సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించండి

– మంత్రి కేటీఆర్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ వర్తింపచేస్తూ వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి శ్రీలత నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. సమగ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులివ్వాలని పేర్కొన్నారు. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని వివరించారు. నగదు రహిత వైద్య సదుపాయం కల్పించాలనీ, ఆరోగ్య కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ కల్పించాలని కోరారు. మరణించిన, గాయపడిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలిపారు.

Spread the love