నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన జిల్లా కిన్నౌర్‌లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. చోల్లింగ్ సమీపంలో వ్యూహాత్మకమైన జాతీయ రహదారి-5 (NH-5)ను వరద నీరు, శిథిలాలు అడ్డుకోవడంతో పాటు రిబ్బా-కాండే అనుసంధాన రహదారిలోని కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. దాదాపు 30 మీటర్ల మేర భారీ పరిమాణంలో శిథిలాలు, బండరాళ్లు, బురద నిండిపోయి రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు ధృవీకరించారు.
భారీ వర్షాల నేపథ్యలో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. నదీ తీరాలు, వాగులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, ఇతర ప్రమాదకర ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు లేదా ట్రెక్కింగ్‌లకు దూరంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితిని వెంటనే జిల్లా యంత్రాంగానికి లేదా విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది.





