొరేట్‌ సంస్థలు మరింత బలోపేతం అయ్యాయి. చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని దెబ్బతీసి అవి తమ మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి. 2018లో కూడా ఈ ధోరణి కొనసాగింది. 2019 సెప్టెంబరులో ప్రధాని మోడీ కార్పొరేట్‌ రంగానికి అసాధారణ ప్రయోజనం కలిగిం చారు. మనుగడలో ఉన్న కంపెనీల బేస్‌ కార్పొరేట్‌ పన్ను రేటును 30శాతం నుంచి 22శాతానికి తగ్గిం చారు. తాజాగా మూలధన పెట్టుబడుల ప్రాజెక్టులు ప్రారంభించిన కొత్త కంపెనీల పన్ను రేటును కూడా 25శాతం నుండి 15శాతానికి తగ్గించారు. కంపెనీలకు రాయితీలు అందించడం ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.1,45,000 కోట్ల ప్రజా ధనాన్ని ‘త్యాగం’ చేసింది. బడా కంపెనీల నుండి కొత్తగా మూలధనపు పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించింది.
లాభాలు మూటకట్టుకున్న కంపెనీలు
స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిన 50-100 బడా కంపెనీల లాభాలు 2019 తర్వాత ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2019కి ముందు అనేక సంవత్సరాల పాటు నిఫ్టీలో లిస్ట్‌ అయిన యాభై కంపెనీల ఉమ్మడి లాభం ఏటా ఐదు శాతం కంటే తక్కువే పెరిగింది. కానీ 2019 తర్వాత వాటి లాభం ఏటా 15% పెరగడం మొదలైంది. నిఫ్టీలో లిస్ట్‌ అయిన టాప్‌ పది కంపెనీల లాభం 2022-23 నాటికి మూడు లక్షల కోట్ల రూపాయలు దాటింది. కార్పొరేట్‌ పన్నుల్లో భారీగా విధించిన కోతల కారణంగానే ఇది సాధ్యపడింది. నిఫ్టీలో లిస్ట్‌ అయిన 50 కంపెనీలు 2019 తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో కూడా ఓ వెలుగు వెలగడం ప్రారంభించాయి.
‘కోవిడ్‌’ రాయితీలతో మరింత ఎదిగి…
కోవిడ్‌ కష్టకాలంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ రాయితీల వరద పారించాయి. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. ఈ చర్య కారణంగా భారీ కంపెనీలు మరోసారి ప్రయోజనం పొందాయి. చౌకగా లభించిన ప్రత్యామ్నాయాలతో రుణభారాన్ని తగ్గించుకొని లాభాలు పెంచుకున్నాయి. ఆ కాలంలో బడా కంపెనీల వాటాల విలువలు పెరిగినప్పటికీ రుణం-ఈక్విటీ నిష్పత్తి బాగా తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ప్రభుత్వ విధానాలు అగ్ర స్థానంలో ఉన్న వంద క ంపెనీలకు లబ్ది చేకూర్చాయి. ఆ సమయంలోనే ఆ కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి, పాలక పక్షానికి విరాళంగా అందజేశాయి. ఇది ఓ రకమైన క్విడ్‌ప్రోకోయేనన్నది సుస్పష్టం.
రాయితీలకు ప్రతిఫలంగా…
ఆ తర్వాత జరిగిన పరిణామం అత్యంత ఆసక్తిని కలిగించింది. తమకు ప్రభుత్వం అందించిన పన్ను ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని భారీ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన కార్పొరేట్‌ ప్రపంచం ఆ పని చేయలేదు. దానికి బదులుగా ఆ కంపెనీలు కార్పొరేట్‌ పన్ను కోతలతో లాభాలు మూటకట్టుకున్నాయి. కంపెనీల సామర్ధ్యాన్ని విస్తరించేందుకు అవి ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల్లో కార్పొరేట్‌ సంస్థలు పన్ను కోతల నుంచి సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం పొందాయి. తమకు పన్ను రాయితీలు కల్పించిన సర్కారుకు ప్రతిఫలం అందించాలి కదా? అందుకోసం ఎన్నికల బాండ్లు ఉపయోగపడ్డాయి. వాటిలో అధిక భాగం పాలక పక్షమే సొంతం చేసుకున్నదన్న విషయాన్ని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
బినామీలు, షెల్‌ కంపెనీల ద్వారా…
దారుణమైన విషయమేమంటే ఈ కంపెనీలు ఎన్నికల బాండ్లను నేరుగా కొనుగోలు చేయలేదు. బినామీల ద్వారా, షెల్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేశాయి. వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘నష్టాలు మూటకట్టుకుంటున్న కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం లేదని మనం ఎలా తెలుసుకుంటాం?’ అని ప్రశ్నించారు. అనేక షెల్‌ కంపెనీలను లాభాల కోసం ఏర్పాటు చేయలేదు. మనీ లాండరింగ్‌ కోసం వాటిని ఉపయోగించుక ున్నారు. ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడానికి ఈ కంపెనీలను వాడుకోలేదని ఎలా తెలుస్తుంది? బ్యాంకు రుణాలు ఎగవేసిన అనేక మంది కంపెనీ ప్రమోటర్లు మోడీ పాలనలో రుణమాఫీల ద్వారా రూ.14 లక్షల కోట్ల ప్రయోజనం పొందారు. వారు ఇప్పటికీ సంపన్నులుగానే చలామణి అవుతున్నారు. వీరు బినామీ కంపెనీల ద్వారా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి ఉండవచ్చు. ఇది భారీ స్థాయిలో జరగలేదని మనకు ఎలా తెలుస్తుంది?
ఎన్నికల బాండ్ల పథకంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటన్నింటికీ నేటి వరకూ సమాధానం లభించలేదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కార్పొరేట్‌ దాతల జాబితా విడుదలైన తర్వాత దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది
నిబంధనలకు తూట్లు
అపరిమిత విరాళాలు అందించేందుకు అనుమతించడం, అది కూడా దాతల పేర్లను గోప్యంగా ఉంచడం ద్వారా క్విడ్‌ప్రోకో ఆరోపణ నుండి కార్పొరేట్‌ సంస్థలు తప్పించుకోవడానికి అవకాశం లభించింది. కంపెనీలు తాము ఆర్జించే లాభాల నుండి ఎంత మేరకు రాజకీయ పార్టీలకు విరాళాలు అందించవచ్చుననే విషయంలో గతంలో పరిమితులు ఉండేవి. ఆ విరాళాలను ఆయా కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో విధిగా ప్రకటించాల్సి వచ్చేది. అయితే ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ పరిమితులు, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు.

Spread the love