సీఈసీల నియామకంపై అత్యవసర విచారణ

On appointment of CCs Urgent inquiry– 15న విచారించేందుకు సీజేఐ డివై చంద్రచూడ్‌ నిర్ణయం
– ఈసీల నియామకానికి సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల అంశం మరోసారి వివాదానికి దారితీసింది. ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (సీఈ) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం (మార్చి 15న) విచారణ జరుపుతామని వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. ఈ క్రమంలోనే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్నా ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనుంది. తాజా నియామకాలను సవాల్‌ చేస్తూ ఇటీవల కాంగ్రెస్‌ నేత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీన్ని కూడా శుక్రవారం విచారించనుంది.
కొత్త చట్టం
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఈసీల నియామక బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. ఈ ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈసీల నియామకానికి సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ
త్వరలో ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లు నియామకమయ్యే అవకాశం ఉన్నది. ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సెలక్షన్‌ కమిటీ సమావేశం జరుగనున్నది. కమిషనర్ల నియామకం తరువాత సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో ఐదారు రోజులు పడుతుందని పేర్కొన్నాయి. సెలక్షన్‌ కమిటీ సమావేశానికి ముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదర్‌ న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి ఎంపిక చేసిన అభ్యర్థుల బయోడేటాతో వివరాలను పంపాలని మంత్రిత్వ శాఖను కోరారు.
ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు హైపవర్‌ ప్యానెల్‌ సమావేశం జరుగుతుందని సమాచారం.
కమిటీ ఏకాభిప్రాయం లేదంటే మెజారిటీ ఆధారంగా ఇద్దరి పేర్లను కమిషనర్లుగా నిర్ణయించి రాష్ట్రపతికి సిఫారసు చేయనున్నారు. అనంతరం నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి అధికారికంగా విడుదల చేస్తారు. మొన్నటి వరకు ఎన్నికల కమిషనర్లుగా అనుప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌ కొనసాగారు. ఫిబ్రవరి 14 నాటికి 65 సంవత్సరాలు పూర్తికావడంతో అనుప్‌ చంద్రపాండే పదవీ విరమణ చేశారు. అరుణ్‌ గోయల్‌ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో ప్రస్తుతం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే మిగిలారు.

Spread the love