– లక్ష్మీపురం భూ దందాపై రెవెన్యూ అధికారుల విచారణ!
నవతెలంగాణ -పరకాల
పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయిస్తూ లక్షలాది రూపాయలు వెనకేస్తున్న ‘మోతెబరి’ వ్యవహారంపై ‘నవతెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించింది. వార్త ప్రచురితమైన 24 గంటల్లోనే అధికారులు రంగంలోకి దిగడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాసిల్దార్ తోట విజయలక్ష్మి ఆదేశాల మేరకు బుధవారం అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఎఆర్ఐ) ఆధ్వర్యంలో లక్ష్మీపురంలో భూదందా వ్యవహారంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు.
ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివాదాస్పదంగా మారిన సర్వే నంబర్ 371తో పాటు, దాని పక్కనే ఉన్న సర్వే నంబర్ 359 భూములు కూడా పూర్తిగా ప్రభుత్వానికి చెందినవేనని తాసిల్దార్ తోట విజయలక్ష్మి అధికారికంగా వెల్లడించారు. ప్రభుత్వ భూములను సొంత ఆస్తిగా చూపిస్తూ అమాకుల నుంచి లక్షలాది రూపాయలు గుంజుతున్న వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. సదరు సర్వే నంబర్లలో భూమి పరిస్థితిని, అక్రమ విక్రయాల తీరును రెవెన్యూ బృందం పరిశీలించింది.
ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తయిందని, సదరు భూములను పూర్తిస్థాయిలో రీ-సర్వే చేసిన అనంతరం అక్రమార్కులపై తదుపరి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తాసిల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినా సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ‘నవతెలంగాణ’ కథనంతోనైనా అధికారులు స్పందించి విచారణ జరపడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేయాలని, అమాయకులను మోసం చేసిన మోతెబరిపై, అతనికి సహకరించిన ప్రజా ప్రతినిధిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



