రాయికల్…’పిక్క’టిల్లుతోంది

– ఒకే రోజు 11 మందికి కుక్క గాట్లు
– నెలకు 70 మంది చొప్పున కుక్క గాట్లతో  యుపీహెచ్సీకి పరుగులు
– ఈ ఏడాది జనవరి నుండి కుక్కల దాడిలో 346 మందికి గాయాలు
– కోతుల దాడిలో 11, పిల్లులు,ఎలుకల వల్ల 10 మందికి గాయాలు
– పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు
– ఏ వీధిలో చూసినా ‘గ్రామ సింహాల’ స్వైరవిహారం
నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణంలో కుక్కల దాడి రోజు రోజుకూ పెరుగుతోంది. కుక్కపిక్క పీకితే లబోదిబోమంటూ పట్టణంలోని ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీస్తున్న వారి సంఖ్య నెలకు పదుల సంఖ్యలో ఉంటుంది.కుక్కలకు తోడు కోతులు,పిల్లులు సైతం దాడి చేస్తున్నాయి.గాయపడుతున్న వారిలో ఒక్క రాయికల్ యుపీహెచ్సీ పరిధిలోనే యాంటి రేబిస్ వాక్సిన్ కోసం వచ్చే వారి సంఖ్య నెలకు 70 నుండి 95 మంది వరకు ఉంటుండగా.. ఈ  నాలుగు నెలల కాలంలో 366 మంది చికిత్స పొందారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో బేరీజు వేసుకోవాలి. కుక్కల నియంత్రణ పై దృష్టి సారించకపోవడం,వాటి సంతతి విపరీతంగా పెరగడం తో తిండి దొరక్క గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులపై దాడి చేసే స్థాయికి చేరాయి. పట్టణంలో జనవరి,ఫిబ్రవరి,మార్చి,ఏప్రిల్,మే 03 వరకు లెక్కలు పరిశీలిస్తే కుక్కకాటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. జనవరిలో మొత్తం 92 మంది కుక్క గాటుతో, కోతుల వల్ల 01,పిల్లి వల్ల 02, ఫిబ్రవరిలో 76 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 02, మార్చిలో 81 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 03,పిల్లి వల్ల 02,ఎలుక వల్ల 02,ఏప్రిల్ లో  81 మంది కుక్క గాటుతో,కోతి వల్ల 04,పిల్లి వల్ల 03,ఎలుక వల్ల 01,ఈ నెలలో కుక్క గాటుతో 16 మంది గాయపడగా శుక్రవారం ఒకే రోజు 11 మంది కుక్క కాటుకు గురై పట్టణంలోని ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి చికిత్స పొందారు.

గ్రామాలతో పోల్చుకుంటే 100కు 80 శాతం కేసులు పట్టణంలోనే నమోదు అవుతున్నాయి.  
కుక్కల అదుపునకు నిలిచిన శస్త్ర చికిత్సలు.. విపరీతంగా పెరుగుతున్న సంతతి
యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), జంతు సంరక్షణ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వీధి కుక్కల సంఖ్య అదుపునకు శస్త్రచికిత్సలు చేయాలి.కానీ గత ఏడాది మార్చిలో వీధి కుక్కల సంతానం తగ్గించేందుకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 821 కుక్క లకు శస్త్రచికిత్స చేయగా..జంతు సంరక్షణ బోర్డుకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో అప్పటి నుంచి శస్త్రచికిత్సలు నిలిపి వేశారు.అయితే ఈ జంతు సంరక్షణ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్థలాన్ని కేటాయించి భవనం నిర్మించాల్సి ఉండగా జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిబంధనల పేరుతో కుక్కలు,కోతులను నియంత్రించాల్సిన అధికారులు వెనక్కి తగ్గుతున్నారు.
ప్రాణాలమీదకు తెస్తున్న అవగాహన లోపం
గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ,రాత పుస్తకాల పై కుక్క, పాము కాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పరిచేలా సూచనలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. కుక్క కరిస్తే రక్తం కారుతుందని వస్త్రం కట్టి ఆసుపత్రికి తెస్తున్నారు.అలా కాకుండా వైద్యులు సూచించిన ప్రకారం ఆసుపత్రికి తీసుకరావాలని,అవగహన లోపం,మూఢనమ్మకాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కుక్కకాటులో ఆలస్యం, నిర్లక్ష్యం తగదు..  (సూపరింటెండెంట్ డా. రవి- రాయికల్ యుపీహెచ్సీ)
జంతువులు దాడి చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
జంతువులు కరిచిన ప్రదేశంలో మంచి నీరు,సబ్బుతో ఐదు నిమిషాలు పరిశుభ్రంగా కడగాలి.
ఎలాంటి జంతువులు హాని తలపెట్టిన వెంటనే వైద్యుని సంప్రదించాలి.
స్వల్ప గాయాలకు (గీతలకు) మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి.
రక్త స్రావం అయిన గాయాలకు నాలుగు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
కుక్క లాంటి జంతువులు కరిచిన రోజు మొదటి డోస్,3వ రోజు రెండో డోస్,7వ రోజు మూడో డోస్, 21వ రోజు నాలుగో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
తల భాగంలో ఎలాంటి జంతువులు గాయపరిచిన నాలుగు డోసుల వ్యాక్సిన్  తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు ఉన్న గాయాలపై ఎలాంటి జంతువులు వాటి నాలుకతో స్పృశించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గేదె, ఆవు లాంటి జంతువులను కుక్కలు గాయపర్చినపుడు వాటి పాలను తాగిన వారు కూడా వైద్యులను సంప్రదించాలి.
జంతువులు కాటు వేసినప్పుడు, స్నానం చేయకూడదు, నూనె పెట్టుకోకూడదు, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు లాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి.
యాంటీ రేబిస్ వ్యాక్సిన్ చేయించుకుని తగిన చికిత్స పొందాలి. ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుంది.
ప్రధానంగా ఇండ్లలోని పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేయించాలి.
నియంత్రణకు చర్యలు తీసుకుంటాం..(ఎ.జగదిశ్వర్-మున్సిపల్ కమిషనర్)
వేసవి సమయంలో నీళ్లు,ఆహారం దొరకక వీధి కుక్కలు దాడికి దిగుతుంటాయి.యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ ను సంప్రదించి సంతతి పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వం,ఉన్నతాధికారుల ఆదేశాలతో వెటర్నరీ అధికారులను సంప్రదిస్తాం.కుక్కల దాడిపై ఉన్నతాధికారులకు నివేదించి వాటి బెడద తగ్గించేందుకు కృషి చేస్తాం.

Spread the love