చదువు

studyమా గర్శలకుంట పొలంలో యాసింగి నారుమడి దున్నుతున్నాడు మా నాన్న. నేను మా నాన్నకి మద్యానం సద్దితీసుకోని పొలంకాడకి పోయాను. మా పొలంగెట్టునానుకొని కోరెం సంజీవరెడ్డి (కాపోల్ల కోరెం సంజివయ్య) పొలం ఉన్నది. ఆయనకూడా అదేరోజున నారుమడి దున్నుతున్నాడు. ఆయనకు కూడా వాళ్ళావిడ సద్ది తెచ్చింది. వాళ్ళు, మేము అన్నం తినడానికి మంచి నీళ్ళ కోసం పక్కన్నే వున్న వాగులోని చెలిమె కాడికి చేరుకున్నాం.
సద్ది మూట ఇప్పుకుంటూ.. ”ఔను! భీలుగా వీడు నీ కొడుకార!?” అని ఆశ్చర్యంగా అడిగిండు కోరెం సిజీవరెడ్డి. ”అవును పటేల, వాడు నా కొడుకే!” అన్నాడు మా నాన్న గిన్నెలో అన్నం-కూర కలుపుకుంటూ.
”మరెన్నడు కనపడక పాయేనేంమ్రా!?” అడిగాడు ఆశ్చర్యంగా. ”వాడు మొన్నటిదాకా బడికి పాయేవాడు పటేల! మూడో తరగతి వరకు చదువుకున్నాడు. అన్నిట్లో ఫస్టవచ్చేవాడు. కాని నేనే, ఇకనుండి బడికి పోవద్దని, మాన్పించి.. మా గొడ కాడికి పంపుతున్నా” అన్నాడు మా నాన్న, అన్నం ముద్ద చేతిలో పట్టుకొని.
”అరే! ఎందుకురా చదివే పిలగాన్ని చెడగొట్టి, బడిమాన్పించినవూ?”
”ఏం చెప్పమంటవు పటేల ఆదో పెద్దగాథ! కడుపు చింపుకుంటే మనకాల్లమీదనే పడుతుంది. ఏ చంపమీద కొట్టినా మనకే తలుగుతుంది. ఐనోడే అన్యాయం చేస్తుంటే ఎవ్వరికి చెప్పుకున్నా అది వ్యర్థమే!”
”మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది!?” అని ఎంతడిగిన చెప్పకపోయేసరికీ
”నేన్జేప్తా పటేల.. అని ముందుకొచ్చి…
నేనప్పుడు ఐదారు సంవత్సరాల బాలున్ని. కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం, పెద్దవాళ్ళను ప్రశ్నలడిగి, విసిగించేవాడిని. ఐతే, అది 1980 వ దశకంలో మొదటి సంవత్సరం. ఎండాలం పోయి, వర్షాకాలంలోకి అడుగు పెడుతున్న సమయమది. అంటే, జూన్‌ నెలలోకి అడుగు పెడుతున్నామన్నమాట. ఆ సమయంలో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఘోరమైన వేడిగాలి వీస్తున్నది.
తండాలో నాయకులు, యువకులు అందరు తండాలోని పెద్ద చింతచెట్టుకింది రాళ్ళమీద కూర్చున్నారు. తండా నాయకుడు మాట్లాడుతూ ”వచ్చే సోమవారం రోజున మన తండాకు బడిపంతులు వస్తున్నాడు. మన తండాకు బడి మంజూర్గావాలనే కల ఎన్నోరోజులకు నెరవేరింది. మన తండానుండి పిల్లలు ఊళ్ళో బడికి పోతుంటే, ఊళ్ళోవాళ్ళు దారిలో భయపెట్టడం వలన, చాలామంది చదువుకు దూరమయ్యారు. ఐతే ఇప్పుడు ఆ సమస్యవుండదు. కానీ పిల్లల్ని ప్రతిరోజు మనమే బడికిపంపాలె. లేకపోతే మంజూరైన బడిని, అదేవిధంగా బడిపంతుల్నీ రద్దు చేసేస్తారు. అప్పడు సమస్య మళ్ళీ మొదటికివస్తుంది” అని మీసమ్మెలేసుకుంటూ అన్నాడు తండా నాయకుడు.
