పశ్చాత్తాపం

Repentanceపార్వతమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. గత పది రోజుల నుండి జ్వరం తగ్గటం లేదు. బాగా నీరసంగా ఉంటోంది.
”పట్నంలో వుండే మంచి హాస్పిటల్‌లో చూపిద్దాం. నీకు తోడుగా నేను వస్తానమ్మా” అన్నాడు నాగన్న.
అందుకు ఆమె, ”ఎందుకు నాయనా నీకు శ్రమ. ఏదో రోజు నేను ప్రాణాలు వదలి వెళ్లాల్సిందే కదా!” కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ అంది.
”అదేంటమ్మా అలా అంటావు? ఎవరూ లేని నాకు అమ్మగా అక్కున చేర్చుకున్నావు. అనురాగం పంచావు. నీ ఆరోగ్యం కుదుట పడితేనే కదా, నా మనసు బాగుండేది. హాస్పిటల్‌కి వెళదాం పదమ్మా”.. అని ఆమెను పట్నం తీసుకెళ్లి, మంచి వైద్యం చేయించాడు నాగన్న..

ఆ రోజు రాత్రి… ఎంతో నిశబ్దంగా ఉంది.. గ్రామం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. సమయం ఎనిమిది గంటలు దాటింది. అరుబయట చల్లని గాలులు వీస్తున్నాయి.
అప్పుడప్పుడే నాగన్న మంచంపై వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాడు. మనసులో పదేళ్ల నాటి గతస్మతులు గుర్తుకు వచ్చాయి. ఒక్కొక్క సంఘటన సినిమా రీలులా అతని కళ్ళ ముందు కదలాడింది.

ప్రకతి ఒడిలో అందంగా ఒదిగిన ఒక కుగ్రామం, జోగుపల్లె. ఆత్మీయత, అనురాగాలకు మారుపేరు ఆ ఊరు. రాములు అదే గ్రామంలో ఒక చిన్న రైతు. తనకు ఉన్న రెండెకరాల మాగాణిలో ఏటా రెండు పంటలు తీసేవాడు. ఆ ఊళ్ళో రాములు అంటే అందరికీ గౌరవం, అభిమానం వుండేవి. ఆయనకు తగ్గట్లు చక్కటి ఇల్లాలు పార్వతమ్మ. వీరికి యాదయ్య ఏకైక సంతానం కావటం వల్ల అపురూపంగా పెంచారు. కొడుకుకు పట్నంలో మంచి చదువులు చెప్పించి ప్రయోజకుణ్ణి చేయాలనే సంకల్పం ఆ దంపతులకు వుండేది. ఊళ్ళోనే ప్రాథమిక విద్య ముగిసాక, యాదయ్యను దగ్గరలో వుండే పట్నంలో తన దూరపు బంధువుల ఇంట్లోనే చదువుల కోసం వదిలాడు రాములు.
చిన్నతనంలోనే తల్లి తండ్రులను పోగొట్టుకున్న నాగన్నకు, పార్వతమ్మ దంపతులు చేరువయ్యారు. వాళ్లంటే ప్రాణం, అభిమానం. ఏ విషయానికైనా వాళ్ళని సంప్రదించంది అడుగు ముందుకు వేయడు. అన్ని విషయాల్లో వారికి చేదోడుగా ఉంటున్నాడు.
యాదయ్య పెరిగి పెద్ద వాడవుతున్నాడు. కొడుకును డిగ్రీ చదివించాలని అనుకున్నాడు రాములు. పట్నంలోనే ఒక కాలేజీలో డిగ్రీ చేర్పించి హాస్టల్‌ వసతి కూడా ఏర్పాటు చేశాడు.
కానీ.. రాములు ఆశించిన్నట్లుగా, కొడుకు చదువు సాగలేదు. నెమ్మదిగా యాదయ్య చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు. తోటి స్నేహితులతో కలసి కాలేజికి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్ళేవాడు. సిగరెట్లు, బీడీలు కాల్చడం, పేకాటలు లాంటి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పరిస్థితిని గమనించిన హాస్టల్‌ వార్డెన్‌ యాదయ్యను మందలించాడు. కానీ అతనిలో మార్పు రాలేదు. నెమ్మదిగా తాగుడుకు కూడా అలవాటు పడ్డాడు. తల్లి తండ్రులు ఇచ్చిన డబ్బు వ్యసనాలకు ఆరతి కర్పూరంలా కరగి పోయేది.
కొడుకులో వచ్చిన మార్పును గమనించిన రాములు దంపతులు చాలా బాధ పడ్డారు. అతనిలో పరివర్తన తెచ్చేందుకు ఎన్నో విధాలుగా మందలించి చూశారు. అయినా లాభం లేక పోయింది. తల్లి తండ్రుల నీతి మాటలు అతనికి బుర్రకెక్కలేదు. ఎదిరించాడు. తల్లీకొడుకుల మధ్య మాట మాట పెరిగి అది తగవుకు దారి తీసింది. అంతే..
యాదయ్య ఆ రోజు ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. మరి ఇక రాలేదు. చేసిన తప్పు తెలుసుకుని కొడుకు ఏదో ఒక రోజు ఇంటికి తిరిగి వస్తాడని అనుకున్నారు ఆయన తల్లిదండ్రులు.

