నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కె.రామకృష్ణారావు.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్న ఈ సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు నెలకొల్పారు. గతంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన ఈయన… తెలంగాణ బడ్జెట్ రూపకల్పనలో రికార్డు సృష్టించారు. మొత్తం 14 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేసిన ఐఏఎస్ అధికారిగా పేరుగాంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇన్నిసార్లు బడ్జెట్‌ను రూపకల్పన చేసిన అధికారి ఎవరూ లేకపోవడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ వి నాగిరెడ్డి అత్యధికంగా 12 సార్లు బడ్జెట్‌ను రూపొందించారు. కాగా 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు 12 పూర్తిస్థాయి బడ్జెట్లు, రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లను రూపొందించారు. తెలంగాణ ఏర్పడిన కొద్ది కాలానికి ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ శాఖలోనే ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తొమ్మిదేండ్లు ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తించి రాష్ట్ర బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే బడ్జెట్‌ను తయారు చేయడం గమనార్హం. గతేడాది ఏప్రిల్ 30న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా కె రామకృష్ణారావు నియమితులయ్యారు. రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణ, ఫ్లాగ్‌షిప్ పథకాలకు నిధులు, ఆర్థిక వ్యవస్థల్లో పారదర్శకత పెంచడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల రెండింటి లోనూ ఆర్థిక శాఖకు ఆయన నేతృత్వం వహించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా పలు బడ్జెట్లను రూపొందించిన రామకృష్ణారావు… కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే అదే బడ్జెట్లపై శ్వేతపత్రం తయారు చేయటం గమనార్హం. ఈనెల 30న ఆయన ఉద్యోగ విరమణ పొందనున్న ఆయనకు ఆర్థిక రంగంలో ఉన్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో రామకృష్ణారావు రికార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



