Saturday, May 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘రాజీ’పడలేకే రాజీనామా!?

‘రాజీ’పడలేకే రాజీనామా!?

- Advertisement -

తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్,మాజీ ఐఏయస్ అధికారి ఆకునూరి మురళి రెండు రోజుల కిందట రాజీనామా చేశారు. లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఇచ్చిన బాధ్యతను పూర్తిచేశానని చెబుతూ, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవి మరో మూడు నెలలు ఉంది. ఈ లోపే రాజీనామా చేయడం విద్యావేత్తల్లో చర్చకు దారితీసింది. రాజీనామా వెనుక లోతైన కారణాలు ఉన్నాయని భావిస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా సంస్కరణలో భాగంగా ఆకునూరి మురళీ ఛైర్మన్‌‌గా మరికొందరి విద్యావేత్తలతో తెలంగాణా విద్యాకమిషన్ ఏర్పాటు చేసింది.యుద్ధ ప్రాతిపదికన విద్యాకమిషన్ పాఠశాలలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యా విషయాలు, పలువురు విద్యారంగం ప్రముఖులతో చర్చించింది. ఇతరదేశాల విద్యా వ్యవస్థలను పరిశీలన చేసి తనదైన శైలిలో ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితిని వివరిస్తూ గత ఏడాది బడ్జెట్‌‌కు ముందే 355పేజీల కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తయారు చేసింది.

ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో బడ్జెట్‌‌కు కొద్దిరోజుల ముందు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టివిక్రమార్కకు నివేదిక అందజేసింది. ప్రభుత్వపాఠశాల నమోదు క్ష‍ీణత, సంస్కరణ రూపాన్ని ఛైర్మన్‌ ఆ నివేదికలో ఆవిష్కరణ చేశారు. తెలంగాణా పౌండేషన్, పబ్లిక్ స్కూల్స్ రెండురకాల పాఠశాలల ఏర్పాటును ప్రతిపాదించారు. మండలానికి 50కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి వంద మండలాలకు ఐదువేల కోట్ల బడ్జెట్‌‌తో ఆరు విద్యా సంవత్సరాల్లో రూ.31,500కోట్లతో తెలంగాణా పాఠశాల విద్యా సంస్కరణ పూర్తి అవుతుందనే సిఫార్సుతో నివేదిక అందించారు.అయితే గతేడాది బడ్జెట్ కు ముందే ఆయన సంస్కరణ సిఫార్సులు చేసినప్పటికీ తెలంగాణా పబ్లిక్ స్కూల్స్‌‌కు బడ్జెట్‌‌లో ఒక్కపైసా కేటాయించలేదు. సరికదా! రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల అనబడే ఓ మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా అమలు జరిపాలని ప్రభుత్వం కోరింది. గత సంవత్సరం ఆకునూరి మురళీ బృందం ఆ పని విజయవంతంగా పూర్తిచేసింది.అయితే అదే ఏడాది తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ను పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మానసపుత్రిక అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు 58కి శంకుస్థాపన చేశారు. గతేడాది ఆ యంగ్ ఇండియా స్కూల్స్కు రూ. 15,500కోట్లు ఖర్చు చేసినట్లు కూడా ఆయన ప్రకటించారు.