ఈ విషయం విన్న నేను, వెంటనే ఉరుక్కోంటూ, ఇంటికి పోయి, మా అమ్మతో చెప్పి, వచ్చే సోమవారం నుండి మనతండా పిల్లలందరూ బడికి పోతారట, నేనుకూడా వచ్చే సోమవారం నుండి బడికి పోత. నన్నుకూడా బడిలో జాయిన్‌ చెయ్యమని అడగగా, మా అమ్మ ఒప్పుకుని ”ముందుగా బడిని, బడి పంతులుని.. తండాకు రాని! వస్తే అందరి కంటే ముందుగా నిన్నే జాయిన్‌ చేయిస్తాను” అని ముద్దుగా చెప్పి, నా తల నిమిరింది.
చూస్తుండగానే వారంరోజులు గడిచినయి. అనుకున్నట్టుగానే సోమవారంనాడు పంతులు రానేవచ్చిండు. కొత్తగా బడి పంతులు రావడంతో తండా వాసుల్లో ఆనందానికి హద్దులు లేవు. అందరూ తమ పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు.
మా అమ్మ కూడా నన్ను బడిలో చేర్పించేందుకు పోయి.. ముందుగా సారు ఊరు-పేరు తెలుసుకోవాలని.. ”నీ పేరేంటిది సారు!? మీదేవూరు!?” అని వినయంతో కూడిన గౌరవంగా అడిగింది.
”అమ్మా! నా పేరు తిరుపతి రెడ్డి, మాది పస్రా” అని అంతే గౌరవంగా సమాధానమిచ్చాడు బడి పంతులు.
”ఇగో, ఈ పిలగాడు నా కొడుకు, బడిలో జయీన్‌ చేస్తామని వచ్చిన సారు. బడి మంచిగ చెప్పుసారు, లేకలేక దక్కిండు ఒక్క కొడుకే సారు, నీ దండంపెడత..” అని అన్నది మా అమ్మ రెండు చేతులతో నమస్కారం పెడుతూ.
”సారు, తిరిగి నమస్కారం పెడుతూ, సరేనమ్మా!, మీ బాబు పేరేంటి?”
”పేరు..బొందాలు”
”సరే, ఇంటి పేర్జేప్పు?”
”ఇంటి పేరు బాణోత్‌” అని చెప్పింది.
”పుట్టిన తేదీ, సంవత్సరం చెప్పు”
”సార్‌ నా కొడుకు నాల్గు సంవత్సరాల కిందట, వానాకాలం కల్లాలప్పుడు పుట్టిండు” అని చెప్పింది, నేను జన్మించిన రోజును గుర్తుకు తెచ్చుకొంటూ.
”ఆ విధంగా చెపితే నడవదమ్మా!, కచ్చితమైన పుట్టిన తేదీ సంవత్సరం చెప్పాలె. మీ భర్తను పిలువు, ఆయన్నడుగుదం.” అన్నడు సారు.
అప్పుడు మా అమ్మ, మా నాన్నను ”ఏ..బొందా.. బొందాలు వోరు.. ఇదే..వర..వర..వర..తోన.. సార్‌.. బలారొచేరు…” అని కూతేసి పిలిచింది.
ఆ కూత విని ఇంటికి వచ్చిన మా మామను వెంటపెట్టుకొని, బడిపంతులు వద్దకు వచ్చాడు మా నాన్న.
”మీ బాబుదీ పుట్టిన తేదీ, సంవత్సరం చెప్పితే రిజిస్టర్‌ లో పేరెక్కిస్తా..” అని అన్నాడు పంతులు.
”మా కొడుకు నాల్గు సంవత్సరాల కిందట వానాకాలం కల్లాలప్పుడు పుట్టిండు సార్‌” అని ఉత్సాహంగా సమాధానమిచిండు మా నాన్న.
”అరే నాయకుడా అట్లా చెబితే ఎట్ల రాసేదీ రిజిస్టర్‌లో” అని నారాజుగా అన్నాడు బడి పంతులు.
