స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌గా రాజయ్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మెన్‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల ఆ సంస్థ కార్యాలయంలో బంధుమిత్రులు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజయ్య పదవీ బాధ్యతలను చేపట్టారు. ఆయనతో పాటు సభ్యులు సంకేపల్లి సుధీర్‌ రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, నెహ్రు నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు గ్రామాలను, మున్సిపాల్టీలను బలోపేతం చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఫైనాన్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమిషన్‌ను నిర్వీర్యం చేయడంతో నిధుల్లేక గ్రామాలు, మున్సిపాల్టీలు అల్లాడిపోతున్నాయని విమర్శించారు. మూలనపడేసిన ఫైనాన్స్‌ కమిషన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పునరుద్ధరించి, తనకు బాధ్యతలు అప్పగించారని ధన్యవాదాలు తెలిపారు.

Spread the love