అయినా ఇంతవరకు ఎక్కడా ఒక్క పాఠశాల ప్రారంభం చేసిన జాడలేదు. ఇదిలా ఉండగానే బీఆర్‌ఎస్‌ ‌నుంచి కాంగ్రెస్‌‌లో చేరిన కె.కేశవరావును విద్యాహక్కు చట్టం, నూతన విద్యావిధానం అమలు చైర్మెన్ గా మరికొందరు విద్యాశాఖ అధికారులతో ప్రస్తుతమున్న కమిటీకి ప్రత్యామ్నాయంగా నియమించారు. ఒకవైపు ఆకునూరి మురళీ కమిటీ ఉండగానే, విద్యావ్యవస్థ ప్రక్షాళన పేరుతో కేశవరావు నేతృత్వంలో మరో కమిటీ వేయడంతో విద్యాశాఖ లో జోడు గుర్రాల స్వారీకి తెలంగాణా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లయింది. అధికారుల్లో కూడా కొంత అయోమయం చోటుచేసుకుంది. దీనితో తెలంగాణ విద్యాశాఖ ఎవరి సిఫార్సులు స్వీకరించాలనే అనుమానంలో పడింది. అప్పటికే అంతర్గతంగా ఆకునూరి మురళీ కొంత సంఘర్షణ పడుతున్నప్పటికీ రాష్ట్ర విద్యా ప్రయోజనం రిత్యా సర్దుకొని పోయినట్లు తెలిసింది. ఇక ఈఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే “తెలంగాణా విద్యా ప్రణాళిక” రూపొందించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మురళీ నివేదిక అందజేశారు. ఆ నివేదికలో గత ఏడాది నివేదిక కంటే కొంత కుదించి మండలా నికి రెండు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ చొప్పున వంద శాసనసభా నియోజక వర్గాలు, ఎంపిక చేసి రెండు వందల మండలాల్లో ఏడాదికి 400 తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, 2029-30నాటికి 37,100కోట్లతో ప్రణాళిక పూర్తి చేయాలని విద్యా ప్రణాళికలో పొందుపరిచారు.

ఈ నివేదిక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టారు.ఈమేరకు తెలంగాణా విద్యా ప్రణాళిక ఈ ఏడాది వంద మండలాలకే పరిమితం చేస్తూ ప్రకటించారు. కానీ విద్యా బడ్జెట్ లో మాత్రం ఒక్కపైసా ఇందుకోసం కేటాయించలేదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నా తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ గురించి ఇటీవల జరిగిన విద్యా వారోత్సవాలు సభలో ముఖ్యమంత్రి కనీసంగా ప్రస్తావించలేదు.పదేపదే మరో సలహాదారు కె.కేశవరావుకు ప్రాదాన్యత ఇస్తూ మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు, ఆయన నిర్మోహమాటంగా చేసిన సూచనలు, ఉపాధ్యాయుల వేతనాలు కోత విధించమన్నారనే తప్పుడు ప్రచారం కూడా కొందరు ఆయనపై చేశారు. మురళీ చేసిన విద్యా సిఫార్సులు స్థూలంగా చెప్పాలంటే ప్రయివేటు విద్యా వ్యవస్థ నియంత్రణ, ప్రభుత్వ విద్యావ్యవస్థ సంస్కరణ ప్రధానాంశంగా ఉంది. ఇది కార్పొరేట్‌ యాజమాన్యానికి మింగుడు పడలేదు? ఇది అమలు కావద్దని ముఖ్యమంత్రిపై ఒత్తిడి వచ్చిందా? అనే అనుమానం కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో తన సిఫార్సులను ఆచరణాత్మక రూపం తీసుకొని రాకపోవడం పట్ల మురళీ కాస్తా కినుక వహించినట్లు తెలుస్తోంది? ముక్కుసూటి మనస్తత్వం, తనదైన వ్యక్తిత్వం కలిగిన ఆకునూరి మురళి రాజీ స్వభావం ఉన్న వ్యక్తి కాదు. గతంలో ఏపీ లో సలహాదారుగా పనిచేసి ఎన్నో విద్యామార్పులకు శ్రీకారం చుట్టారు.ఆంగ్లమాద్యమం పట్ల ఆయన ఆసక్తి చూపారు. తెలంగాణా స్వంత రాష్ట్రానికి సేవచేయాలని ఏపీ విద్యా సలహాదారునిగా వైదొలగి తెలంగాణా విద్యా కమిషన్ బాద్యతలు చేపట్టారు. పైగా విద్యా రంగం పట్ల అనుభవం,ఆచరణ, అంకిత భావం కలిగిన ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన రాజీనామా తెలంగాణా విద్యావ్యవస్థకు నష్టదాయకమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఎన్.తిర్మల్, 9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -