మిగిలిన కాంట్రాక్టు అధ్యాపకులనూ క్రమబద్ధీకరించండి

సీఎం కేసీఆర్‌కు టీజీజేఎల్‌ఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఇంకా క్రమబద్ధీకరణ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్టు అధ్యాపకులనూ క్రమబద్ధీకరించాలని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ- 475) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డికి శనివారం ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వస్కుల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినతిపత్రం పంపించారు. 23 ఏండ్లు గా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 474 మంది, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 577 కాంట్రాక్టు అధ్యాపకులను ఇంకా క్రమబద్ధీకరించలేదని తెలిపారు. పోస్టులు మంజూరు కాలేదు, వారికి సరైన విద్యార్హతల్లేవు, అవార్డు ఫాస్ట్‌ డివిజన్‌ లాంటి కారణాలను చూపుతూ, వారి తప్పు లేనప్పటికీ ఇంతవరకు క్రమబద్ధీకరణ చేయలేదని వివరించారు.
బోధించేటపుడు లేని సమస్యలు క్రమబద్ధీకరణ విషయంలో ఎందుకు వచ్చాయని తెలిపారు. సీఎం, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలను సమర్పించినా ఫలితం లేదని పేర్కొన్నారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుని వారి క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరగా అయ్యేటట్టు చూడాలని కోరారు.

Spread the love