ప్రశ్నార్థకమైన ఆయకట్టు భవితవ్యం
నత్తనడకన రిజర్వాయర్ల భూసేకరణ
సాగునీరు అందక దిక్కుతోచని స్థితిలో రైతులు
గతంలో రెండు.. ఇప్పుడు మూడు రాష్ట్రాల మధ్య చర్చలు
గత ప్రభుత్వంలో జరిగిన లోపాలూ కారణమని ఆరోపణలు
మళ్లీ ఆశలు రేపుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
తుంగభద్ర నదీ జలాల వివాదాల నడుమ.. రాయ చూర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్’పై రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దశాబ్దాలుగా రాజకీయ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిలుస్తున్నది. ఒకప్పుడు వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాల్వలు.. నేడు నీటి జాడ లేక వెలవెలబోతున్నాయి. ఎగువన అనుమతులు లేని కట్టడాలు, కర్నాటక సరిహద్దుల్లో జరుగుతున్న నీటి మళ్లింపులతో దిగువన ఉన్న తెలంగాణ చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఒప్పందం ప్రకారం అందాల్సిన వాటా నీరు రాక వేలాది ఎకరాల భూమి ఎడారిగా మారుతుంటే, దశాబ్దాలుగా ఆధునికీకరణ మాటలు కాగితాలకే పరిమిత మవుతున్నాయి. దీంతో సాగునీటి కోసం ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లా రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్ప డింది. ఈ పనులు పూర్తయితేనే రైతుల ఇబ్బందులు తొలగుతాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో వేల ఎకరాల సాగుకు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కీలక ఆధారం. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థలో అత్యంత ముఖ్య మైనది. కర్నాటకలోని రాయ చూరులో హెడ్ వర్క్స్ ఉన్నప్పటికీ.. దీని కింద రాయచూర్ తోపాటు తెలంగాణ లోని జోగులాంబ గద్వాల, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలు లబ్ది పొందుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీఎస్ ఆయ కట్టును కాపాడటంలో భాగం గా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణం.. ఆర్డీఎస్ కాలువ ఆధునికీకర ణకు ప్రయత్నం జరిగింది. అయితే పనులు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీల నీటిలో వాస్తవంగా 5-6 టీఎంసీలు మాత్రమే అందేవి. కర్నాటక లోని సుంకేసుల బ్యారేజీ ఆనకట్ట ఎత్తు, కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, ఇతర రాష్ట్రాల అడ్డంకుల కారణంగా ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడేది. దీనికి పరిష్కారంగా తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి నేరుగా నీటిని ఎత్తిపోసి,ఆర్డీఎస్ కాల్వ లోకి వదిలేలా ప్రాజెక్టు ను రూపొందించారు. దీని ద్వారా గద్వాల, అలంపూర్ నియోజక వర్గాల్లోని సుమారు 87,500 ఎకరాల ఆయకట్టు ను స్థిరీకరించాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు 10 నెలల్లో పూర్తయి నీటి విడుదల జరిగింది. ఆర్డీఎస్ కాలువల ఆధునికీకరణ పూర్తి కాక పోవడం వల్ల గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని ఆయ కట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు.
మల్లమ్మకుంట పరిస్థితి ఇలా..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ పాత్ర కీలకం. తుమ్మిళ్ల ద్వారా సాగునీటిని అందించే లక్ష్యంతో రాజోలి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రిజర్వాయర్ పూర్తయితే వరదలు ఉన్నప్పుడు నదిలో నీటిని తీసుకోవడంతోపాటు, వర్షపు నీటిని కూడా నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మొదటి విడత పనులు పూర్తయినప్పుడే మల్లమ్మకుంట నిర్మాణాన్ని చేపట్టి ఉంటే ఈపాటికి పనులు పూర్తయ్యేవి. కానీ, పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ మల్లమ్మకుంట నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. దాంతో రిజర్వాయర్‌కు సంబంధించి పెగ్ మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.
ఆశలు రేపుతున్న తాజా సమీక్షలు
పాలమూరు రీజియన్‌లోని పెండింగ్ ప్రాజెక్టులపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఫేజ్-2 ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశ పనుల కోసం అవసరమైన 568 ఎకరాల భూసేకరణను రైతుల సంప్రదింపుల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరికల్లా పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు.
వివాదాలు, చిక్కుముళ్లు
తుంగభద్ర నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కర్నాటక పరిధిలోని హెడ్ వర్క్స్ వివాదాలు, గద్వాల జిల్లా పరిధిలోని రిజర్వాయర్ల భూసేకరణ జాప్యం కారణం గా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ఆర్డీఎస్ నీటిని నిల్వ చేసుకుని ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఫేస్-2లో భాగంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. భూసేకరణ ప్రక్రియ మూడేండ్లుగా ముందుకు సాగడం లేదు. రైతులకు సరైన పరిహారం పంపిణీ చేయకపోవడం, గతంలో పరిపాలనా పరమైన జాప్యం దీనికి ప్రధాన అడ్డంకిగా మారాయి. యుద్ధప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేస్తేనే ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు శాశ్వత ఉపశమనం లభిస్తుంది.
ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి
ఆర్డీఎస్ మొదలు పెట్టి దశాబ్దాలు గడిచినా నేటికీ ఆయకట్టుకు నీరు అందడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో నేడు ఈ ప్రాజెక్టు మూడు రాష్ట్రాల పరిధిలోకి వచ్చింది. దీంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. మూడు రాష్ట్రాలను ఒప్పించాల్సింది. ఇప్పటికైనా ఆర్డీఎస్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి. లేనిచో రైతులతో కలిసి ఆందోళన చేపడతాం.
వెంకటస్వామి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, గద్వాల