రోజులు గిర్రున తిరిగి పోయాయి. ఎవరి జీవితాలు ఎలా నడుస్తాయో తెలియదు కదా! అనారోగ్యంతో రాములు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పుట్టెడు దుఃఖంలో ఉండి పోయింది పార్వతమ్మ. ఒంటరిదై పోయిందనే బాధ ఒకవైపు, కొడుకు జీవితం నాశనం అయ్యిందనే ఆలోచన మరొకవైపు ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.
మాతత్వాన్ని పంచి, మమకారంతో పెంచి పెద్దవాణ్ణి చేసిన యాదయ్య, మానవత్వం లేని కసాయివాడుగా మారిపోయాడు. వద్ధాప్యం అనేది చాలా కీలకమైన దశ.. వయసు పెరిగే కొద్దీ మరొక మనిషి తోడు కావాలి. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, పిలిస్తే పలికే మనిషి ఆసరాగా ఉండాలి. ముసలితనంలో ఆమె బాగోగులు చూసుకోవలసిన కన్న కొడుకే అలా వదిలి వెళ్లిపోతే, ఆ తల్లి మనసు ఎంత కలతకు గురవుతుంది.
పిల్లవాడికి మంచి, చెడు తెలియచేస్తూ మంచి మార్గంలో నడవాలని, ప్రయోజకుడు కావాలని ఎన్నో కలలు కంటుంది అమ్మ.. చెడు వ్యసనాలకు దూరమై కొడుకు దారికి వస్తాడని, తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడని ఎన్నో కలలు కన్నది పార్వతమ్మ. కానీ, యాదయ్యలో ఎలాంటి పరివర్తనం లేదు. అతడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
నాగన్న ఆమెకు ఎంతో ఓదార్పును ఇస్తున్నాడు. ధైర్యం చెప్పాడు. భర్త పోయిన దుఃఖం నుండి ఆమె నెమ్మదిగా కోలుకుంది. కానీ కొడుకును గురించి ఆలోచన మాత్రం ఎక్కువయ్యింది. వద్ధాప్యంలో తల్లి ఆలనా పాలనా చూడాల్సిన కొడుకే ఇలా బాధ్యతలు విస్మరిస్తే, ఆమె మనసు ఎంత వేదనకు గురౌతుందో అమ్మను అర్థం చేసుకున్న ప్రతి మనసు పశ్చాత్తాప పడగలదు.

