‘రెరా’ నిబంధనలు పాటించాలి

 Rules of 'RERA' should be followed– లేకుంటే చర్యలు తప్పవు
– ఆ సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ హెచ్చరిక
– పలు సంస్థలకు నోటీసులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బిల్డర్లు తప్పనిసరిగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు పాటించాలనీ, లేనిపక్షంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆ సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ, కార్యదర్శి బాలకృష్ణ హెచ్చరించారు. అనేక సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి, చట్టవ్యతిరేకంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందనీ, వాటిలో కొన్ని సంస్థలకు తక్షణం నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. సదరు సంస్థల యజమానులు 15 రోజుల్లోగా షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇవ్వాలని చెప్పారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, యూడీఏ, స్థానిక సంస్థలు, ‘టీఎస్‌ రెరా’ అనుమతులు లేకుండా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు ప్రీలాంచింగ్‌ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించారు. ఎనిమిది (8) అంతకుమించి ప్లాట్లు, నిర్మాణాలు, 500 చదరపు మీటర్లకు మించిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు ‘రెరా’ చట్టం వర్తిస్తుందని వివరించారు. సామాన్యుల కష్టార్జితానికి ‘రెరా’ భద్రతనిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించి 70 శాతం నిధులను ఆ ఖాతాలోనే ఉంచి, దానికోసమే ఖర్చు చేయాలనీ, ఒక ప్రాజెక్టు నిధులు మరో ప్రాజెక్ట్‌కు మళ్ళించరాదని చెప్పారు. అలాంటి ప్రాజెక్టు కోసం నిధులు డ్రా చేసి వినియోగించడానికి సంబంధిత సివిల్‌ ఇంజనీర్‌, ఆర్కిటెక్ట్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ ధ్రువీకరణ తప్పనిసరి అనీ, ప్రతి మూడు నెలలకు ఓసారి భవన నిర్మాణ వివరాలు, నిధుల వినియోగం, బుకింగ్స్‌ సహా ఇతర వివరాలన్నింటినీ విధిగా ‘రెరా’కు సమర్పించాలన్నారు. తప్పుడు హామీలు ఇవ్వడం, ప్లాట్లు, ఇండ్లు, ఇతర భవనాలు బుక్‌ చేసుకున్న తర్వాత మాట మార్చటం, అనుమతించిన లేఔట్లలో ప్లాన్లు మార్చి నిర్మాణాలు చేపట్టడం ‘రెరా’ చట్టం ప్రకారం నేరాలని స్పష్టం చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ బుకింగ్స్‌లో మూడింట రెండు వంతుల కొనుగోలుదారుల ఆమోదంతో పాటు ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ తర్వాతే మార్పులకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. కొనుగోలుదారులకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మధ్య ‘రెరా’ వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌ చేసే ఏజెంట్లు కూడా విధిగా ‘రెరా’లో రిజిస్టర్‌ కావాలనీ, ప్రజలు అన్ని అనుమతులు పరిశీలించుకొనే ఆయా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అందమైన బ్రోచర్లు, ఏజెంట్ల మాటలు విని అనుమతులు లేని చోట్ల స్థలాలు, ఇండ్లు కొని మోసపోవద్దని హెచ్చరించారు.
‘రెరా’ ఉల్లంఘన సంస్థలు ఇవే..
1. రాధే గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎలాంటి ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ పొందకుండా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఉస్మాన్‌ నగర్‌లో రాధే పనోరమా అనే ప్రాజెక్టును ఫ్రీ లాంచింగ్‌ పేరుతో అమ్మకానికి పెట్టింది. ఈ సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.
2. ఓం శ్రీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ ఓం శ్రీ సిగెట్‌ పేరుతో ప్రాజెక్టు చేపట్టి ‘రెరా’ నుంచి ఏ,బీ,సీ,డీ బ్లాకులకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అనుమతి తీసుకుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ‘ఈ’ బ్లాక్‌ నిర్మాణం చేపట్టింది. దీనికీ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.
3. భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టు యాజమాన్యం తక్కువ రేట్లకే ప్లాట్లు అంటూ ఫ్రీలాంచ్‌ విక్రయాలు హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ప్రీ లాంచ్‌ ఇవెంట్స్‌ నిర్వహిస్తూ అక్రమంగా అమ్మకాలు చేస్తోంది. దీనికీ షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.
4. టీఎమ్‌ఆర్‌ నిర్మాణ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్రదర్శించకుండ కరపత్రాలు బ్రోచర్‌ల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. దీనికీ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు.
5. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్‌ సంస్థ ‘లేక్‌ వ్యూ’ పేరుతో ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ లేకుండా సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు సమీపంలోని ఎల్లాపూర్‌లో ప్లాట్లు విక్రయిస్తున్నది. దీనికి సంజాయిషీ కోరుతూ షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. వీరంతా 15 రోజుల్లోగా తమ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Spread the love