”ఇగో సారు, ఈన పేరు ‘ఠగ్యా’, మా బావ. మూడవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆయనకన్నీ తెలుసు. ఆయన చెప్పుతడు, రాసుకొండి” అన్నాడు ఒకంత ఉత్సాహంగా మా నాన్న.
”ఐతే, నువ్వు చెప్పు నాయకుడా.. పుట్టిన తేదీ సంవత్సరం చెప్పు..” అన్నాడు తొందర పాటుగా.
”రాసుకొండి సారు.. 25వ తారీఖున, 10వ నెల 1974వ సంవత్సరం లో పుట్టిండు సార్‌” అని గుర్తుకు తెచ్చుకుని చెప్పిండు.
లో లోపల నువ్వుకుంటూ, నా వివరాలు రిజిస్టర్‌లో రాసుకుని ”ఈ రోజుతో మీ బాబు బడిలో చేరినట్టు. రోజు బడికి రావాలి. పలకా- బలపం మేమే ఇస్తాం. రోజు మధ్యాహ్నం ఉప్మా పెడతం. బాబును ఉండనిచ్చి మీరు ఇంటికి పోవచ్చు” అని మదువుగా చెప్పిండు సారు.
”బస్తాతట్టు ఇచ్చి మల్ల ఇప్పుడే తోల్తా సారు. కింద అంతా గొడ్ల పెండరొచ్చు ఉన్నది, ఎట్ల గూసుంటడు!?”
”సరే మంచిదమ్మా!”
కొత్తగ బడి మంజూరు కావడంతో బడి పంతులు తప్ప మరే సౌకర్యం లేదు. పంతులు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు. ఆయన కూర్చోవడానికి నులక మంచం మీద చద్దరేసిండ్రు. తండా నాయకుడు మా పెదనాన్న కావడంతో బడిని మా పెదనాన్న పశువుల కొట్టంలో నడుపుతున్నారు. ఆ పశువుల కొట్టాన్ని మా భూమిని ఆక్రమించి అందులో కట్టిండు మా పెదనాన్న. వర్షాకాలం కావడంతో పశువులను ఇడిసి, పెండతీసి, ఊడిసి, శుభ్రం చేసిన తర్వాత పిల్లలను కూర్చో బెట్టేవారు. ఐనా వర్షాకాలం కావడంతో ఆ కొట్టంలోపల తడారేదికాదు. పైగా పశువుల రొచ్చు వాసన వచ్చేది. అప్పటి వరకు బడి, చదువు అంటే తండా వాసులకు అందని ద్రాక్ష లాంటిది కావడంతో ‘బడికి పోతున్నాం, చదువు నేర్చకొంటున్నాం’ అనే సంతోషం ముందు, ఆ సమస్యలు, పెద్దగా అనిపించేవికావు.
సార్‌ నాకు పలకా, బలపమిచ్చాడు. రొటీన్‌గా బడి నడుస్తున్నది. 5 సంవత్సరాల చిన్న పిల్లలనుండి 14 సంవత్సరాల పడుసు వయస్కులవరకు, అందరూ కలిసి ఒకే తరగతిలో కూర్చోని చదువుకొనేవారం. నేను చకచకా.. అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒకట్రెండ్లు వంద వరకు… అందరికంటే ముందుగా అప్పచెప్పేవాణ్ణి. అంతమంది పెద్ద పెద్దలముందు సార్‌ నన్ను మెచ్చుకోవడంతో ఇంకా బాగా చదవాలనిపించేది.
అప్పటికి బడి మొదలై మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెలల్లో నేను అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒకట్రెండ్లు వంద వరకు నేర్చుకున్నాను. 15 ఆగష్టు రావడంతో మా సారు బడి పిల్లలందరికీ ఆటల పోటీలు, పాటల పోటీలు నిర్వహించాడు. వాటిల్లో నా సమ వయస్కుల్లో నాకే మొదటి బహుమతి వచ్చింది. మొదటి బహుమతి పెన్ను, రెండవ బహుమతి పెన్సిల్‌, మూడవ బహుమతి కట్టె బల్పం ఇచ్చాడు. 9 నుండి14 సంవత్సరాల వయస్సు గల వారిలో లక్పతి, గోవిందు బాగా చదివే వారు.
