పోలింగ్‌కు రాజస్థాన్‌ సిద్ధం

– 13 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు
– పలు కీలక స్థానాల్లో బరిలో ప్రముఖులు
– కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటీ
జైపూర్‌: మండుతున్న ఎండల్లో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో రెండో దశలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 13 నియోజక వర్గాల్లో ఓటింగ్‌ జరగనున్నది. ఇప్పటి వరకు మండే ఎండల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలు తీవ్ర ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రధాన పార్టీలకు చెందిన స్టార్‌ క్యాంపెయినర్లు.. అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. నేడు ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే ప్రచారానికి తెరపడింది. కాగా, పలు సీట్లలో రెండు పార్టీలకు చెందిన కీలక నాయకులు పోటీ చేయనుండటంతో ఈ ఎన్నికలు ఆసిక్తికరంగా మారాయి. జోధ్‌పూర్‌ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కాంగ్రెస్‌ నుంచి కరణ్‌ సింగ్‌ ఉచియారాడ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. 2014, 2019 రెండింటిలోనూ సీటును గెలుచుకున్న షెకావత్‌.. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన ఉచియారాడ నుంచి కఠినమైన సవాలును ఎదుర్కొంటున్నాడు.కోటా-బుండి లోక్‌సభ స్థానం మరొక హాట్‌ సీట్‌గా మారింది. ఇక్కడ రెండుసార్లు గెలిచిన బిజెపికి చెందిన ఓం బిర్లా.. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మారిన గుర్జార్‌ వర్గానికి చెందిన ప్రహ్లాద్‌ గుంజాల్‌ నుంచి బలమైన పోటీను ఎదుర్కోనున్నారు. ప్రహ్లాద్‌ గుంజాల్‌కు మాజీ సీఎం వసుంధర రాజే మద్దతున్నది. దీంతో ఇక్కడ పోటీ చాలా ఆసక్తికరంగా మారింది.
చిత్తోర్‌గఢ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి కాంగ్రెస్‌కు చెందిన అంజనా ఉదరులాల్‌, బీఎస్పీకి చెందిన మేఘవాల్‌ రాధేశ్యామ్‌తో పోటీ పడుతున్నారు. తిరుగుబాటు బీజేపీ ఎమ్మెల్యే చంద్రభన్‌ సింగ్‌ అక్యా ఉండటంతో జోషి ప్రచారం మరింత క్లిష్టంగా మారింది. రాజ్‌సమంద్‌లో మహిమా సింగ్‌ మేవార్‌ (బీజేపీ), దామోదర్‌ గుర్జార్‌ (కాంగ్రెస్‌)లు ప్రధాన పోటీదారులు. తొలి నుంచి ఈ సీటు బీజేపీకి కంచుకోటగా చెప్పబడుతున్నప్పటికీ.. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని మార్చడం రేసులో కొత్త కోణాన్ని జోడించిందని, ఆ పార్టీ దామోదర్‌ గుర్జర్‌ను ఈ సీటుకు ప్రతిపాదించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొలుత కాంగ్రెస్‌ సుదర్శన్‌ రావత్‌ను ఎంపిక చేయగా.. ఆయన వెనక్కి తగ్గారు. అయితే, వాస్తవానికి భిల్వారాలో పోటీకి నిలబెట్టిన గుర్జార్‌.. తర్వాత ఈ స్థానానికి మారాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయపూర్‌ నియోజకవర్గంలో మతం కీలక పాత్ర పోషిస్తున్నది. ఇక్కడ బీజేపీకి చెందిన మన్నాలాల్‌ రావత్‌, కాంగ్రెస్‌ నుంచి తారాచంద్‌ మీనా ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. టోంక్‌-సవాయి మాధోపూర్‌ సీటులో బీజేపీకి చెందిన సుఖ్‌బీర్‌ సింగ్‌ జోనాపురియా, ఎమ్మెల్యే హరీష్‌ మీనా మధ్య పోటీ ఉన్నది. అజ్మీర్‌లో.. బీజేపీ ఎంపీ భగీరథ్‌ చౌదరిని తిరిగి నామినేట్‌ చేయగా.. పాలసీ చైర్మెన్‌ రామచంద్ర చౌదరి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భరత్‌పూర్‌లో, జాట్‌ ఉద్యమం ఎన్నికల దృశ్యాన్ని రూపొందిస్తుంది. ఈ ప్రాంతంలో దాదాపు 5 లక్షల మంది జాట్‌ ఓటర్లు ఉన్నారు. అదనంగా, ఈ ప్రాంతంలో దాదాపు 3.50 లక్షల మంది జాటవ్‌ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సంజన ఈ వర్గానికి చెందినవారు కాగా, బీజేపీకి చెందిన రాంస్వరూప్‌ కోలీ గతంలో బయానా స్థానం నుంచి గెలుపొందారుబార్మర్‌-జైసల్మేర్‌ సీటులో త్రిముఖ పోటీ నెలకొన్నది. స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్‌ భాటి ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఇది కైలాష్‌ చౌదరి (బీజేపీ), ఉమేదరమ్‌ బెనివాల్‌ (కాంగ్రెస్‌) ఇద్దరికీ ఆందోళన కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల రణరంగంలో ఇద్దరు మాజీ సీఎంల కుమారులు వైభవ్‌ గెహ్లాట్‌, దుష్యంత్‌ సింగ్‌లు వరుసగా జలోర్‌-సిరోహి, ఝలావర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్నాయి. ఇందులో 12 సీట్లకు ఇప్పటికే తొలి దశలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 13 స్థానాలకు ఎన్నికలు నేడు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికలు పరిపూర్ణం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.80 లక్షలకు పైగా ఉన్నది. ఇందులో పురుషులు 1.44 లక్షలకు పైగా, మహిళలు 1.36 లక్షలకు పైగా, థర్డ్‌ జండర్‌ 324 మంది ఉన్నారు. తొలిసారి ఓటు వేస్తున్నవారు (18-19 ఏండ్ల వారు) 8,66,325 మంది ఉన్నారు. వైకల్యం ఉన్నవారు 3,22,829 మంది, 85 ఏండ్లు పైబడినవారు 3,01,742 మంది, సర్వీసు ఓటర్లు 26,837 మంది ఉన్నారు.

Spread the love