సీబీఐ దృవీకరించినట్టు లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల

న్యూఢిల్లీ : వైఎస్‌ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌పై లోక్‌సభ సచివాలయం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. అవినాష్‌ అరెస్ట్‌ నిజమేనని ఇటీవలే సచివాలయానికి రాసిన లేఖలో సీబీఐ ధ్రువీకరించింది. దీంతో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. అరెస్ట్‌కు సంబంధించిన సమాచారం సోమవారం నాడు అందినట్లు సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది. అవినాష్‌ను జూన్‌-03న అరెస్ట్‌ చేసి వెంటనే విడుదల చేసినట్లు సిబిఐ లేఖలో పేర్కొందని బులెటిన్‌లో లోక్‌సభ సచివాలయం పేర్కొంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1973లోని సెక్షన్‌లు 36, 41 కింద 3 జూన్‌ 2023న 12:15 గంటలకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని అధికారికంగా అరెస్టు చేసినట్లు సిబిఐ తెలిపిందని లోక్‌సభ సచివాలయం తెలిపింది. అంతకుముందు తెలంగాణ హైకోర్టు 31 మే 2023 నాటి ఉత్తర్వుల ప్రకారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని, అరెస్టు చేసినట్లయితే, రూ.5 లక్షల బాండు, వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించిందని సీబీఐ తెలిపినట్టు పేర్కొంది. తదనుగుణంగా 03 జూన్‌ 2023న అరెస్టు చేసిన తరువాత, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవినాష్‌ రెడ్డి వెంటనే అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారని సీబీఐ పేర్కొందని లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ లో పేర్కొంది.

Spread the love