బహుమతుల పంపకం తర్వాత మా సార్‌ 15 ఆగష్టు రోజు ప్రాముఖ్యత గురించి, ఈ మూడు నెలల్లో పిల్లల ప్రగతి గురించి చెప్తూ ”మన బొంద్యాలు, సంవత్సర కాలంలో పూర్తిగా నేర్చుకునే చదువును కేవలం మూడే మూడు నెలల్లో నేర్చుకోగలిగాడు. అతను అలాగే బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకు, ఈ తండాకు, అదేవిదంగా మన బడికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని.. ఆశిస్తూ ముగిస్తున్నాను” అని తన ఉపన్యాసం ముగించాడు మా సార్‌.
ఇక అప్పటి నుండి నాలో ఇంకా చదవాలనే ఉత్సాహం రెట్టింపయింది. తండా వాసులందరు చిన్నాపెద్దా, ఆడామగా, చావడికాడా, చింత చెట్టు కింద, పనులకాడా.. నా గురించే మాట్లాడుకొంటున్నారు. నాకు మంచి పేరు రావడం, మా పాలివాళ్లు తప్ప మిగతా తండా వాసులందరు ప్రశంసిస్తున్నారు.

మేం చదువుతున్న బడిని (పశువుల కొట్టం), తండా నాయకుడు (మా పెదనాన్న) మా స్థలం ఆక్రమించి, అక్రమంగా కట్టడంతో ఇక ఎంత చెప్పినా వినడని భావించిన మా అమ్మ తండాకొచ్చిన రావు నరసింహ్మారెడ్డికి చెప్పింది.
”ఏంచేస్తం సీత.. కలికాలం. నేన్జెప్పినంత మాత్రాన, వాడింటాడా!? పెదచేప చినచేపల్ని మింగేసిన చందంగా వుంది ఇది. మహాభారతంలో పాండవులు కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడ్డారు. కానీ చివరకు పాండవులే విజయం పొందారు” అంటూ తన ధోతి కొస చేతిలో పట్టుకొని హైండిల్‌ మీద చెయ్యేసి, సైకిల్‌ తొక్కుకొంటూ వెళ్లిపోయాడు.
ఆ నాయకుడికి మంచి-చెడు చెప్పీ, తన స్థలం తిరిగి ఇప్పిస్తాడేమోననుకొంటే ఏదేదో చెప్పిండు. ఒక్క ముక్కర్థంగాలేదు. ఇక ఈయనతో కాదని భావించి, మా ఊరి సర్పంచ్‌ ‘బిళ్ళా సంజీవరెడ్డి’కి ఫిర్యాదుచెయ్యగా, వెంటనే ఎల్ల మస్కూర్‌ను పంపి, మా పెదనాన్నను పిలిపించి గట్టిగా మందలించాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని, సమయం కోసం ఎదురు చూస్తూన్నాడు తండా నాయకుడైన మా పెదనాన్న.
చదువులో, ఆటపాటల్లోకూడా నా తోటి వాళ్ళకంటే ముందుండటం, మా సారు మెచ్చుకోవడం, తండా వాసులందరు ప్రశంసించడం చూసి నాలో ఇంకా మంచిగా చదవాలనే, ఆడాలనే కుతుహలం పెరిగింది.
ఇంతలో వర్షాకాలం పోయింది. నవంబర్‌ నెల తర్వాత వర్షాలు తగ్గినయి. పశువుల కొట్టంలో ఉన్న బడిని ఇంటెనక పెరడులో, చెట్లు, చెత్తా, చెదారమంతా సాఫ్‌ చేపించి, అందులో గురిసేపించి, ఆ గుర్సెలో బడి నడిపించేవాడు మా సారు. ఆ బడి గుర్సెముందు మట్టితో గద్దె కట్టి, ఆ గద్దెలో ఒక చక్కటి, ఎదురుబొంగులాంటి కర్రకు గోధుమపిండి వుడికించి, చల్లారిన తర్వాత, దాన్ని ఆ కర్రకు పూసి, రంగు-రంగుల కాగితాలంటించి, జెండా ఎగిరించే దానికి అనువుగా చేసి, ఆ గద్దెలో నాటించారు. దాని మీద 26 జనవరిన జెండా ఎగురవేశారు మా సారు.
ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ ”ఈ రోజున మనమందరం కలిసి 26 జనవరి జరుపుకొంటున్నాం. ఈ రోజు ప్రత్యేకత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అంటే ఈ రోజునుండి మనలను మనమే పరిపాలించు కొవడమని అర్థం. ఈ తండా బడిలో నేను మొదటి పంతులుగా వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. నేను ఇక్కడి నుండి బదిలీయై ఎల్లి పోయినా, నా జీవితంలో మరువలేను. మీరందరు కూడా నన్ను గుర్తుంచుకుంటారని.. భావిస్తూ.. ముగిస్తున్నాను, జై హింద్‌” అంటూ ఆర్ద్రతతో కూడిన తన ప్రసంగాన్ని ముగించారు.
అతను అన్నట్లే, ఆ సంవత్సరం చివరి వరకు వచ్చాడు. ఎండాకాలం సెలవుల్లో పోయిన మా సారు మల్లి రాలేదు. ఆయన స్థానంలో వేరే సారొచ్చారు. ఈ సారు పేరు ‘కొమరయ్య’ సారు. ఈయనది వర్దన్నపేట. రోజు వర్దన్నపేట నుండి వచ్చేవాడు. ఆయన రాకతో బడి స్థలం కూడా మారింది. ఇప్పుడు బడి ‘గుగులోత్‌ దామా’ ఇంటి గోడకు ఆధారంగా పాకా/ వసారా/ గుర్సె కట్టి, ఇందులో బడి చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు నేను రెండవతరగతి చదువుతున్నాను. నాకు బడన్నా, బడి ఆవరణన్నా చాలా ఇష్టం. పొద్దున్నే బడికి పోతే అక్కడే ఉండేవాడిని. ఆకలేసినపుడు మాత్రమే ఇంటికి పోయి ఇంత అన్నం తిని వచ్చేవాడిని. ఆ బడి ఆవరణ స్థలాన్ని శుభ్రం చేసేవాడిని. అందులో పూలచెట్లు పెట్టే వాడిని, చెట్లకు రక్షణగా కంచెనాటేవాడిని. అవి ఎండిపోకుండా వాటికి నీళ్ళు తెచ్చి పోసే వాడిని. ‘కొమురయ్య’ సారు కూడా నన్ను, నా చదువును మెచ్చుకొనే వాడు. ఆయన అరటిపండ్లు తెచ్చుకుంటే, అందులో నుండి ఒకటో-రెండో నాకిచ్చేవాడు. మిగతా పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేవాడు.
నేనిప్పుడు మూడవ తరగతిలోకి ప్రవేశించాను. తండాలో పెద్ద వాళ్ళు సారు కులం గురించి మాట్లాడుతుంటే విని.. ఒక రోజు అనుకోకుండా బడిలోనే ‘సారు’ కులమడిగాను. సారుకు అది నచ్చక, దండనగా ఇరవై బిస్కీళ్ళు తీపించడం వలన, నేను ఆ తర్వాత రోజు బడికి పోలేదు కాని బడి చుట్టూ పక్కల అక్కడక్కడే తిరిగే వాడిని. అది గమనించిన మా సార్‌, ఒక విద్యార్థిని నా దగ్గరకు పంపించి, నన్ను తన దగ్గరికి రపించుకొని, బడికి రాకపోవడానికి కారణం తెలుసుకొని రేపటి నుండి బడికి రావాలని ఆదేశించాడు. మరునాడు నుండి మళ్ళీ యథావిథిగా బడికి పోయాను.
”ఈ చిన్న పనిష్మేంట్‌కే బాగా చదివే నువ్వే బడి మానేస్తే ఎట్లా బాబు, ఇంకెప్పుడు అలా చెయ్యకు” అని నా తలపై చెయ్యి వేసి బుద్గరించి, బుగ్గలు పిండి చెప్పాడు.
