రాముడి పేర బీజేపీ ఓట్ల రాజకీయం

రాముడి పేర బీజేపీ ఓట్ల రాజకీయం– పదేండ్లలో ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదు: బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
– పార్లమెంట్‌ ఎన్నికలపై నోవాటెల్‌ హౌటల్‌లో సమీక్ష
– ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హాజరు
నవతెలంగాణ-శంషాబాద్‌
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో దేశంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, రాముడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హౌటల్‌లో కాంగ్రెస్‌ కీలక నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమక్షంలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇంకా ఖరారు చేయని ఎంపీ సీట్లు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఎదుర్కొనే అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ పుల్వామా ఘటనను ఆధారం చేసుకుని అధికారంలోకి వచ్చినట్టు స్వయంగా ఆ పార్టీ నేతలు ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో రాముని పేరుతో ఓట్ల రాజకీయాలకు తెరలేపిందని, అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన చేశారని తెలిపారు. అక్కడ సౌకర్యాలు కల్పించకుండా మూడు కిలోమీటర్ల మేర ప్రజలను నడిపించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మోడీకి తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి లేదని, అందుకే ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రాముడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని అన్నారు. రాముడి పట్ల ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి విభేదాలు లేవని, కానీ ప్రజలకు కావాల్సిన విద్యా, వైద్యానికి వాళ్లు చేసిన మేలు ఏందో చెప్పాలని అన్నారు. రైతు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మతతత్వ రాజకీయాలను పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఐదు గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకునే చర్యల గురించి సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు. సమావేశంలో కీలక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love