– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాని కోరుతూ కార్యకర్తలు శనివారం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణ, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయబ్ తహసీల్దారుకు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఇల్లందు, జూలూరుపాడు మండల కేంద్రాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా ర్యాలీ తీశారు. మణుగూరులో కాంగ్రెస్ మహిళా విబాగం రాష్ట్ర నాయకురాలు పోలేబోయిన శ్రీవాణి సంఘీభావం తెలిపారు. నల్లగొండ జిల్లాలో నల్లగొండలో ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం డీటీకి వినతిపత్రం అందజేశారు. ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.