”క్లాస్‌ వర్క్‌ కాపీలు తీసి, ఇప్పుడు నేను బోర్డు మీద రాసే ప్రశ్నలు, జవాబులు తప్పులు లేకుండా రాసుకోవాలి” అని చెప్పి చాక్‌పీస్‌తో బోర్డు మీద రాశాడు. కానీ బోర్డు సరిగ్గా పని చేయడం లేదు. అప్పుడు ఆయన ”మనకు ఒక కొత్త బోర్డు (నల్లబల్ల) మంజూరైంది. దాన్ని తెచ్చేవాళ్ళులేక అది మనూరి పెద్ద బడిలో ఉంది. దాన్ని తెచ్చుకుంటే, అది మంచిగ పనిచేస్తుంది” అన్నాడు మా సార్‌.
అప్పుడే లేసి ”నేను తెస్తా సార్‌” అన్నాను ఆసక్తిగా. ”అది బరువు ఉంటది, నువ్వు మోయగలవా!?” అని అన్నాడు సార్‌. ”నేను ఎత్తుకొస్తా సార్‌” ఇష్టంగా అన్నాను.
”సరే! చూద్దాం లే!” అని చూసాయగా అన్నాడు సార్‌. కాని ఎట్లైన చేసి ఆ బోర్డును నేనే తేవాలనుకుని, మరుసటి రోజు బడికి పోకుండా, సక్కగ మా ఊరి బడికి పోయి, మా సార్‌ పేరు చెప్పి, బోర్డును నెత్తి మీద ఎత్తుకొని, తండా బడికి బయలు దేరాను. అది చాలా బరువుగా ఉండటంతో, బాటసారుల సహాయంతో, ఆరు సార్లు దించి, మళ్ళీ ఎత్తుకొని.. చివరకు తండా బడిలోకి పోయి, మా సార్‌ సహాయంతో కిందికి దించాను. అది చూసి మా సార్‌ నివ్వెర పోయాడు. ”పట్టుదల ఉంటే కానిది లేదు, ఏ పనైనా ఇష్టపడి చేస్తే కష్టమనిపించదు” అన్నాడు ఆనందంగా.
సంక్రాంతి సెలవులు రావడంతో, వారంరోజులు ‘సారు’ రాలేదు. ఇక బడికి సెలవులని నేను కూడా అటువైపు పోలేదు. ఆ బడిగుర్సె ఆవరణంతా చెత్తా-చదారమైయింది. పూల చెట్లు సగమెండిపోయినయి. రేపటినుండి బడి నడుస్తదనగా ముందురోజు సాయంత్రం పూట నేను, నా మిత్రుడు స్కూల్‌ ఆవరణంతా క్లీన్‌ చేసి, పూలచెట్లకు నీళ్ళు పోశాం. పొద్దుబూకాల్లకు కూతవేటు దూరంనుండి ముగ్గురు మనుసులు రెండు మేకలు, ఒక గొర్రె పిల్లను తోలుకుని, దూరం వినబడే విధంగా, పెద్దపెద్దగా అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ, నావైపు/ తండా వైపుకు వస్తున్నారు. అందులో నుండి ఒక మేక మరక తప్పించుకొని, ఒర్రుకుంటూ, లింగడేర్‌ డొంకవైపు ఉరుకుతుంటే..
దాన్ని మర్రేసి పట్టుకొచేవాళ్ళు లేకపోవడంతో, మమ్ముల ఆమేకను మర్రేసుకురమ్మని కూతవేశాడు మా పెదనాన్న. కాని మేం పూలచెట్లకు నీళ్ళు పోయడంలో నిమగమైవుండి ఆ మేకను మర్రేసి పట్టుకురాలేదు. అందుకు ఆగ్రహించిన మా పెదనాన్న కోపంతో రగిలిపోతూ.. ”వీనికి ఎంత బలుపు! నా మాటే వినడా? పూలచెట్లు నా కంటే యెక్కువైనాయా? నువ్వు నా చేతికి దొరకాలె! నీ సంగతి చెప్తా” అంటూ నన్ను పట్టుకొని కొట్టబోతుండగా, నేను దొరక్కుండా ఉరికి మా ఇంటిముందు డొంకలో దాక్కున్న. అదే కోపంతో మా ఇంటికొచ్చి ”నీకొడుకెక్కడీ రేపటినుండి బడిలో కనబడితే వాని సంగతి చెప్తా. వానికి నా మాట కంటే, బడిలో పూలచెట్లు ఎక్కువైనయా? వాడెక్కడీ బయటికి రమ్మను..” అంటూ అగ్గిమీద గుగ్గిలమయిండు మా పెదనాన్న.