యాదయ్య ఇంటికి రావడం మానుకున్నాడు. పట్నంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది పార్వతమ్మకు.
”కొడుకు పట్నంలో ఎక్కడ ఉన్నాడో ఏమో? ఏం తింటున్నాడో ? లేక పస్తులు ఉంటున్నాడో..” తల్లి మనసు తల్లడిల్లి పోతోంది. ఎంతయినా అమ్మ మనసు కదా! కన్నకొడుకును ఒకసారి చూడాలనిపించింది.
యాదయ్య పట్నంలో ఒక బస్తీలో ఉన్నాడని, ఆటో నడుపుతూ జీవితం గడుపుతున్నాడని నాగన్న ద్వారా తెలిసింది ఆమెకు. ప్రతి రోజు తాగేసి వేళ కాని వేళ ఇంటికి వస్తున్నాడని కూడా తెలిసింది. ఉన్న ఒక్క కొడుకు ఇలా కొరగాకుండా పోయాడేనని బాధను మనసులోనే దిగమింగుకుంది. కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆమెను మామూలు మనిషిగా చేసేందుకు నాగన్న చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఒకరోజు నాగన్న తన వెంట రాగా, కొడుకును చూడాలని పార్వతమ్మ పట్నం వెళ్ళింది. యాదయ్య ఇంట్లో లేడు.
కోడలికి తానెవరో తెలియదు. మొదటి సారిగా చూడటం. అందుకే పరిచయం చేసుకుంది పార్వతమ్మ. ముభావంగా వుండిపోయింది ఆ అమ్మాయి. మర్యాద పూర్వకంగానైనా పలకరించలేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు తను. అన్నీ మౌనంగానే సహించింది తాను. ఇంతలో యాదయ్య రానే వచ్చాడు.
ఎన్నేళ్ల తర్వాతనో అమ్మను చూసిన యాదయ్యలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఆమె యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోలేదు. తల్లి మనసు కలత చెందింది. అయినా బాధను తన గుండెల్లోనే దాచుకుంటూ ”యాదయ్యా బాగున్నావా నాయనా” అంది తన పమిటతో రెప్పలమీద జారుతున్న కన్నీటిని ఒత్తుకుంటూ.
ఆ కన్నీరు, చాలా రోజుల తర్వాత కొడుకును చూసానని రాలిన ఆనంద భాష్పాలు లాగానే కాకుండా, ఇన్నేళ్ళు గడచినా కొడుకులో మార్పు రాలేదేనని దుఃఖంతో రాలిన కన్నీళ్లు లాగా కూడా వున్నాయి.
దానికి కూడా సమాధానం కూడా ఇవ్వలేదు యాదయ్య.
”పోనీ.. ఒకమారైనా పల్లెకు వచ్చి వెళ్ళు నాయనా”.. ప్రాధేయపడుతూ అడిగింది ఆ మాతహదయం.
ఎంతో నచ్చచెప్పింది. వినలేదు. అతనిలో తల్లి అని కూడా గౌరవం లేదు. బదులుగా ”అసలు ఎందుకొచ్చావు, వెళ్ళిపో” అన్నాడు.. కోపంతో ముఖం చిట్లిస్తూ..
ఇదంతా వింటున్న నాగన్న మనసు బాధ పడింది. కన్నతల్లికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అనుకున్నాడు. అతనికి సర్దిచెప్పబోయాడు. ఎవ్వరి మాటలు వినే స్థితిలో లేడు యాదయ్య. బాధాతప్త హదయంతో వెనుదిరిగి జోగుపల్లెకు వచ్చారు పార్వతమ్మ నాగన్నలు.

కొడుకును గురించి పార్వతమ్మకు మనోదిగులు ఎక్కువైంది. నిద్రాహారాలు మానేసింది. ఆరోగ్యం క్రమేణా క్షీణించింది.
ఆమె పరిస్థితి చూసిన నాగన్న చలించి పోయాడు. మనసులోనే బాధ పడుతూ, ఆమెకు ఓదార్పును కలిగిస్తున్నాడు. అయినా ఆమె కోలుకోలేదు. వెంటనే పట్నంలో వైద్యం కూడా చేయించాడు.
లాభం లేక పోయింది. కొడుకును తలచుకుని ఆమె బాధ పడుతుందనుకుని, పట్నం వచ్చి యాదయ్యను కలిసి ”యాదయ్యా! అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నీ గురించి ఎక్కువ బెంగపెట్టుకుంది.. నిన్ను చూడాలని కలవరిస్తోంది. ఒకసారి పల్లెకు వచ్చి ఆమెను పరామర్శించి వెళ్ళు నాయనా” అన్నాడు.
సమాధానం లేదు యాదయ్య నుంచి..
మౌనంగా ఉన్న అతని వంక చూస్తూ, ”యాదయ్య, నిన్ను చూస్తే చాలు.. ఆమె మామూలు మనిషి అవుతుంది. నా మాట విను. అలా మొండిగా ప్రవర్తించమాకు. ఒకమారు వచ్చి అమ్మను పలకరించి పో..” బతిమాలాడు నాగన్న..
యాదయ్య నుంచి ఎలాంటి స్పందన లేదు.
‘అతనిది పాషాణ హదయం! కన్నతల్లి మీద ఏ కోశానా ప్రేమానురాగాలు లేని కర్కశుడు.. ఇలాంటి కొడుకు వున్నా ఒకటే లేకున్నా ఒకటే!’ అని మనసులో ఆనుకుని, విసుగు చెంది అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

పార్వతమ్మ పరిస్థితి అర్థం చేసుకున్న నాగన్న, ఇంటి దగ్గరే వుంటూ అన్ని సేవలు ఒక కొడుకు లాగా చేస్తున్నాడు.
పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. కొడుకు వుండి కూడా అనాధ నయ్యాయని బోరుమని రోదిస్తోంది.
”అమ్మా, ఇలా నీవు దిగులుపడుతూ నిద్రహారాలు మానేస్తే, నీ ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది చెప్పు” బాధతో అన్నాడు నాగయ్య.
ఇరుగు పొరుగు వచ్చి ఆమెను పరామర్శించి వెళుతున్నారు. క్షణ క్షణం ఆమెను కంటికి రెప్పలా కాపాడుతోంది నాగన్న భార్య యశోద.

