– మంత్రి పదవికి సీనియర్ నేత గుడ్‌బై
జైపూర్: రాజస్థాన్ బీజేపీలో ముసలం పుట్టింది. సీనియర్ నేత కిరోడీ లాల్ మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. తూర్పు రాజస్థాన్‌లోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఏ ఒక్క దానిని బీజేపీ కోల్పోయినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, అయితే నాలుగు స్థానాల్లో పార్టీ ఓడిపోవడంతో రాజీనామా చేశానని మీనా తెలిపారు. అయితే మీనా పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ ఆయన రాజీనామాకు వేరే కారణాలు కన్పిస్తున్నాయి. పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని ఆయన భావిస్తున్నారు. మీనా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. ఢిల్లీకి రావాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కబురు పంపారు.పార్టీ నాయకత్వంపై మీనా చాలా కాలం నుండి కినుక వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన సోదరుడికి టిక్కెట్ నిరాకరించడం ఆయనను బాధించింది. తన వయసు వారే అయిన ఇద్దరు నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టి తనకు మొండిచేయి చూపడం కూడా ఆయనకు ఆగ్రహం కలిగించింది. మీనా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. క్యాబినెట్‌లో మీనాకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. సాధారణంగా ఈ శాఖను నిర్వహించే మంత్రికే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా అప్పగిస్తారు. అయితే ఆ రెండు శాఖలనూ వేరే వారికి అప్పగించారు. రాజస్థాన్‌లో ఇప్పటికే వసుంధర రాజెను బీజేపీ నాయకత్వం పక్కన పెట్టింది. తన అడుగులకు మడుగులొత్తే భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రిని చేసింది.