రాజ్యసభ నుంచి రాఘవ్ చద్దా సస్పెండ్

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు పడింది. రాఘవ్ చద్దా చర్య అనైతికమని, ఆయనను సస్పెండ్ చేయాలని రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ శుక్రవారంనాడు ఒక తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించేంత వరకూ ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటించారు. ఆప్ మరో ఎంపీ సంజయ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకునేంతవరకూ ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. రాఘవ్ చద్దా ప్రతిపాదించిన సెలక్ట్ కమిటీ తీర్మానంపై ఉన్న సంతకాలు తమవి కావని బీజేపీ ఎంపీలు ఎస్‌ ఫాంగ్నోన్ కొన్యాక్, నరహరి అమీన్, సుదాన్షు త్రివేది, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఇటీవల జగదీ‌ప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండానే పేర్లు ఇందులో చేర్చారని, తమ సంతకాలు ఫోర్జరీ చేశారని, తమ హక్కులకు భంగం కలిగిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Spread the love