ఈ పరిస్థితిని చూసి మా అమ్మానాన్నలకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయనకి మంత్రతంత్రాలు, చేతబడి.. వస్తదని తండా ప్రజల నమ్మకం. ఆ భయంవలన తండాలో అతన్ని ఎదిరించడానికి ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. మా ఇద్దరు చిన్నాన్నలు ఆయన మంత్రాలు, చేతబడి చేయడంవల్లనే చనిపోయారని మా అమ్మానాన్న నమ్మేవారు. ఇప్పుడు నన్ను కూడా అలాగే చంపేస్తాడేమోనని భయం పట్టుకుంది వాళ్లకి. అందుకనే ”ఆ బడి, చదువు.. లేకుంటే లేకపారు కాని నా కొడుకు బతికితే నాకదే చాలు” అని గట్టి నిర్ణయానికి వచ్చాడు మా నాన్న. ఆ మరుసటిరోజున బడికి పోదామనుకుంటే గోడకొయ్యకు తలిగించిన పుస్తకాల సంచి లేదు. ఇంట్లో అటూఇటూ వెతకగా, గాబుసందులో ఖాలి సంచి, కంపాస్‌ దొరికినయి. పుస్తకాలేమైనయని వెతుకుతుంటే, కొట్టంలో పొయికాడ, సగానికెక్కువ కాలిన కాగిదపు ముక్కలు కనిపించడంతో దు:ఖమాగక ఎక్కెక్కిఏడ్చిన. మా నాన్న నడిగితే ”చదువొద్దు, బడొద్దు ఏదొద్దు.. ఇప్పటికే నిన్ను బతికించుకోవడానికి, ఎన్నోకష్టాలు పడ్డాను. ఇప్పుడు ఎవరికంట్లోపడొద్దు! ఏదో కష్టం చేసుకుని బతుకుదాం. నువ్వు ఈరోజునుండి మన గొడ్లను (పశువులను) మేపుకొర.” అని దుక్కభరితంగా, కంటనీళ్ళు పెట్టుకుంటూ.. అన్నాడు మా నాన్న” అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పిండు.
ఇదే అదునుగా భావించిన కోరెం సంజీవరెడ్డి ఆ బాలున్ని తమ వద్ద జీతం/ పాలేరు గా పెట్టుకోవాలనుకొని…
”వాన్ని నాదగ్గర పనికుంచురా! మన పశువుల మర్రెసేటందుకు ఎవర్లేరు!. అంతోఇంతో జీతమిస్తే నీకాసరైతడు. పన్నేర్చుకుంటడు. వానికి అన్నీ పనులు నేన్నేర్పిస్తాన్లే” అన్నాడు అన్నం చేతి వేళ్ళు నాకుతూ.
”వాడు ఎనిమిదేంళ్ళ చిన్నపిలగాడు పటేల. గన్ని గొడ్లను మర్రేస్తాడా? వానికాగుతాయా” అన్నాడు తిన్న అన్నం గిన్నె కడుగుతూ మా నాన్న.
”అరే! మేం లేమా? వాడికి చేతగాని పనిచెప్తామా ఏంటీ? వాడేపనీ చెయ్యనక్కరలేదు. కాస్త ఆ గొడ్లను మర్రేస్తే చాలు” అని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు కోరెం సింజీవ రెడ్డి.
”ఐతే, జీతంతోపాటూ వెయ్యి రూపాయలు రెండు పైసల మిత్తికి కావాలె మరి. ఇస్తానంటే మరి నువ్వన్నటే జీతముంచుత.” అని అన్నాడు చెలిమెకాడినుండి లేసి నారు మడి వైపుకు పోతూ.
”అరే! నాయకుడా! నలుగురితో నారాయణా, మనం వేరే కాదు కదా” అన్నాడు కోరెం సంజీవ రెడ్డి ఆశగా.
– డా||బొంద్యాలు బాణోత్‌ (బంజారా)

Spread the love