– రూ.14,75,715 నగదు సీజ్ చేసిన పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో హవాలా డబ్బులు, ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు తీసుకెళ్తున్న నగదు, విలువైన వస్తువులతోపాటు లెక్కకు లేని నల్లడబ్బులు పెద్దఎత్తున పోలీసులకు చిక్కింది. గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ. 14,75,715లను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పటివరకు రూ. 51,54,43,673 నగదును సీజ్ చేశారు. ఎఫ్.ఐ.ఆర్లు 9 నమోదు కాగా ఇప్పటి వరకు 764 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు లైసెన్స్ ఆయుధాలు 4605 డిపాజిట్ చేశారు. 3439 బైండోవర్ చేయగా, 2343 నాన్ బెయిలబుల్ వారంట్ కేసులు నమోదు చేశారు. 6,254 వాల్ రైటింగ్, 30119 బ్యానర్, 21,616 పోస్టర్లను తొలగించారు. అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించగా 55కేసులను నమోదు చేయగా, 203 లీటర్స్ అక్రమ మద్యం సీజ్ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద సనత్ నగర్లో ఒక కేసు నమోదయ్యాయి. స్టాటస్టిక్ సర్విలన్స్ టీం ద్వారా అంబర్పేట్ నియోజక వర్గంలో రూ. 21,00,000 విలువైన నగదును సీజ్ చేశారు.