పార్వతమ్మ కన్ను మూసింది. కొడుకు కోసం పరితపించిన ఆమె ప్రాణం గాలిలో కలిసి పోయింది.
”అమ్మా” అని నాగన్న చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. ఊళ్ళో వాళ్లందరూ ఆమె ఇంటి దగ్గరకు చేరుకున్నారు. నాగన్నను ఊరడించారు.
ఆ ఊరి గ్రామ సర్పంచ్‌ కూడా వచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. ఆమె భౌతిక దేహాన్ని ఇంటిముందు చెట్టు కింద ఉంచారు.
ఆమెను కడసారిగా చూసేందుకు, కొడుకును తోడుకుని రమ్మని గ్రామ సర్పంచ్‌ తన జీపును ఇచ్చి నాగన్నకు తోడుగా మరి కొందరిని పంపాడు. యాదయ్య ఇల్లు చేరుకున్న ఆ గ్రామ రైతులు –
”పార్వతమ్మ ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది యాదయ్య” అన్నారు.
”……. ”
”ఏం యాదయ్యా, సమాధానం ఇవ్వవేం?
నీ గురించి మనో దిగులు పెట్టుకున్న ఆమె, నిద్రహారాలు కూడా మానేసి, రాత్రింబవళ్ళు కలవరించి, పలవరించి ప్రాణాలు వదిలింది.
ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదయ్యా.. ఆమె బతికున్నన్నాళ్ళు నీవు ఆమెను దగ్గరికి తీసుకోకపోతివి.. సరికదా, ఒకరోజు ఆమె నీ ఇంటికి వస్తే అగౌరవ పరిస్తివి. ఆ రోజు ఆమె ఎంత కలత చెందిందో నీకు తెలుసా? మనసులో ఆమెకు ఎన్ని బాధలున్నా, వద్దాప్యంలో ఎన్ని కష్టాలు పడుతున్నా, నిన్ను చూడగానే అన్నీ మరచిపోయింది. ఆప్యాయంగా పలకరించింది. తల్లి మనసంటే అదీ.. అలాంటి అమ్మకు ఏమిచ్చి నీవు ఆమె ఋణం తీర్చుకోగలవు?
నీవు చదువుకుని, ఉత్తమ పౌరునిగా ఎదగాలని, ఉన్నత స్థాయికి చేరాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకు చివరికి నిరాశే మిగిల్చావు కదయ్యా! ముసలితనంలో ఉన్న ఆమెను చూడాల్సిన బాధ్యత నీది కాదా? ఇకనైనా నీవు మారాలి యాదయ్యా.. పద ఊరెళదాం. కొడుకుగా నీవు వచ్చి నీ ధర్మాన్ని నిర్వర్తించు. చివరిసారిగా ఆమెకు చేయవలసిన కర్మలు చేసి ఆ తల్లి ఋణం తీర్చుకో” మందలించారు గ్రామ రైతులు.
తల దించుకుని వారి మాటలు మౌనంగా వింటున్న యాదయ్యలో ఉలుకు పలుకు లేదు! ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
”ఏం యాదయ్యా, మాట్లాడవేం? నీకే చెబుతోంది.. ఆఖరి సారిగా అడుగుతున్నా, కొడుకుగా తల్లికి చేయవలసిన నీ కర్తవ్యాన్ని వచ్చి నెరవేర్చుకో” .. ఉద్వేగంతో అన్నాడు నాగన్న.
అయినా యాదయ్యలో కొంచెం కూడా మార్పు రాలేదు. అతనిని చూసి వారు ఛీత్కరించుకున్నారు.
ఇదంతా వింటున్న ఇరుగు పొరుగు వాళ్ళు యాదయ్య ఇంటి దగ్గరకు చేరుకున్నారు.
బస్తీలో జరిగే విషయాలు వేగంగా అందరికీ పాకిపోతాయి. తాపీమేస్త్రీలు, ఆటోలు నడుపుకుని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఆ బస్తీలో ఎక్కువ. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏదైనా తగవు వచ్చినా రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతారు. అలాగే ఎవరి ఇంట్లోనైనా శుభాకార్యం జరిగినా అందరూ కలసి తమ ఆనందాన్ని పంచుకుంటారు.
ఆటో నడిపే స్నేహితులు అతనిని మందలిస్తూ, ”యాదయ్యా, నీకు బుద్ధుందటయ్యా? ఆమె నీ కన్నతల్లి కదయ్యా.. నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మపై ఎందుకు నీలో ఇంత కాఠిన్యం బతికున్నంత కాలం , ఆమెను ఎలాగూ పట్టించుకోకపోతివి. ఆరోగ్యం బాగో లేనప్పుడు ఆమెను కనీసం పరామర్శించక పోతివి.. నాగన్న స్వంత కొడుకు కాకపోయినా, దగ్గరుండి అమ్మ బాగోగులు చూసుకున్నాడు. నిద్రాహారాలు మానేసి క్షణ క్షణం ఆమెకు సేవ చేశాడు. నీ మీద బెంగ పెట్టుకుని ఆమె అనారోగ్యంతో బాధపడితే కంటికి రెప్పలా కాపాడాడు. ఇప్పుడు అమ్మకు చేయవలసిన అంత్యక్రియలు కొడుకువైన నీతోనే చేయించాలని ఇంత దూరం వచ్చాడు. కొడుకుగా అది నీవు చేయవలసిన కర్తవ్యం.. ఒరేరు, నీకు కూడా ఒక కొడుకు ఉన్నాడనే విషయం గుర్తుంచుకో.. రోజులన్నీ ఇలాగే వుండవు. ఏదో ఒక రోజు వాడు కూడా నీ లాగే తిరగబడి ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ పరిస్థితి, నీ భవిషత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకో..” అని చీవాట్లు పెట్టారు.
వాళ్ళ మాటలు ఆయనకు తూటాల్లాగా దూసుకెళ్లాయేమో, ఆలోచనలో పడ్డాడు యాదయ్య.. ఇంతలో, ఆ బస్తీలో ఉండే తిరుపతయ్య అనే వద్ధుడు అతని వైపు చూస్తూ, ”యాదయ్యా, విను.. నేను ఒక పెద్దాయనగా చెబుతున్నా.. నీవు చాలా తప్పు చేస్తున్నావు. ఒక్కగా నొక్క కొడుకువని నిన్ను అపురూపంగా పెంచుకుంది ఆమె. సత్ప్రవర్తనతో మెలగుతూ మంచి పేరు తెచ్చుకుంటావని ఎన్నో కలలు కన్నది ఆ తల్లి.. ఆమె బతికున్నన్నాళ్ళు నీవు చేరదీయలేదు. ఇప్పుడు ఈ లోకాన్నే విడిచి ఆమె వెళ్ళిపోయింది. జన్మనిచ్చిన తల్లిని కనీసం ఆఖరి చూపైనా చూడు. ఆలస్యం చేయకుండా వెళ్ళు. కొడుకుగా నీ ధర్మాన్ని నిర్వర్తించు” పొగాకు చుట్ట కాలుస్తూ అన్నాడు..
”అవును యాదయ్య, అమ్మకు నాగన్న ఎంతో సేవ చేశాడు. ఆమెలో తన కన్నతల్లిని చూసుకున్నాడు. ఇప్పుడు నీతోనే అమెకు కర్మలు చేయించాలని అంత దూరం నుండి వచ్చాడు. ఆలస్యం చేయక త్వరగా వెళ్ళు. నీవు లేకుండా ఆమెకు అంత్యక్రియలు చేసేవారు ఎవరూ లేరు. కొడుకు ఉండి కూడా ఎవరూ లేని అనాధ కాకూడదు ఆ తల్లి..” అతని వీపు తట్టుతూ అంది తిరుపతయ్య భార్య సోమిదేవమ్మ..
వారి మాటలు విన్న యాదయ్యలో ఏదో పరివర్తన కనిపించింది. ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నాగన్న అతనిని ఓదార్చాడు. ఆలస్యం చేయకుండా భార్యను తోడుకుని నాగన్నతో పాటు తన ఊరు బయలు దేరాడు యాదయ్య..

– కరణం హనుమంతరావు,
6300043818

Spread the love